మెదక్ జిల్లాకు చెందిన శ్రీదేవి (పేరు మార్చాం) ముక్కు లోపల కురుపు ఏర్పడడంతో కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రికి వచ్చింది. వ్యాధి తీవ్రతను బట్టి ఆమెకు సర్జరీ తప్పదని వైద్యులు తెలిపారు. కానీ...ఈఎన్‌టీలో ఆపరేషన్ థియేటర్లు, మౌలిక వసతులు, వైద్యుల కొరత కారణంగా ఆమెకు సర్జరీ చేయడానికి నాలుగు నెలల తర్వాత తేదీ ఇచ్చారు. అప్పటి వరకు వేచి ఉండలేక శ్రీదేవి బంధువులు ప్రత్యామ్నాయం గురించి ఈఎన్‌టీ వైద్యులను అడగ్గా..వారు ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు మూడు రోజుల్లోనే సర్జరీ పూర్తి చేసి ఇంటికి పంపిస్తామని తెలిపారు. దీంతో వారు తప్పనిసరి పరిస్థితిలో వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నారు...ఇది ఒక్క శ్రీదేవి సమస్యే కాదు...నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సర్జరీ సంబంధిత వ్యాధులతో వస్తున్న రోగులందరిదీ.
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రులకు జబ్బు చేసింది. వీటికి సర్జరీ చేసేందుకు వైద్యులు విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఏటా ఆయా ఆస్పత్రుల్లో సర్జరీల సంఖ్య తగ్గు ముఖం పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా అన్ని బోధనా సుపత్రులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించింది. 60 శాతం నిధులను వైద్యపరికరాల కొనుగోలుకేకేటాయించింది. వైద్యులకు పదోన్నతులు కల్పించి ఖాళీలను కూడా చాలా వరకు భర్తీ చేసింది. అయినా ఆయా ఆస్పత్రుల్లో ఆశించిన స్థాయిలో సర్జరీలు జరగడం లేదు. ఔట్ పేషంట్ల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ..సర్జరీల సంఖ్య కూడాతగ్గింది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో హృద్రోగులకు ఈసీ జీ, 2–డి ఎకో, యాంజియోగ్రామ్ వంటి సాధారణ చికిత్సలు మినహా క్లిష్టమైన ఓపెన్‌హార్ట్,గుండె, వాల్వŠస్ మార్పిడి, మూసుకుపోయిన రక్తనాళాలను తెరిపించడం వంటి చికిత్సలు అందడం లేదు. 37 ఏళ్ల క్రితమే కిడ్నీ మార్పిడి చికిత్స చేసిన ఉస్మానియా సహా గాంధీ మూత్రపిండాల చికిత్సల విభాగాలు ప్రస్తుతం సాధారణ డయాలసిస్ సర్వీసులకే పరిమితమవడం కొసమెరుపు.
ఉస్మానియాతో పోలిస్తే గాంధీ ఆస్పత్రి కొంత భిన్నమైంది. కొత్త భవనంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడే ఉన్నాయి. 1012 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రికి గతంతో పోలిస్తే ఓపీ బాగా పెరిగింది. ఇక్కడికి రోజుకు సగటున 3500 మంది వరకు వస్తుంటారు. ఆస్పత్రిలో 30కి పైగా ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ప్రభుత్వం తాజాగా మరో 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. ఆస్పత్రిలో గుండె, కిడ్నీ బాధితులకు కనీస చికిత్సలు అందడం లేదు. వీరంతా సమీపంలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలి పోతున్నారు. అనస్థీషియన్ల కొరతకు తోడు వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాల వల్ల తరచూ సర్జరీలు నిలిచిపోతున్నాయి. ఇక్కడికి వస్తున్న ఆరోగ్యశ్రీ రోగులను..కొంత మంది వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా బినామీ ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స చేయాలంటే కనీసం నెల రోజులపైనే పడుతుందని, అదే తమకు తెలిసిన నర్సింగ్ హోమ్‌లో చేరితే రెండు మూడు రోజుల్లో చికిత్స చేసి పంపుతారని చెబుతుండడం బహిరంగ రహస్యమే. ఆశించిన స్థాయిలో సర్జరీలు జరగక పోవడానికి ఇదేకారణమని అంటున్నారు.
నిలోఫర్‌లో ఇదీ సీన్
1953లో 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అత్యాధునిక రాజీవ్ ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. పడకల సంఖ్యను సైతం 500 నుంచి 1000కి పెంచారు. ఇక్కడికి నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించిన శిశువులతో పాటు పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడిన చిన్నారులు, వివిధ అవయవాల లోపంతో బాధపడుతూ జన్మించిన శిశువులను ఎక్కువగా తీసుకొస్తుంటారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు ఉన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ 2016లో 11305 సర్జరీలు చేస్తే..2018లో వీటి సంఖ్య 2668కి పడిపోయింది. ఆస్పత్రి వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలకు తోడు ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్ తక్కువగా ఉండటం వల్ల చాలా మంది వైద్యులు చికిత్సలు చేసేందుకు ఆసక్తిచూపడం లేదు. శిశువులకు చికిత్స చేసే వైద్యులు అందుబాటులో లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేమి వల్ల వారంతా సమీపంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు.
వాళ్లకు వినిపించదు..వీళ్లకుకన్పించదు
125 పడకల సామర్థ్యం ఉన్న చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1500 మంది వస్తుంటారు. వినికిడి లోపంతో బాధపడుతున్న వారితో పాటు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న రోగులు వస్తుంటారు. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో సర్జరీ కోసం నాలుగు నుంచి ఆరు మాసాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ జాప్యం వల్ల రోగులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇక్కడ పని చేస్తున్న కొంత మంది వైద్యులు రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు. అంతో ఇంతో ఆర్థికస్తోమత ఉన్న మధ్య తరగతి రోగులను సొంత క్లినిక్స్‌కు తరలించుకుని చికిత్సలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2015తో పోలిస్తే 2018లో చికిత్స సంఖ్య భారీగా తగ్గడానికి ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉష్...మానియా
ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేసిన గుర్తింపుతో పాటు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స చేసిన ఘనత సాధించిన ఉస్మానియా ఆస్పత్రిలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు దేశంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సాధారణ చికిత్సలూ కరువయ్యాయి. ప్రస్తుతం అధికారికంగా 1,168 పడకలు ఉండగా, అనధికారికంగా 1,385 పడకలు ఉన్నాయి. నిత్యం 1,400 మంది రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు 250 మంది వస్తుండగా, వీరిలో అత్యధికులు ప్రమాదాల్లో గాయపడినవారు, పాయిజన్, పాముకాటు బాధితులు, న్యూరో సంబంధిత బాధితులే. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు ఏడాది క్రితం వరకు అనేక అరుదైన చికిత్సలు చేసి ఆస్పత్రి చరిత్రను తిరగ రాశారు. కానీ కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ విభాగాలు ఉన్నా లేనట్లుగానే తయారయ్యాయి. నిపుణుల కొరతతో పాటు మౌలిక సదుపాయాల లేమి ఫలితంగా కనీస వైద్యసేవలు అందడం లేదు. గతంతో పోలిస్తే ఇక్కడ సర్జరీలు తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆ చికిత్సలకు ముందుకు రాని వైద్యులు
ప్రస్తుతం నిమ్స్ జీవన్‌దాన్‌లో 6732 మంది అవయవ మార్పిడి చికిత్సల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 3579 మంది కిడ్నీ బాధితులు కాగా, 3020 మంది కాలేయ ఫెయిల్యూర్ బాధితులు ఉన్నారు. సాధారణ చికిత్సలతో పోలిస్తే అవయవ మార్పిడి చికిత్సలు చాలా ఖరీదుతో కూడినవి. గుండె, కాలేయం, మూత్ర పిండాల పనితీరు దెబ్బతినడంతో మృత్యువాతపడుతున్న రోగుల సంఖ్య బాగా పెరిగింది. ఖరీదైన చికిత్సలను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చింది. సర్జరీ చేసిన వైద్యులకు ప్రోత్సాహకాలను కూడా భారీ గానే ఇస్తుంది. కానీ ఆస్పత్రిలోని ఆయా విభాగాధిపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడం, ఒకరికొకరు సహకరించుకోక పోవడం, తగిన గుర్తింపు రాక సర్జరీలు చేయాలనే ఆసక్తి ఉన్న వైద్యులు కూడా ముందుకు రావడం లేదు. ఆయా ఆస్పత్రుల్లో సర్జరీలు సంఖ్య తగ్గుదలకు ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment