ప్రతీకాత్మక చిత్రం
శ్రీకాకుళం అర్బన్ : నగరంలోని డే అండ్ నైట్ కూడలి సమీపంలో బ్రిడ్జి పక్కన గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బుడ్డయ్యగారిపేటకు చెందిన మైలపల్లి రామారావు(45) మృతి చెందాడని ఆయన బంధువులు శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే... గార మండలం శ్రీకూర్మాం పంచాయతీ బుడ్డయ్యగారిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి రామారావు మూడు రోజుల క్రితం కడుపునొప్పితో ఈ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స చేశారని, తర్వాత ఆ చికిత్స విషమించడంతో అప్పటికప్పుడు మృతుని బంధువుల అనుమతి లేకుండా ఆస్పత్రి వాహనంలోనే రాగోలులోని ఓ ఆస్పత్రికి తరలించారని బాధితులు పేర్కొన్నారు. అయితే శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతిచెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శస్త్ర చికిత్స పేరిట రూ. 50 వేలకు పైగా వసూలు చేశారని తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment