సరైన వైద్యం అందక గర్భవతి మృతి
- ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ధర్నా
శ్రీకాళహస్తి : వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భవతి మృతిచెందిందని బాధితులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెతో పాటు కడుపులోని ఇద్దరు మగశిశువుల ప్రాణంతీసిం దనీ, సకాలంలో సరైన వైద్యం అందకపోవడమే అందుకు కారణమయిందన్నారు. శ్రీకాళహస్తిలో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు పట్టణంలోని కైలాసగిరి ప్రాంతానికి చెందిన సునీల్ భార్య సుధారాణి నిండు గర్భవతి. పట్టణంలోని నగరివీధిలో ఓ వైద్యురాలి వద్ద వారం వారం పరీక్షలు చేసుకుంటోంది.
సోమవారం కడుపునొప్పిగా ఉండడంతో అదే ఆస్పత్రికి వెళ్లింది. వారు ఓ సూది మందు ఇచ్చి రెండు గంటల తర్వాత తిరుపతిలోని ప్రైవేటు ఆస్పత్రికి సిఫారసు చేశారు. అక్కడికి వెళుతుండగా ఆమె మృతి చెందింది. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో మంగళవారం పోస్ట్‌మార్టం నిర్వహించారు. తల్లి మృతదేహంతో పాటు కడుపులోని ఇద్దరు మగబిడ్డల శవాలను అప్పగించారు. వైద్యురాలు నిర్లక్ష్యం తోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నాచేశారు. ఆస్పత్రిలోని వైద్యురాలిపై మండిపడ్డారు. వన్ టౌన్ సీఐ చిన్నగోవింద్ అక్కడికి సిబ్బందితో చేరుకుని వివాదాన్ని సద్దుమణిచారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని సీఐ తెలిపారు.