ఆర్థో వార్డులో బాబు అనే ఎంఎల్‌సీ కేసును పరిశీలిస్తున్న డాక్టర్ నాగరాజు
అనంతపురం న్యూసిటీ: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రేడియాలజిస్టు, సిబ్బంది లేకపోవడంతో రేడియాలజీ సేవలను ఎంబీబీఎస్ వైద్యునితో అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేడియాలజీ విభాగంలో రోజురోజుకూ సేవలు మృగ్యంగా మారుతున్నా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) శ్రద్ధ చూపడం లేదు.
నాలుగేళ్లుగా ఒకరికే బాధ్యతలు..
సర్వజనాస్పత్రిలో నాలుగేళ్లుగా ఎంబీబీఎస్ అర్హత కల్గిన డాక్టర్ నాగరాజు రేడియాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో షిఫ్ట్‌ల ప్రకారం వైద్యులు నివేదికలను సిద్ధం చేసి కోర్టుకెళ్లేవారు. ఆస్పత్రి యాజమాన్యం సిబ్బంది కొరతను చూపుతూ ఈ బాధ్యతను ఎంబీబీఎస్ వైద్యులైన నాగరాజుకు అప్పగించేసింది. ఇటీవల కాలంలో పలు కేసుల్లో ఎక్స్‌రేలు తీసే విషయంలో సిబ్బందికి, వైద్యుని మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఒక కేసుకు అధిక సంఖ్యలో ఎక్స్‌రేలు తీయాలని చెబుతున్నారని పలువురు సిబ్బంది వాపోతున్నారు. ఎంఎల్‌సీ రిపోర్టుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం ఓ వైద్యునికే బాధ్యతలు ఇప్పించి చోద్యం చూస్తోందని మండిపడుతున్నారు.
ఒకే ఒక్కరు..
రేడియాలజీ విభాగంలో ఒకే ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ అందుబాటులో ఉన్నారు. వాస్తవంగా రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్, నలుగురు ట్యూటర్లు ఉండాలి. వీరిలో ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ట్యూటర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్న వైద్యుల్లో డాక్టర్ పద్మ (ట్యూటర్), డాక్టర్ వసుంధర్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) ఇద్దరు లాంగ్‌వీల్‌లో ఉన్నారు. అందుబాటులో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అనారోగ్యం కారణంతో విధులకు రావడం లేదు.
రేడియాలజిస్టులకొరతతోనే
రేడియాలజిస్టుల కొరతతోనే ఎంబీబీఎస్ వైద్యులైన డాక్టర్ నాగరాజుకు బాధ్యతలు అప్పగించాం. అయినా అందుబాటులో ఉన్న రేడియాలజిస్టు సలహాతోనే డాక్టర్ నాగరాజు రిపోర్టులు రాస్తారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత తెల్సిందేకదా? కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులే కోర్టుకెళ్లి వివరణ ఇస్తుంటారు. – డాక్టర్ జగన్నాథ్,సూపరింటెండెంట్, సర్వజనాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment