వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
శ్రీకాకుళం క్రైం: రిమ్స్ వైద్యుల నిర్లక్షానికి ఓ నిండు ప్రాణం బలైంది. దీంతో..మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. పాలకొండ మండలం ఎన్‌కే రాజపురం గ్రామానికి చెందిన నీలాపు శ్రీనివాసరావు కోటబొమ్మాళి ఎక్సైజ్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ఆదివారం ఉదయం ఇంటికి బయల్దేరాడు.
ఆటోలో వస్తుండగా.. నరసన్నపే ట మండలం తామరాపల్లి వద్ద జాతీయ రహదారిపై కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపు తప్పి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతనిని రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించారు. కానీ మధ్యాహ్నం మెరుగైన వైద్య సేవల కోసం కిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే..అప్పటికే..పరిస్థితి విషమించడం శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెంటనే..రిమ్స్‌కు తిరిగి తీసుకువచ్చారు. రిమ్స్ వైద్యులు మరోసారి పరీక్షించి..ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
బంధువుల ఆందోళన..
ఇదిలా ఉండగా..రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే..శ్రీనివాసరావు మృతి చెందాడంటూ..ఆయన బంధువులు ఆందోళనకు దిగారు. ఉదయం రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత ఆయన బాగానే మాట్లాడాడని..లోపల మాత్రం బాగా దెబ్బలు తగిలాయన్నారు. వైద్యులు ఆయనకు తగిలిన గాయాలపై దృష్టి సారించకుండా..పైపైనే వైద్యం చేశారని మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే..ఆయన నిండు ప్రాణాలు బలయ్యాయంటూ..రిమ్స్ ఎదుట కొద్ది సేపు అందోళన చేశారు. ఎక్సైజ్ అధికారు లు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రిమ్స్‌కు తరలివచ్చారు. శ్రీనివాసరావు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
మరో ముగ్గురికి..
నరసన్నపేట : ఈ ఆటో ప్రమాదంలోనే శ్రీనివాసరావుతో పాటు..సత్యవరం గ్రామానికి చెందిన లబ్బ రమణ, పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన వెలమల నీలవేణి, దంత గ్రామానికి చెందిన పంగ అప్పన్నలకు గాయాలయ్యాయి. వీరంతా శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాలకొండలో విషాదం
పాలకొండ: శ్రీనివాసరావు మృతి చెందడంతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎన్.కె.రాజపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు జిల్లాలోని పలు స్టేషన్లలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ శ్రీకాకుళంలో కుటుంబంతో నివసిస్తున్నారు. ఆయనకు భార్య విమలతో పాటు కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె సాత్విక ఉన్నారు. శ్రీనివాసరావు హఠాన్మరణంతో ఈ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోపక్క శ్రీనివాసరావు తల్లిదండ్రులు ఇప్పటికే మరణించగా అతని సోదరుడు సురేష్ ఎన్.కె.రాజపురంలో నివాసముంటున్నాడు. అలాగే శ్రీనివాసరావు అక్కచెల్లెళ్లు మణి, పద్మ సోదరుడి మరణంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.