వేలిముద్రలు మార్చి.. కువైట్‌కు తిప్పి పంపి! ఇంతకూ ఆ దేశానికే ఎందుకు? | Hyderabad: 4 Held For Changing Fingerprints By Surgery To Enter Kuwait Illegally | Sakshi
Sakshi News home page

Fingerprint Racket: వేలిముద్రలు మార్చి.. కువైట్‌కు తిప్పి పంపి! ఇంతకూ ఆ దేశానికే ఎందుకు?

Published Fri, Sep 2 2022 3:37 AM | Last Updated on Fri, Sep 2 2022 7:32 AM

Hyderabad: 4 Held For Changing Fingerprints By Surgery To Enter Kuwait Illegally - Sakshi

సర్జరీ తర్వాత కుట్లతో, నెల తర్వాత ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: వేలిముద్రలు పడకుండా చోరీలు చేసే కిలాడీల కథలు లేదా నకిలీ వేలిముద్రలతో నేరాలకు పాల్పడే కేటుగాళ్ల ఉదంతాల గురించి మీరు ఇప్పటివరకు విని ఉంటారు. కానీ ఏకంగా శస్త్రచికిత్సల ద్వారా వేలిముద్రలను మార్చి కువైట్‌ నుంచి బహిష్కరణకు గురైన వలస కార్మికులను అక్రమంగా తిరిగి ఆ దేశం పంపుతున్న ఓ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు తొలిసారి రట్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం (ఎస్‌ఓటీ) డీసీపీ కె. మురళీధర్‌తో కలసి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. 


పోలీసుల అదుపులో నిందితులు 

వేలిముద్రల సర్జరీ గురించి తెలుసుకొని.. 
సీపీ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్‌ కడప జిల్లా సిద్దవటం మండలం జ్యోతి గ్రామానికి చెందిన గజ్జలకొండగారి నాగమునేశ్వర్‌రెడ్డి తిరుపతిలోని చంద్రగిరిలోని కృష్ణా డయాగ్నస్టిక్స్‌లో రేడియాలజిస్ట్‌. అతనికి ఓ రోజు కువైట్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాటల సందర్భంలో తాను వీసా గడువు ముగిశాక కువైట్‌లో అక్రమంగా ఉండటంతో ఆ దేశ అధికారులు తిప్పి పంపారని... దీంతో శ్రీలంక వెళ్లి అక్కడ మ్యూటిలేటెడ్‌ ఫింగర్‌ప్రింట్స్‌ సర్జరీ చేయించుకొని మళ్లీ కువైట్‌కు వెళ్లినట్లు వివరించాడు.

ఈ శస్త్రచికిత్స ద్వారా వేలిముద్రలు తాత్కాలికంగా కొత్త రూపంలోకి మారతాయని పేర్కొన్నాడు. ఈ సర్జరీ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయిన మునేశ్వర్‌... కువైట్‌ నుంచి బహిష్కరణకు గురైన వారికి ఈ సర్జరీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్లాన్‌ను తిరుపతిలోని డీబీఆర్‌ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా పనిచేస్తున్న వైఎస్సార్‌ కడప జిల్లా సుండుపల్లి గ్రామానికి చెందిన సాగబాల వెంకట్‌ రమణకు తెలపగా అతను అంగీకరించాడు. 

తొలుత రాజస్తాన్‌కు... 
మునేశ్వర్‌రెడ్డికి కువైట్‌లోని తన స్నేహితుడి ద్వారా ఆ దేశం నుంచి బహిష్కరణకు గురైన రాజస్తాన్‌లోని ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వారికి మ్యూటిలెటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సర్జరీ చేసేందుకు మునేశ్వర్, వెంకట రమణ రాజస్తాన్‌కు వెళ్లారు. ఒక్కొక్కరికీ రూ. 25 వేల చొప్పున వసూలు చేసి శస్త్రచికిత్స చేశారు. అక్కడి పరిచయాలతో కేరళలోని మరో వ్యక్తి మునేశ్వర్‌ను సంప్రదించాడు. ఈ ఏడాది మేలో మునేశ్వర్, వెంకటరమణ కేరళకు వెళ్లి ఆరుగురికి ఈ సర్జరీ చేసి రూ. లక్షన్నర వసూలు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కడప జిల్లా జ్యోతి గ్రామానికి చెందిన బోవిళ్ల శివశంకర్‌రెడ్డి, పాత అట్లూరి గ్రామానికి చెందిన రెండ్ల రామకృష్ణారెడ్డిలతోపాటు మరో వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించారు. 

కువైటే ఎందుకంటే? 
కువైట్‌ ఇమ్మిగ్రేషన్‌ విభాగంలో ఐరిస్, ఫేస్‌ రికగ్నిషన్‌ సాంకేతికత అందుబాటులో లేదు. కేవలం వేలిముద్రల స్కానింగ్‌ మాత్రమే ఉంది. దీన్ని నేరస్తులు ఆసరాగా చేసుకుంటున్నారు. దీంతోపాటు ఒక కువైటీ దినార్‌ భారతీయ కరెన్సీలో రూ. 258.15గా ఉండటం మరో కారణం. 

ఎలా చేస్తారంటే? 
చేతివేళ్ల మొనలపై చర్మం పొరను కత్తిరించి కణజాలంలో కొంత భాగాన్ని తీసేస్తారు. సర్జరీ కిట్‌ను ఉపయోగించి కుట్లు వేస్తారు. ఒకట్రెండు నెలల్లో గాయం మానాక వేలిముద్రల నమూనాలలో స్వల్ప మార్పులు వస్తాయి. ఈ కొత్త ఫింగర్‌ ప్రింట్లు ఏడాదిపాటు ఉంటాయి. ఆ తర్వాత యథాస్థితికి వచ్చేస్తాయి. దీంతో ఈలోగా కొత్తగా ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, ఇతరత్రా గుర్తింపు కార్డులను కేటుగాళ్లు పొందుతున్నారు. వాటితో కొత్త అభ్యర్థి లాగా కువైట్‌కు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కువైట్‌ ఇమ్మిగ్రేషన్‌లో స్కానర్‌లో వేలిముద్రలను నమోదు చేసుకుంటున్నప్పుడు మ్యూటిలేటెడ్‌ ఫింగర్‌ప్రింట్స్‌ కావడంతో కొత్త ప్రవాసుడు అనుకొని వీసా స్టాంపింగ్‌ వేస్తున్నారు.  

ఒకవేళ కువైట్‌లో పట్టుబడితే.. 
ఒకసారి బహిష్కరణకు గురైతే పాస్‌పోర్టు రద్దవుతుంది. అందుకే నేరస్తులు మ్యూటిలెటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌లతో కొత్త పాస్‌పోర్టు, వీసాలను పొందుతున్నారు. ఒకవేళ అక్కడి పోలీసులకు చిక్కినా.. అక్రమ పాస్‌పోర్టు కలిగి ఉన్నందుకు 2–7 రోజుల జైలుశిక్ష అనంతరం స్వదేశానికి డిపోర్ట్‌ అవుతున్నారు. ఆపై మళ్లీ మ్యూటిలేటెడ్‌ ఫింగర్‌ ప్రింట్స్‌తో మళ్లీ కువైట్‌కు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసంపై కువైట్‌ ఎంబసీని, ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు లేఖ రాస్తామని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. 

హైదరాబాద్‌లో సర్జరీ కోసం వచ్చి... 
ఇప్పటివరకు ఈ ముఠా 11 మంది కువైట్‌ బహిష్కృతులకు ఈ సర్జరీలు నిర్వహించిందని.. వారిలో కొందరు నకిలీ పాస్‌పోర్టు, వీసాలతో మళ్లీ కువైట్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కువైట్‌ నుంచి బహిష్కరణకు గురైన పలువురు హైదరాబాదీలకు ఈ ముఠా సభ్యులు పరిచయమయ్యారు. దీంతో వారికి ఈ సర్జరీ చేసేందుకు కడప నుంచి ఈ ముఠా సభ్యులు గత నెల 29న అన్నోజిగూడకు చేరుకున్నారు.

ఈ సమాచారం అందుకున్న మల్కజ్‌గిరి ఎస్‌ఓటీ, ఘట్‌కేసర్‌ పోలీసులు... నిందితులు బస చేసిన లాడ్జీపై ఆకస్మిక దాడులు చేసి మునేశ్వర్‌రెడ్డి, వెంకటరమణ, శివశంకర్, కృష్ణారెడ్డిలను అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో 9 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని సీపీ తెలిపారు. నిందితుల నుంచి 4 సెల్‌ఫోన్లు, సర్జికల్‌ గ్లౌవ్స్, అయింట్‌మెంట్, యాంటీ బయోటిక్‌ మాత్రలు, హైడ్రోక్లోరైడ్‌ జెల్, ఇంజెక్షన్లు, సోడియం క్లోరైడ్‌ సొల్యూషన్‌ ఇతరత్రా సర్జరీ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement