సాక్షి, అమరావతి: మున్సిపల్ శాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఖాళీ అయిన పోస్టులను గత ప్రభుత్వం భర్తీ చేయకుండా నాన్చడంతో మిగిలిన సిబ్బందిపై పనిభారం పడుతోంది. బిల్డింగ్ ప్లాన్‌ల మంజూరు, ఆక్రమణల తొలగింపు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, రహదారుల విస్తరణ, మాస్టర్ ప్లాన్‌ల తయారీ వంటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఈ సమస్యపై ఆ విభాగం ఉన్నతాధికారులు మున్సిపల్ శాఖకు అనేకసార్లు నివేదికలు పంపినా, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ లే అవుట్లు విచ్చలవిడిగా పెరిగాయి. రియల్టర్ల అక్రమాలతో స్థలాలను కొనుగోలు చేసిన ప్రజలు మోసపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆదాయానికీ భారీగా గండిపడింది. ఆన్‌లైన్‌లో బిల్డింగ్ ప్లాన్‌ల మంజూరు విధానం అమలులోకి వచ్చినా, ఆ ప్లాన్‌లను క్షేత్ర స్ధాయిలో పరిశీలన చేయడానికి సిబ్బంది లేరు. రహదారుల ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించడానికి సిబ్బంది లేకపోవడంతో నగరాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయి. రహదారులు, అంతర్గత రహదారుల విస్తరణ, మాస్టర్ ప్లాన్‌ల తయారీ కూడా ముందుకు సాగడం లేదు.
ప్రతిపాదనలు దాటని పోస్టింగ్‌లు
రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు, 13 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. పెరిగిన జనాభా, ఆదాయం కారణంగా వీటిలో కొన్నిటిని అప్‌గ్రేడ్ చేయడానికీ ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందుకు అనుగుణంగా ప్లానింగ్ విభాగంలో అధికారులు, సిబ్బందిని నియమించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించి చేతులు దులిపేసుకుంది. రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో మొత్తం 1,851 మంది అధికారులు, సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేయాల్సి ఉండగా కేవలం 479 మందినే నియమించింది. మిగిలిన 1,372 పోస్టులను భర్తీ చేయడంలో మున్సిపల్ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 408 మంది ఉండాలి. అయితే కేవలం 11 మంది మాత్రమే పని చేస్తుండగా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే మిగిలిపోవడంతో రాష్ట్రంలో రియల్టర్లు బరితెగించారు. దాదాపు 18 వేల అక్రమ లే అవుట్లలోని నివేశన స్థలాలను అమ్మేసి, కొనుగోలుదారులను మోసగించారు.
విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, వైఎస్సార్ జిల్లాల్లో అనధికార లే అవుట్లలోని స్థలాల అమ్మకాలు అధికంగా జరిగాయి. వీటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని మున్సిపాల్టీలు, పట్టణాభివృద్ధి సంస్థలు గుర్తించాయి. వీటిని క్రమ బద్ధీకరిస్తే రూ.250 నుంచి రూ.300 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రెండుసార్లు గడువు పొడిగించినా సిబ్బంది కొరత కారణంగా ముందుకు సాగడం లేదు. మాస్టర్‌ప్లాన్ తయారీ కూడా ఇందుకు భిన్నంగా లేదు. ఒక్క రాయలసీమ రీజియన్ మినహా ఇతర రీజియన్‌లలో మాస్టర్ ప్లాన్‌ల తయారీ పూర్తికాలేదు. కొత్త ప్రభుత్వం మున్సిపల్‌శాఖలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలోని ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని వివిధ వర్గాలు కోరుతున్నాయి. కాగా సిబ్బంది నియామకానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రాముడు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment