ప్రేమాంజలి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు (అంతరచిత్రం) ప్రేమాంజలి(ఫైల్ ఫొటో)
గొంతులో వచ్చిన సమస్యకు చికిత్స పొందిన ఆ పాప గళం.. అంతలోనే శాశ్వతంగా మూగబోయింది. ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారుముద్దుగా చూసుకుంటున్న అమ్మానాన్నల హృదయాల్లో ఆరని శోకాగ్ని రగిలింది. కాకినాడ జీజీహెచ్‌లో టాన్సిల్స్‌కు చికిత్స పొందిన రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ప్రేమాంజలి (13) గురువారం మరణించింది. చికిత్సలో లోపమే పాపను బలిగొందని అయినవారు ఆక్రోశిస్తున్నారు.
తూర్పుగోదావరి, సర్పవరం (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల నిర్లక్ష్యం కారణంగా చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రాయుడు వెంకటరమణ, సత్యవేణిల ఏకైక కుమార్తె రాయుడు ప్రేమాంజలి(13) ఏడో తరగతి చదువుతుంది. ఆమెకు టాన్సిల్స్(గొంతుకు ఇరువైపులా కాయలు) రావడంతో బుధవారం సాయంత్రం కాకినాడ సామాన్య ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.
జీజీహెచ్‌లోని ఈఎన్‌టీ విభాగంలో చికిత్స పొందుతుండగా గురువారం ఉదయం 7.20 గంటల వరకు అందరితో బాగానే మాట్లాడిందని, జ్వరం, కడుపుమంట ఉండడంతో నర్సుని పిలిస్తే ఇంజక్షన్ ఇచ్చినట్టు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఇంజక్షన్ ఇచ్చిన పది నిమిషాల్లోపే ఆమె ఒళ్లంతా దద్దుర్లు, విరేచనాలు, నోట్లో నుంచి రక్తం వచ్చిందని వెంటనే పీఐసీయూకి తరలించారని తెలిపారు. తరువాత ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా బాలిక తండ్రిని పదినిమిషాలు మాత్రమే లోపలికి అనుమతించారు. కొంత సమయం తరువాత మీ పాప చనిపోయిందని మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్యులు తెలిపారని మృత్యురాలు మేనమామ బోరున విలపిస్తూ చెప్పారు.
చాలా బాధాకరం
హిమరేక్స్ ఫీవర్స్ కావచ్చు. బాలికకు ఇచ్చిన ఇంజక్షన్ పారాసిటమాల్ మాత్రమే. దీని వల్ల ప్రమాదం కాదు. ఇంజక్షన్ వల్ల మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాబట్టి వైద్య బృందాన్ని వివరణ కోరాను. కొన్నిసార్లు హిమరేక్స్ ఫీవర్స్ ఉన్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయినా ఈ బాలికకు అటువంటి సూచనలు కనిపించలేదు. ఈ సంఘటనపై విచారిస్తున్నాం. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తా.– డాక్టర్ ఎం.రాఘేవేంద్రరావు,జీజీహెచ్ సూపరింటెండెంట్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment