డ్రైవర్లు లేక నిలిచి పోయిన లారీలు
రాయవరం (మండపేట): వస్తు, సామగ్రి రవాణాలో లారీలదే ప్రథమ స్థానం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లారీ పరిశ్రమ వెన్నెముకగా నిలుస్తోంది. ఇంతటి కీలకమైన లారీ పరిశ్రమ, దానిని నమ్ముకున్న కార్మికులు, యజమానులు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నారు. లారీ నడపడానికి డ్రైవర్లు లభించక, పెరిగిన డీజిల్, పన్నులు చెల్లించలేక యజమానులు లారీలను అమ్ముకుంటున్నారు.
జిల్లాలో 32వేల లారీలు..
లారీ పరిశ్రమలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఒకప్పుడు ద్వితీయ స్థానంలో ఉండగా, విజయవాడ ప్రథమస్థానంలో ఉండేది. జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట, అనపర్తి, అమలాపురం తదితర ప్రాంతాల్లో లారీలు అధికంగా ఉన్నాయి. 30 లారీ యూనియన్ అసోసియేషన్లు ఉన్నాయి. జిల్లా నుంచి కలకత్తా, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, చత్తీస్‌ఘడ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వీటిపై ఆధారపడి సుమారు రెండు లక్షల మంది కార్మికులు జీవిస్తున్నారు. ఒక లారీపై 13 రకాల వృత్తులు చేసే కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
యువత అనాసక్తి..
రవాణా రంగంలో కీలకమైన లారీ రంగంలోకి డ్రైవర్లుగా ప్రవేశించడానికి యువత ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లు క్లీనరుగా పనిచేస్తే డ్రైవరుగా పదోన్నతి లభించేది. గతంలో కేవలం లారీ నడపడం వస్తే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేవారు. ప్రస్తుతం లైసెన్స్ మంజూరుకు ఉన్న నిబంధనలు కఠినతరమయ్యాయి. పదో తరగతి చదివిన వారినే అర్హులుగా పరిగణిస్తున్నారు. దీంతోపాటు లైసెన్స్ పొందడానికి మామూళ్లు ముట్టజెప్పనిదే లైసెన్స్ చేతికి రావడం లేదన్న విమర్శలున్నాయి. హెవీ లైసెన్స్ కావాలంటే ఆర్టీవో కార్యాలయంలో రూ.16 నుంచి 20వేల వరకు ఖర్చవుతుంది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారు వేలాది రూపాయలు వెచ్చించి లైసెన్స్ పొందడానికి ముందుకు రావడం లేదు. లారీలు సుదూర ప్రాంతాలకు వెళితే నెలల తరబడి ఇంటికి రావడం కుదరక పోవడం, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుతుండడం, లారీలు నడిపే సమయంలో దారిదోపిడీలతో ప్రాణభయం ఉండడంతో పలువురు ఇష్టం చూపడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో డ్రైవర్లపై ప్రజలు భౌతిక దాడికి పాల్పడడం, సంఘటన స్థలంలోనే నష్టపరిహారం కోరడం తదితర కారణాలు, తమ ప్రమేయం లేకుండా ప్రమాదాలు జరిగితే తమ లైసెన్సులు రద్దవుతాయని మరికొంతమంది లారీలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో డ్రైవర్ల కొరతతో 30శాతం లారీలు ఆఫీసుల వద్దే నిలిచి పోతున్నాయి.
నిర్వహణ భారమే..
లారీ నిర్వహణ ఖర్చులు యజమానికి భారంగా మారుతున్నాయి. మూడు నెలలకు ఒకసారి రూ.20వేలుగా ఉన్న ఇన్సూరెన్స్ రూ.50వేలకు చేరింది. లారీ పర్మిట్‌కు రూ.20వేలు, రాష్ట్రాల సరిహద్దుల్లో పాసింగ్‌కు రూ.రెండు వేలు ఉంటుంది. దీంతోపాటు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో డీజిట్ ధర నాలుగు శాతం అధికంగా ఉంది. డీజిల్ రూపంలో నెలకు రూ.18వేల వరకు అదనంగా ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వలన టైర్లు, విడిభాగాల ధరలు అధికమయ్యాయి. రూ.30వేలు ఉన్న జత టైర్ల ధర జీఎస్టీ ప్రభావంతో 45వేలు, రూ.ఐదు వేలు ఉన్న 20కేజీల గ్రీజు డబ్బా ధర రూ.ఏడు వేలకు చేరింది. విడి భాగాలపై 12శాతం, లారీల నిర్వహణపై 28శాతం జీఎస్టీ పన్నులు విధించారు. ఒక లారీకి 36 రకాల పన్నులు చెల్లిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒడిశా, కలకత్తా మార్గంలో రవాణాశాఖ అధికారులు నిబంధనల పేరుతో చేస్తున్న దాడులు ఇబ్బందికరంగా ఉన్నట్టు లారీ యజమానులు వాపోతున్నారు. మరోవైపు రహదారులు అధ్వానంగా ఉండడం కూడా లారీ డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment