మహా’ సిబ్బంది కొరత | Staff Shortage in HMDA Hyderabad | Sakshi
Sakshi News home page

మహా’ సిబ్బంది కొరత

Published Mon, Apr 29 2019 6:40 AM | Last Updated on Mon, Apr 29 2019 6:40 AM

Staff Shortage in HMDA Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్న హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు సిబ్బంది కొరత వేధిస్తోంది. అయితే హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం నుంచి 2003లో మంజూరైన 600 పోస్టులకు గాను ప్రస్తుతం పనిచేస్తోంది 306 మంది మాత్రమే. దీంతో సిబ్బందిపై పని ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఈ అంకెలు చెప్పకనే చెబుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అకౌంట్స్, ప్లానింగ్‌ విభాగం, డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, అర్బన్‌ ఫారెస్ట్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ కలిపి 294 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఏటికేడు సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నారే కానీ కొత్త నియమాకాలు చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడుతోంది. అయితే వివిధ సంస్థల నుంచి పదోన్నతిపై వచ్చి పనిచేసేవారు 40 మంది ఉండటంతో  నెట్టుకొస్తున్నారు.  

ప్లానింగ్‌ విభాగంపై పనిభారం..
నగర శివారు ప్రాంతాలను అభివృద్ధి పుంతలు తొక్కించే లేఅవుట్లు, బిల్డింగ్‌ పర్మీషన్లకు అనుమతిలిచ్చే ఈ అధికారుల సంఖ్య నెలలు తిరక్కుండానే తగ్గుతుండటంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. తాజాగా నగర శివారు ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లను గుర్తించాలంటూ హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ నిర్ణయం తీసుకోవడంతో  పనిభారం రెండింతలు కానుంది. అయితే హెచ్‌ఎండీఏకు ప్రభుత్వం నుంచి 2003లో మంజూరైన 110 పోస్టులకు ప్రస్తుతం పని చేస్తోంది 57 మంది మాత్రమే. చివరిసారిగా 2009లో 11 మంది జూనియర్‌ ప్లానింగ్‌ ఆఫీసర్ల నియామకం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు నియామకాలు చేపట్టలేదు.

సిబ్బంది తక్కువ.. పని ఎక్కువ
లే అవుట్, బిల్డింగ్‌ పర్మీషన్ల కోసం డెవలప్‌మెంట్‌ పర్మీషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (డీపీఎంఎస్‌)కు ఆన్‌లైన్‌ అనుమతుల దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జేపీవో, ఏపీవో స్థాయి అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోజుకు మూడు సైట్‌ ఇన్‌స్పెక్షన్లు అది కూడా వారి ప్రాంతానికి సంబంధించి కాక వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇన్‌స్పెక్షన్‌తోనే సమయం గడిచిపోతోంది. ఆ తర్వాత సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్, టెక్నికల్‌ స్క్రూటినీ, అవసరమైతే పైస్థాయి అధికారుల ఇన్‌స్పెక్షన్‌ కూడా ఉంటుంది. బిల్డింగ్‌ పర్మీషన్, లేఅవుట్‌ విత్‌ హౌసింగ్, మల్టీస్టోర్‌ బిల్డింగ్, లేఅవుట్, ల్యాండ్‌ యూజ్‌ సర్టిఫికెట్, పెట్రోల్‌ పంప్, చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ పనులన్నీ ప్లానింగ్‌ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన ప్రశ్నలకు సమాధానాలతో పాటు కోర్టు వరకు వెళ్లిన కేసుల్లో ఆయా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. క్వారీ ఎన్‌వోసీలు కూడా వీరే జారీ చేస్తున్నారు. ఇలా ఉంటే కొంతమంది సిబ్బందే అన్నీ పనులు పర్యవేక్షిస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది.  అయితే హెచ్‌ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరైన ప్లానింగ్‌ విభాగంలో సిబ్బంది పెంచాలంటూ ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్లానింగ్‌ విభాగంతో పాటు ఇతర విభాగాల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే ఆదాయం మరింత రెట్టింపయ్యే  అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement