‘ఉక్కు’లో ఉద్యోగ సంక్షోభం
►విస్తరణతో ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకుపైగా పెంపు
►అందుకు తగినట్లు ఉద్యోగ నియామకాలు లేవు
►ప్రారంభంలో ఉన్న ఉద్యోగుల సంఖ్యే ఇప్పటికీ కొనసాగింపు
►మరోవైపు సీనియర్లు, నిపుణుల పదవీ విరమణ ఉన్న సిబ్బందికి పెరుగుతున్న పనిభారం
రాష్ట్రంలోనే అతి పెద్ద కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్. అయితే ఏం లాభం.. పేరుకు పెద్దే గానీ.. ఇప్పటికీ సొంత గనులు సమ
కూర్చుకోలేని దుస్థితి.. మరోవైపు విస్తరణ ప్రాజెక్టులతో ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకుంటూపోతున్నా, అందుకు తగినట్లు శాశ్వత ఉద్యోగులను నియమించకపోవడంతో నిపుణులు, అనుభవజ్ఞుల కొరత.. ఈ పరిశ్రమ భవిష్యత్తుపై ఆందోళన రేపుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం రెండింతలకు పైగా పెరిగినా.. ప్రారంభంలో ఉన్న సిబ్బంది సంఖ్యే దాదాపు ఇప్పటికీ కొనసాగుతోంది. మరోవైపు సీనియర్లు పదవీ విరమణ చేస్తుండటం, మరణిస్తుండటంతో నిపుణుల కొరత ఎదురవుతోంది.
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సిబ్బంది కొరత నానాటికీ తీవ్రరూపం దాల్చుతోంది. విస్తరణతో ఉత్పత్తి సామర్ద్యం రెండింతలు పెరిగినప్పటికీ అందుకు తగ్గట్టుగా సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్న సిబ్బందికి పని భారం పెరిగింది. ఫలితంగా కొత్త విభా గాలను పూర్తిస్ధాయిలో నిర్వహించలేకపోతున్నారు. 1992లో స్టీల్‌ప్లాంట్‌ను అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి 2000–01లో పూర్తి ఉత్పత్తి సామర్థ్యం(మూడు మిలియన్ టన్నులు) సాధించే నాటికి ప్లాంట్‌లో 17,454 మంది శాశ్వత ఉద్యోగులు ఉండేవారు. వారిలో సీనియర్ అధికారులు 2,832 మంది, జూనియర్ అధికారులు 1,195 మంది కాగా కార్మికులు 13,104 మంది ఉన్నారు.
ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు పెరిగినా.. ఉద్యోగుల సంఖ్య మాత్రం దాదాపు అంతే ఉంది, ఉత్పత్తి పెంపుపైనే శ్రద్ధ ప్రారంభంలో మూడు మిలియన్ టన్నులున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మిలియన్ టన్నులకు పెంచడానికి 2005లో అనుమతి లభించింది. అదే సమయంలో మూడువేల మంది కొత్త ఉత్యోగులను పెంచడానికే కేంద్రం అనుమతినిచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర నిరసన వ్యక్తమైంది. అనంతరం చేపట్టిన ఆధునికీకరణ పనులతో ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం ప్రారంభంలో ఉన్న 17,454 నుంచి 17,875కు మాత్రమే పెరిగింది.
అంటే పెరిగిన ఉద్యోగుల సంఖ్య 744 మాత్రమే. ఉద్యోగులు పెరగకపోవడంతో పాత యూనిట్ల నుంచి కొత్త యూనిట్లకు ఉద్యోగులను బదిలీ చేశారు. ఫలితంగా యూనిట్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేని ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. స్పెషల్ బార్ మిల్, స్ట్రక్చరల్ మిల్, వైర్ రాడ్ మిల్–2 వంటి విభాగాల్లో అరకొరగా సిబ్బంది ఉండటంతో మూడు షిఫ్ట్‌లలో పని చేయించలేకపోతున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు.
పదవీ విరమణలతో మరింత కొరత
పెరిగిన ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా 20 వేల మంది శాశ్వత ఉద్యోగులను నియమించాలని నిర్ణయించినప్పటికి యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట ్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతి నెలా కనీసం 20 మంది పదవీ విరమణ చేస్తున్నారు. దాదాపు 10 మంది మరణిస్తున్నారు. వీటన్నిం టి వల్ల సీనియర్ ఉద్యోగుల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది. కాగా 2022 నాటికి సుమారు 4,600 మంది మొదటితరం ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ప్లాంట్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.