చీకట్లో సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లతో వైద్యం చేస్తున్న వైద్యులు (ఫైల్)
తూప్రాన్: అది పేరుకు పెద్దాస్పత్రి.. అందుతున్న సేవలు మాత్రం అంతంతే. అరకొర సిబ్బంది, అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే రోగులు, వారి సహాయకులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో తూప్రాన్ డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్న లక్ష్యంతో ప్రతి డివిజన్ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 50 పడకల ఆస్పత్రులను మంజూరు చేశారు. జిల్లాలో తూప్రాన్, నర్సాపూర్‌లో ఈ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టారు. తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే 2018 జనవరి 17న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వైద్యుల నియామకం జరగలేదు. ఆస్పత్రిలో తగిన వైద్య పరికరాలు లేక, మౌలిక సౌకర్యాలు కరువై రోగులు ఇబ్బంది పడుతున్నారు.
పెరుగుతున్న రోగుల సంఖ్య
గతంలో తూప్రాన్‌లో పీహెచ్‌సీ కొనసాగిన సందర్భంలో నిత్యం రోగుల సంఖ్య 100లోపు మాత్రమే ఉండేది. 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు కావడంతో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిత్యం 350 మంది వరకు వివిధ ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు. నెలకు సుమారు 11 వేల మంది ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో మాత్రం సరైన వైద్యులు లేక హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు.
ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యుల వివరాలు
ఆస్పత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 6న వైద్యులు, వివిధ విభాగాలకు సిబ్బంది మొత్తం కలిపి 52 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే నియమితులవడం గమనార్హం. ఆస్పత్రిలో దంతవైద్యుడు ఉన్నప్పటికీ చికిత్స కోసం ఉపయోగించాల్సిన సామగ్రి లేకపోవడం గమనార్హం. చిన్న పిల్లల వైద్యురాలు ఉద్యోగంలో చేరిన వారం రోజులకే ప్రసూతి సెలవుపై వెళ్లింది. ఆస్పత్రి ప్రారంభించిన ఏడాదిన్నర తర్వాత నెల రోజుల క్రితం ఆస్పత్రి ఆవరణలో సరైన మౌలిక వసతులు లేకుండానే మార్చూరీ గదిని ప్రారంభించారు.
రాత్రివేళ కరెంటు పోతే.. సెల్‌ఫోన్ లైటే గతి
రాత్రివేళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పాడితే ఇక అంతే సంగతులు. రోగులు, చిన్నపిల్లలు, బాలింతలు అంతా అంధకారంలో మగ్గాల్సిందే. ప్రమాదాల బారిన పడి ఆస్పత్రికి వచ్చిన వారికి సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లే దిక్కవుతున్నాయి. అసలే మండుతున్న ఎండలకు తోడు కరెంటు పోతే ఉబ్బరంతో బాలింతలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల క్రితం ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు ఆపరేషన్లు చేయాల్సి ఉండగా రాత్రి 9 గంటలకు వైద్యులు అంతా సిద్ధం చేసుకున్నారు. 8.30 గంటలకు గాలిదుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆపరేషన్లను మరుసటి రోజుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
సిబ్బంది కొరత వాస్తవమే..
ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉంది వాస్తవమే. నియామకం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు జరగలేదు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించలేకపోతున్నాం. ఆస్పత్రిలో జనరేటర్ లేని కారణంగా కరెంటు సరఫరాలో ఏమాత్రం అంతరాయం ఏర్పడినా రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం– డాక్టర్ అమర్‌సింగ్, ఆస్పత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment