madhira municipalities
-
పోస్టులన్నీ ఖాళీయే..
మధిర (ఖమ్మం): మధిర మున్సిపాలిటీని సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మున్సిపాలిటీ అయ్యాక ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో యంత్రాంగం కొద్దిపాటి ఉద్యోగులతో ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతోంది. సకాలంలో పనులు జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి.. గ్రామ పంచాయతీ స్థాయి సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దుస్థితి.. ఫలితంగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మధిర పరిధిలోకి ఇల్లెందులపాడు, మడుపల్లి, అంబారుపేట గ్రామాలను చేర్చుతూ 2013, మార్చి 27న నగర పంచాయతీగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. కానీ.. అదనంగా ఒక్క ఉద్యోగిని కూడా ఇక్కడ నియమించలేదు. పంచాయతీరాజ్‌లో పనిచేసిన ఉద్యోగులతోనే కాలం వెళ్లదీశారు. ఐదేళ్లపాటు అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో సకాలంలో సౌకర్యాలు అందక, ధ్రువీకరణ పత్రాలు మంజూరుకాక, పారిశుద్ధ్య పనులు జరగక.. తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో 2018, మార్చి 23న నగర పంచాయతీ పరిధిలో అదనంగా జిలుగుమాడు గ్రామాన్ని కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 69 ప్రకారం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. రాష్ట్రంలో మొత్తం 21 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయగా.. వాటిలో మధిర కూడా ఉంది. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన నాటి నుంచి నేటివరకు కమిషనర్ పోస్టుతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది పోస్టులు ఒక్కటి కూడా భర్తీకి నోచుకోలేదు. దీంతో పరిపాలనా పరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కమిషనర్‌తోపాటు బిల్ కలెక్టర్ తదితర పోస్టులన్నీ ఇన్చార్జ్ పాలనలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. 2018, ఆగస్టు 21న ఏసీబీ దాడిలో ఆర్ఐగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుతోపాటు మరో ఉద్యోగిని లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. దీంతో ఆ రెండు పోస్టులు కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ప్రజల అవస్థలు.. మున్సిపాలిటీ కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణం చేపట్టాలన్నా, జనన, మరణ, ఎల్ఆర్ఎస్, పేర్ల మార్పిడి, ఇంటి పన్ను, నీటి పన్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో మంజూరు కాక నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఉన్న సమస్యలకు పరిష్కారం లభించకపోగా.. మరోవైపు కొత్త సమస్యలు వచ్చిపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏసీబీకి ఆర్ఐ పట్టుబడిన నాటి నుంచి ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. ఆర్ఐ వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సందర్భంలో అతడి సెల్‌ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ సెల్ ఫోన్లోనే డిజిటల్ కీకి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటాయి. ఆ డిజిటల్ కీ ద్వారా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఆ కీ అందుబాటులో లేకపోవడంతో మున్సిపాలిటీ కార్యాలయంలో ఫైళ్లు గుట్టల్లా పేరుకుపోతున్న దుస్థితి నెలకొంది. ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా చేతిలో ఏమీ లేదు.. డిజిటల్ కీ లేకుండా మేము ఏమీ చేయలేం. డిజిటల్ కీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ఐ జైలు నుంచి వచ్చాక సెల్‌ఫోన్‌ను చూసి డిజిటల్ కీకి సంబంధించిన సమాచారం ఇస్తానన్నారు. అలాగే మున్సిపాలిటీ కార్యాలయంలో చాలా మంది అధికారులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. – దేవేందర్, మధిర మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ -
పన్నుభారం
ఖమ్మం: మున్సిపాలిటీల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిలోభాగంగా పురవాసులకు వాత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆస్తి పన్ను పెంచితే ఖజానా గలగలలాడుతుందనే ఉద్దేశంతో భారం వేసేందుకు యత్నిస్తోంది. ఇదే జరిగితే తొలుత ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లోనూ ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి, కార్పొరేషన్ పరిధిలో అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. నిధుల లేమితో కార్పొరేషన్‌కు వచ్చే ఆస్తి, ఇతర పన్నులతోనే పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి. అయితే ప్రభుత్వం తాజాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్న సాకుతో ఆస్తి పన్ను పెంచేందుకు సమాయత్తమవుతుండడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. సౌకర్యాలు కల్పించకుండా పన్ను పెంచితే ఏలా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు కార్పొరేషన్లు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో తప్పకుండా ఆస్తి పన్ను పెంచాలన్న నిర్ణయంతో ముందుకు వెళ్తుండటం గమనార్హం. ఖమ్మం వాసులకు భారమే గ్రామ పంచాయతీలతో కలిపి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 వేల వరకు నివాసిత ప్రాంతాలు ఉంటాయి. ఇందులో 10 వేలకు పైగా నాన్ రెసిడెన్షియల్ పరిధిలోకి వస్తాయి. ఏడాదికి రూ.12.36 కోట్ల మేరకు ఆస్తి పన్ను రూపంలో కార్పొరేషన్‌కు ఆదాయం రావాలి. కానీ వాణిజ్య కేటగిరీకి సంబంధించి మొండి బకాయిలు ఉండడంతో ఏటా 50 శాతం పన్నుల వసూలు మించడంలేదు. పేద, మధ్య తరగతి వర్గాలను ముక్కు పిండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్న అధికారులు.. వాణిజ్య, ఇతర సంపన్నవర్గాల నుంచి గృహ పన్నులను వసూలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పన్ను పెంచడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలకే ఇబ్బంది కలుగుతుంది. ఖమ్మం కార్పొరేషన్ లో ఒకటో జోన్లో నివాస వసతికి పక్కా భవనానికి చ.మీటర్‌కు ఏడాదికి రూ.19, సాధారణ భవనానికి రూ.16, పలకల కప్పుకు రూ. 11, పెంకు ఇల్లుకు రూ. 8, గడిసెకు రూ. 3 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వార్షిక అద్దె విలువ (వీఆర్వీ)ను ప్రామాణికంగా తీసుకొని కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని భవనాలు, ఖాళీ స్థలాల ఆస్తి పన్నుల గణన జరుపుతారు. ఏప్రిల్ 1 నుంచి నగర పంచాయతీల్లో.. సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో ఏప్రిల్ 1 నుంచి పెంచిన ఆస్తి పన్ను అమల్లోకి రానుంది. సత్తుపల్లి నగర పంచాయతీలో నివాస, వాణజ్య, వ్యాపార గృహాలు, సముదాయాలు 8 వేలు, మధిరలో 5 వేల వరకు ఉన్నాయి. వీటికి కూడా చదరపు మీటర్ చొప్పున ఆస్తి పన్ను పెంచి వసూలు చేస్తారు. ఇప్పటికే ఈ పంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో శివారు కాలనీల్లో ఏటా మంచినీటి ఎద్దడి నెలకొంటోంది. ఆస్తి పన్ను పెంచి వసూలుకు దిగితే ఆధికారులు, సిబ్బంది జనాగ్రహం చవిచూడక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి పన్ను పెంచేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడంతో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో గృహాల సంఖ్యను మళ్లీ గణన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులను త్వరలో ఆదేశించనున్నట్లు సమాచారం. ఈ గణన పూర్తి అయిన తర్వాత పాత మున్సిపాలిటీల్లోనూ పన్ను పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది.