మధిర (ఖమ్మం): మధిర మున్సిపాలిటీని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మున్సిపాలిటీ అయ్యాక ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో యంత్రాంగం కొద్దిపాటి ఉద్యోగులతో ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతోంది. సకాలంలో పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి.. గ్రామ పంచాయతీ స్థాయి సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుస్థితి.. ఫలితంగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది.
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మధిర పరిధిలోకి ఇల్లెందులపాడు, మడుపల్లి, అంబారుపేట గ్రామాలను చేర్చుతూ 2013, మార్చి 27న నగర పంచాయతీగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కానీ.. అదనంగా ఒక్క ఉద్యోగిని కూడా ఇక్కడ నియమించలేదు. పంచాయతీరాజ్‌లో పనిచేసిన ఉద్యోగులతోనే కాలం వెళ్లదీశారు. ఐదేళ్లపాటు అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో సకాలంలో సౌకర్యాలు అందక, ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక, పారిశుద్ధ్య పనులు జరగక.. తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో 2018, మార్చి 23న నగర పంచాయతీ పరిధిలో అదనంగా జిలుగుమాడు గ్రామాన్ని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 69 ప్రకారం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 21 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయగా.. వాటిలో మధిర కూడా ఉంది. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన నాటి నుంచి నేటివరకు కమిషనర్ పోస్టుతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా భర్తీకి నోచుకోలేదు. దీంతో పరిపాలనా పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కమిషనర్‌తోపాటు బిల్ కలెక్టర్ తదితర పోస్టులన్నీ ఇన్‌చార్జ్ పాలనలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 2018, ఆగస్టు 21న ఏసీబీ దాడిలో ఆర్‌ఐగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుతోపాటు మరో ఉద్యోగిని లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. దీంతో ఆ రెండు పోస్టులు కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి.
ప్రజల అవస్థలు..
మున్సిపాలిటీ కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణం చేపట్టాలన్నా, జనన, మరణ, ఎల్‌ఆర్‌ఎస్, పేర్ల మార్పిడి, ఇంటి పన్ను, నీటి పన్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో మంజూరు కాక నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఉన్న సమస్యలకు పరిష్కారం లభించకపోగా.. మరోవైపు కొత్త సమస్యలు వచ్చిపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏసీబీకి ఆర్‌ఐ పట్టుబడిన నాటి నుంచి ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోతున్నాయి.
ఆర్‌ఐ వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సందర్భంలో అతడి సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ సెల్ ఫోన్‌లోనే డిజిటల్ కీకి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఉంటాయి. ఆ డిజిటల్ కీ ద్వారా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆ కీ అందుబాటులో లేకపోవడంతో మున్సిపాలిటీ కార్యాలయంలో ఫైళ్లు గుట్టల్లా పేరుకుపోతున్న దుస్థితి నెలకొంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా చేతిలో ఏమీ లేదు..
డిజిటల్ కీ లేకుండా మేము ఏమీ చేయలేం. డిజిటల్ కీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్‌ఐ జైలు నుంచి వచ్చాక సెల్‌ఫోన్‌ను చూసి డిజిటల్ కీకి సంబంధించిన సమాచారం ఇస్తానన్నారు. అలాగే మున్సిపాలిటీ కార్యాలయంలో చాలా మంది అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. – దేవేందర్, మధిర మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment