కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది. ఇక్కడ కేవలం కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అవసరమైన వైద్యులు, సిబ్బందిని, వైద్యపరికరాలను, సౌకర్యాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో గత మార్చి 28 నుంచి ఇప్పటి వరకు 2,600లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 85 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను బట్టి చూస్తే రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి, విశ్వభారతి జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం ఏర్పాటు చేసినా.. మరణాలన్నీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే నమోదయ్యాయి.
♦ గత నెల 26న సికింద్రాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి మధ్యాహ్నం 2.07 గంటలకు కరోనా లక్షణాలతో కర్నూలు పెద్దాస్పత్రికి వచ్చాడు. 2.25కే మృతి చెందాడు.
♦ అదే నెల 28న గద్వాలకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు చికిత్స నిమిత్తం ఉదయం 11.39 గంటలకు ఆసుపత్రికి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకే మరణించింది.
♦ మరుసటి రోజు నందికొట్కూరుకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో వచ్చాడు. కొద్దిసేపటికే కన్నుమూశాడు. అదేరోజు ఆదోని ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల యువతి సైతం కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది. రెండురోజుల తర్వాత మృతిచెందింది.
♦ ఆ మరుసటి రోజు మంత్రాలయం మండలానికి చెందిన 55 ఏళ్ల మహిళ ఉదయం 9.56 గంటలకు కరోనా లక్షణాలతో వచ్చింది. ఆమె సైతం కొద్దిసేపటికే కన్నుమూసింది.
ఈ మరణాలన్నీ కర్నూలు పెద్దాస్పత్రిలోనే.. అందులోనూ చికిత్స కోసం వచ్చిన కొద్దిసేపటికే సంభవించినవి. అధిక శాతం ఛాతిలో నొప్పి, ఆయాసం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో వచ్చారు. వీరి లక్షణాలను బట్టి వైద్యం చేయడానికి ముందుగా వైద్యులు జంకుతున్న పరిస్థితి. క్యాజువాలిటీలో కోవిడ్ పరీక్షలు చేసిన తర్వాత, ఆ ఫలితం వచ్చేంత వరకు ఇలాంటి వారికి చికిత్స చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీనికితోడు అధిక శాతం వైరస్ వచ్చిన విషయం తెలిసి కొందరు, తెలియక కొందరు నిర్లక్ష్యం చేసి చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వల్ల వైద్యులు ఏమీ చేయలేకపోతున్నారన్న చర్చ కూడా ఉంది.
వైద్యుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
ఆస్పత్రిలో రోజూ 4 నుంచి 6 దాకా కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తుండటం, రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు జిల్లా అధికారులతో చర్చించింది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి అధికారులు, వైద్యులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సమావేశమయ్యారు. కరోనా రోగుల వద్దకు వైద్యులు వెళ్లడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులోనే మరణాలు ఎందుకు అధికమవుతున్నాయని ప్రశ్నించారు. కరోనా రోగుల పట్ల మానవత్వం చూపాలని, తగిన రక్షణ కిట్లతో వెళ్లి వారికి వైద్యం చేయాలని సూచించారు. ఇకపై తాను నేరుగా కరోనా రోగులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడతానని, వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకుంటానని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.
చివరి క్షణంలో చికిత్సకొస్తున్నారు
కరోనాతో మరణించిన వారిలో అధిక శాతం చివరి స్టేజీలో వస్తున్న వారే ఉన్నారు. కరోనా లక్షణాలు కనిపించినా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో బాహాటంగా బయట తిరుగుతున్నారు. దీంతో వారి ద్వారా మరికొందరికి వైరస్ సంక్రమించడమే గాక వారికి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ అధికమై శ్వాస తీసుకోలేని పరిస్థితికి వస్తున్నారు. ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న స్థితిలో చికిత్స కోసం వస్తే కోలుకోవడం కష్టమవుతుంది. ప్రతి ఒక్కరూ కరోనాను నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు.– డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment