సాక్షి, అమరావతి: పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకుని రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి అనుగుణంగా, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యంగా నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధించేందుకు దోహదం చేసేలా టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు సంస్కరణలు తీసుకుని వస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ వెల్లడించారు. భవన నిర్మాణాల అనుమతుల జారీ, కొత్త లే అవుట్లు నెలకొల్పడంలో ప్రస్తుతమున్న నిబంధనలను సరళీకృతం చేయడం, టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరులో జవాబుదారీ తనం పెంచడం వంటి అంశాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఆయన ఆమోదం తెలిపారు. పూర్తి పారదర్శకతతో, అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకుండా సామాన్య ప్రజలు భవన నిర్మాణపు అనుమతులను పొందేట్లుగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: సంక్షేమ హాస్టళ్లు.. మన పిల్లలు చదివేలా ఉండాలి)
ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలకు భూములు ఇచ్చిన వారికి పరిహారంగా ఇచ్చే టిడిఆర్ ల జారీని సులభతరం చేయడంతోపాటు, నిబంధనలను సరళీకృతం చేయడం, భవన నిర్మాణపు అనుమతులు, లే అవుట్ల జారీ నిబంధనల్లో సవరణలు, ఇంపాక్ట్ ఫీజు చెల్లింపు, ఇకపై అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే నిర్వహించేట్లుగాను, పర్యవేక్షక తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించడం తదితర విషయాల్లో నిర్దిష్టమైన మార్గదర్శకాలతో మూడు ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో నెంబర్లు 178,179,180) జారీ అయ్యాయి. ఇకపై అక్రమ కట్టడాలు, లే అవుట్ల పై కఠినంగా వ్యవహరిస్తూ, అటువంటి వాటిపై ఉక్కుపాదం మోపనున్ననట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. (చదవండి: కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం)
ఈ సంస్కరణలు అమలులోనికి తీసుకొచ్చే ముందు స్టేక్ హోల్డర్లతోనూ, రియిల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపామని, ఆ వర్గాల వారు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను క్రోడీకరించి, విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇలా అనేక విధాలుగా, అధ్యయనం చేసి టౌన్ ప్లానింగ్ విభాగంలో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ ప్రభుత్వానికి చెందిన అన్ని పనులు గడప ముంగిట నుంచే జరిగేలా చూస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రజలకిచ్చిన మాటను అమలు చేసేలా ఈ నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు మేలు చేసేలా, ఇబ్బందుల్లో ఉన్న నిర్మాణ రంగానికి చేయూత నిస్తూ, ముఖ్యంగా అన్ని రకాల ఇళ్ల నిర్మాణపు పనులు మరింత జోరందుకునేందుకు ప్రభుత్వ నిర్ణయాలు దోహదం చేస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
జీవోల్లోని ముఖ్యాంశాలు:
►సిటీ లెవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీ:
స్టేక్ హోల్డర్ల విజ్ఞప్తిని పరిగణనలోనికి తీసుకుని ఇంపాక్ట్ ఫీజును 6 వాయిదాల్లో 3సంవత్సరాల కాలపరిమితిలో అనుమతినివ్వడంతోపాటు, ఈ ఫీజు మొత్తాన్ని ప్రస్తుతమున్న దానికంటే సుమారు 50 శాతం మేర తగ్గించడం జరిగిందని మంత్రి వివరించారు.
►భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియ లో పోస్ట్ వెరిఫికేషన్ తొలగింపు:
భవన నిర్మాణపు ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకున్న, పిదప సిస్టం దానిని పరిశీలించి నిర్దేశిత ఫీజు / చార్జీలు చెల్లించిన అనంతరం సిస్టం ద్వారా ఆమోదం పొందిన, ప్లాను, ఉత్తర్వులు జనరేట్ అవుతాయి. ఇప్పటి వరకు ఉన్న పోస్ట్ వెరిఫికేషన్ ను మరియు మల్టీస్టోరీడ్ బిల్డింగ్ కమిటీలను తొలిగించి, వీటి స్థానంలో పర్యవేక్షణ తనిఖిలు మరింత పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఆన్ లైన్ వెరిఫికేషన్ లో అనవసరమైన మానవ జోక్యం నివారిస్తూ సరళకృతం చేయడమైనది.
►టిడిఆర్‌ల జారీ , వినియోగం, పర్యవేక్షణ లపై నిర్ణయాలు..
మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల విస్తరణ, ఇతరత్రా ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాల నిమిత్తం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ఇచ్చే అదనపు అంతస్తుల నిర్మాణం, సెట్ బ్యాక్ ల లో సడలింపులకు వీలు కల్పిస్తూ జారీ చేసే ట్రాన్సఫర్ బుల్ డెవలప్ మెంట్ రైట్స్ (టిడిఆర్) లను ప్రస్తుతం మాన్యువల్ గా జారీ చేస్తున్నారు. ఈ టిడిఆర్‌లను రాష్ట్రంలోని ఏప్రాంతంలోనైనా వినియోగించుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మాన్యువల్ గా జారీ చేసే ప్రక్రియలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలన్నిటిని అధ్యయనం చేసిన తరువాత ఇకపై వీటి జారీ, బదలాయింపు, వినియోగం వంటి అంశాలన్నీ పూర్తి పారదర్శకతతో ఆన్ లైన్ లోనే జరగాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.
అంతే కాకుండా, ఇంతవరకు టిడిఆర్ లను, భవన నిర్మాణపు అనుమతుల జారీ చేసేందుకు చెల్లించాల్సిన ఫీజుల రూపంలో సర్దుబాటు చేస్తున్నారు. ఇకపై టిడిఆర్ లను ఫీజుల రూపంలో సర్దుబాటు చేయడమనే ప్రక్రియను నిలిపివేస్తున్నారు. అదనపు అంతస్తులు, సెట్ బ్యాక్ ల సడలింపుల నిమిత్తం వినియోగించే టిడిఆర్ ల ను కూడా అగ్నిమాపక భద్రతా చర్యలకు లోబడే వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా ఉపయోగం నిమిత్తం, పేదల గృహ నిర్మాణాలకు కూడా టిడిఆర్ ను వర్తింప చేయనున్నారు. ఏదైనా నిర్దేశిత ప్రజోపయోగం నిమిత్తం (గృహ నిర్మాణాలు, నీటి సరఫరా, డ్రైనేజి, విద్య, ఆరోగ్యం తదితర టికి) వినియోగించే భూములకు 400 శాతం టిడిఆర్ ను వర్తింపచేస్తారు. అలాగే ఏదైనా స్లమ్ ఏరియా కు సంబంధించి, దాని పునర్నిర్మాణానికి ప్రతిపాదించిన సందర్భాల్లో ప్రభుత్వ అనుమతితో టిడిఆర్ ను వర్తింప చేస్తారు.
►పారిశ్రామిక ప్రతిపాదనలకు కొన్ని సడలింపులు:
పారిశ్రామిక పేరిఫరల్ రోడ్డు (ప్రాజెక్ట్ స్థలములో వెనుకవైపు స్థలముకు రహదారి నిమిత్తం వదలవలసిన రోడ్డు), ఓపెన్ స్పేస్ ల అంశాల్లో పరిశ్రమలకు రాకపోకలు సాగించేందుకు , అంతర్గత రహదారుల వెడల్పు, వదలవలసిన ఖాళీ స్థలాల విషయంలో, క్షేత్ర స్థాయిలో ఆచరణ యోగ్యంగా ఉండే విధంగా నిబంధనల్లో కొన్ని సవరణలు తీసుకుని వచ్చినట్లు మంత్రి బొత్ససత్యనారాయణ పేర్కొన్నారు.
►అనధికార కట్టడాలు లే అవుట్లపై చర్యలు:
భవన అనుమతితో పాటు వేకేంట్ ల్యాండ్ టాక్స్ (విఎల్ టి) ఇంటిగ్రేషన్ ద్వారా, భవన నిర్మాణపు అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేసేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నాము. గతంలో ఉన్న విధానం ప్రకారం విఎల్ టి గణన, చెల్లింపు ప్రక్రియకు 2-3 నెలల సమయం పట్టేది, కానీ ప్రస్తుత నిర్ణయంతో ఈ సమయం ఆదా అవుతుంది.
►రిజిస్ట్రేషన్ విభాగంతో ఆన్ లైన్ పోర్టల్ ల అనుసంధానం:
పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఇది ఒకటి. భవన నిర్మాణపు అనుమతుల సమయంలో తనఖా గా ఉంచిన వాటి విడుదల లో అనవసర జాప్యాన్ని నివారించేలా, అవినీతికి ఆస్కారం కలగకుండా, దరఖాస్తు దారు నుంచి నిర్దేశిత ఫీజు వసూలు అవ్వడంతోపాటు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల విడుదల వేగవంతం అవుతుంది. తద్వారా భవన నిర్మాతలకు మేలు కలుగుతుంది. చట్ట విరుద్దమైన భవనాలు, లే అవుట్లలో రిజిస్ట్రేషన్ ల ను నిలుపుదల చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రణాళిక బద్దమైన పట్టణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాము. నిబంధనలను అతిక్రమిస్తూ వెలిసే నిర్మాణాలు, లే అవుట్లను నిర్మూలించే చర్యలను ముమ్మరంగా నిర్వహించనున్నారు.
►ఇకపై భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీ, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అందుతున్న సేవలన్నిటిపై పర్యవేక్షక తనీఖీలను సమర్థవంతంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నాము, అలాగే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ పనితీరును మెరుగు పరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం
నిర్మాణ రంగంలో భాగస్వామ్యులైన వారితోనూ, ప్రజలతోనూ ప్రజా ప్రతినిధులతోనూ సంప్రదించి తీసుకున్న ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని నిర్మాణ రంగం పురోభివృద్ధి సాధిస్తుందని, పట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ వార్డుల్లోనూ వార్డు సెక్రటేరియట్ లు ఉన్న నేపథ్యంలో అక్రమ కట్టడాలు, అక్రమ లే అవుట్లు రాకుండా చూసే బాధ్యతలను ఆ వార్డులోని ప్లానింగ్ సెక్రటరి పర్యవేక్షిస్తారని మంత్రి వెల్లడించారు. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై నిరంతర పర్యవేక్షణ, ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment