
వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి!
► రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి
► సరైన వైద్యం అందక ప్రాణాలు విడిచిన మగ బిడ్డ
► భోరున విలపిస్తున్న తల్లిదండ్రులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని రిమ్స్ జనరల్ ఆస్పత్రిలో ప్రసూతి వార్డులో గురువారం నవజాత శిశువు మరణించింది. ప్రసవం జరిగిన కొన్ని గంటలకే శిశువు మృతి చెందడంపై ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు ప్రాణాలు విడిచిందని బాలింత బంధువులు ఆరోపిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంపై ప్రజలకు ఇటీవల కాలంలో పూర్తిగా నమ్మకం పోయింది. చిన్న చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగినన్ని ప్రసవాలు కూడా ఇక్కడ జరగడంలేదు. దీనికి కారణం పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, ఉన్నవారు విధులకే సకాలంలో హాజరుకాకపోవడం, వారి సొంత క్లినిక్‌ల్లో వైద్య సేవలు అందిస్తూ రిమ్స్‌లో ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. తాజాగా గురువారం రిమ్స్‌లో ప్రసవం తర్వాత నవజాత శిశువు మృతి చెందడంతో ఈ అభియోగాలకు బలం చేకూర్చుతుంది. ఆస్పత్రి వైద్య సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందని బాలింత బంధువులు ఆరోపిస్తున్నారు.
సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన పొన్నాడ రమేష్ తన భార్య రాజులమ్మకు పురిటి నొప్పులు రావడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. రిమ్స్‌లో వైద్యులు రాజులమ్మను పరిశీలించి సాధారణ ప్రసవం వస్తుందని చెప్పారు. ఈ మేరకు సాయంత్రం 4 గంటల సమయంలో సాధారణ ప్రసవం జరిగింది. మగ శిశువు జన్మించగా, శిశువుని ఐసీయూలో పెట్టారు. అయితే ఈ విషయాన్ని బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి, ఆమె బంధువులకు ఆస్పత్రి వర్గాలు తెలియజేయలేదని వారు ఆరోపిస్తున్నారు. గంట తర్వాత శిశువు మరణించిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని వారు ఆవేదన చెందారు. ప్రసవ సమయంలో వైద్యులు లేకపోవడం, కేవలం కింది స్థాయి సిబ్బంది ప్రసవయం చేయడం వల్లే తమ బిడ్డ మరణించిందని, తగిన జాగ్రత్తలు తీసుకోలేదని శిశువు తండ్రి ఆరోపిస్తున్నాడు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యాధికారి లేరని, కేవలం హౌస్ సర్జన్, నర్సింగ్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ ప్రసవం చేయడం వల్లే ఘోరం జరిగిపోయిందని లబోదిబోమంటున్నాడు.
నిర్లక్ష్యం లేదు: కాగా నవజాత శిశువు మృతిపై ఆస్పత్రి ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్ అరవింద్ వద్ద సాక్షి ప్రస్తావించగా శిశువు పుట్టినప్పటికే ఇబ్బందులు ఉన్నాయన్నారు. శిశువు మెడపై పేగులు వేసుకొని పుట్టినందున ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ఈ సమయంలో డ్యూటీ డాక్టర్ రిమ్స్ ఆపరేషన్ థియేటర్‌లో ఇతర ప్రసూతి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. ఈ శిశువు మృతి వెనుక వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆయన వివరించారు.