జర్నలిస్టు, ఎంప్లాయీస్ హెల్త్‌స్కీం కార్డుకోసం వేచి ఉన్న రోగులు
పంజగుట్ట: నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే రోగులకు నరకం కనిపిస్తోంది. రోజురోజుకు రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా సిబ్బంది కొరత, ఎప్పుడో దశాబ్దాల కాలం నాటి కంప్యూటర్లు ఉండడంతో రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం ఓపీ కార్డు తీసుకోవాలంటే రెండు గంటలు పడుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సీ–డాక్ విధానం వచ్చినప్పటినుంచి ఓ రోగి ఓపీ కార్డు పొందాలంటే ఆధార్ కార్డు నంబర్, పేరు, ఊరు, వయస్సు, గతంలో ఏదైనా రోగం ఉందా, ఏ వైద్యుణ్ని సంప్రదించాలి తదితర 15 అంశాలు అందులో పొందుపర్చాలి. దీంతో ఒక్క కార్డు ఇచ్చేందుకు సుమారు 10 నిమిషాలు పడుతోంది. ఇంతలోనే క్యూ లైన్ పెరిగిపోతుంది. ఒక్కోసారి రోగుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.
సీ–డాక్ విధానం మంచిదే అయినప్పటికీ అందుకు తగిన చర్యలు తీసుకోకపోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోంది. గతంలో ఉన్న కౌంటర్లే కొనసాగించడం, దశాబ్దాల కాలంనాటి కంప్యూటర్లు కావడంతో అవి నిత్యం మొరాయించడం, ప్రింటింగ్ యంత్రాలు సరిగా లేకపోవడంతో ప్రింటింగ్ కనిపించకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు రోగులు, ఉద్యోగులు అంటున్నారు. సీ–డాక్ విధానం వచ్చిన తర్వాత కనీసం మూడు నుంచి నాలుగు కౌంటర్లు పెంచాల్సి ఉండగా ఒక్క కౌంటర్‌ను కూడా అదనంగా పెంచలేదని, దీంతో ఉన్న ఉద్యోగులపైనే అధికభారం పడి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇటు జర్నలిస్టు హెల్త్ స్కీం, ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలలో చూపించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ విపరీతమైన రద్దీ ఉండడంతో నిలబడలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోగుల అవస్థలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు రోగులు అంటున్నారు.
కేషీట్ ముణ్నాళ్ల ముచ్చటే..
ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరిగా నిమ్స్‌లో కూడా ఓపీ కార్డుకు బదులుగా కేషీట్ ఇచ్చారు. దీన్ని మంత్రి లక్ష్మారెడ్డి అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. నెలరోజులు ఈ విధానం అమలు చేసి మళ్లీ పాతపద్ధతినే అవలంబిస్తున్నారని, కేషీట్‌లు ఇవ్వడంలేదని రోగులు అంటున్నారు. కేవలం ఒక చీటీ ఇచ్చి అదే ఓపీ కార్డుగా పరిగణిస్తున్నారు. గతంలో ఇచ్చిన ఓపీ కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉండేవని పలువురు రోగులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment