భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఏజెన్సీ వాసులకు వైద్యం అందించే విషయంలో ఇక్కడి ప్రభుత్వ డాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు ఎంత అధ్వానంగా ఉందో రుజువైంది. ఏరియా ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో వస్త్రాన్ని ఉంచి కుట్లు వేశారంటే వారు ఎంత అజాగ్రత్తతో వైద్యం చేస్తున్నారో అర్థమవుతోంది.
చింతూరు మండలం మోతుగూడెం గ్రామానికి చెందిన తన్ని సూర్యకుమారి అనే గిరిజన మహిళ ప్రసవం కోసం ఏరియా ఆస్పత్రికి వచ్చింది. డిసెంబర్ 15వ తేదీన ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. కుట్లు వేసే సమయంలో రక్తం పీల్చుకునే వస్త్రాన్ని కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. ఆ తర్వాత ఆమెకు కడుపులో నొప్పిరావడం, ఉదరభాగం ఉబ్బడం, కుట్లలో నుంచి చీము వస్తుండటంతో శనివారం రాత్రి బాధితురాలికి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. మూరెడు బారువున్న మాప్ (రక్తం పీల్చుకునే వస్త్రం)ను బయటకు తీశారు.
ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే...
తన్ని సూర్యకుమారి ప్రసవం కోసం డిసెంబర్ 14వ తేదీన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జాయిన్ అయింది. 15వ తేదీన ఆస్పత్రి వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. పండంటి మగబిడ్డను బయటకు తీశారు. చికిత్స నిర్వహించే సమయంలో రక్తం పీల్చుకునేందుకు వినియోగించే వస్త్రాన్ని వైద్యుడు గమనించకుండా కడుపులోనే ఉంచి కుట్లు వేశాడు. వారం రోజుల అనంతరం సూర్యకుమారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత ఆమె స్వగ్రామం వెళ్లిపోయింది. పదిరోజుల తర్వాత ఉదరభాగంలో ఉబ్బడం, నొప్పి రావడం, కుట్లలో నుంచి చీము రావడం ప్రారంభమవడంతో భయభ్రాంతులకు గురైన సూర్యకుమారి భర్త అప్పన్న, ఆమె తల్లిదండ్రులు వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. స్కానింగ్ చేయడంతో ఆమె కడుపులో ఓ వస్త్రంలాంటిది కనిపించింది. శనివారం రాత్రి శస్త్రచికిత్స చేసి ఆ వస్త్రాన్ని బయటకు తీశారు. ఈ విషయంపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు.
నొప్పితో నరకం అనుభవించింది: బాధితురాలి భర్త అప్పన్న
కడుపులో మాప్ ఉంచి కుట్లు వేయడంతో తన భార్య నొప్పితో నరకం అనుభవించిందని సూర్యకుమారి భర్త అప్పన్న విలేకరుల ఎదుట వాపోయారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...‘ఏరియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో కడుపు నొప్పిగా ఉందని వైద్యులకు, సిబ్బందికి తెలియజేశాం. అయినా సిబ్బంది పట్టించుకోకుండా ఇదంతా మామూలే...కొద్ది రోజులు ఉంటే నొప్పి తగ్గి పోతుందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. చేసేదేమీ లేక ఇంటికి వెళ్లిపోయాం. ఆపరేషన్ జరిగిన నాటినుంచి సుమారు 20 రోజుల పాటు నా భార్య నరకం అనుభవించింది. ఇటువంటి బాధ ఎవరికీ రాకూడదు’.
అడుగడుగునా నిర్లక్ష్యం
- వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యానికి, వివాదాలకు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కేరాఫ్‌గా మారిందని చెప్పడానికి పలు నిదర్శనాలు ఉన్నాయి.
- ప్రసవానికి వచ్చిన మహిళలను మూకుమ్మడిగా ఖమ్మం వైద్యశాలకు వెళ్లాలని ఇక్కడి వైద్యులు ఇటీవల రిఫర్ చేశారు. దీనిని నిరసిస్తూ ఆ గర్భిణిలు ప్రసూతి విభాగం ముందు ధర్నా చేశారు.
- వారం రోజుల క్రితం ఇక్కడకు గిరిజన గర్భిణి రాగా.. గైనకాలజిస్ట్ లేరని, ప్రసవం చేయలేమని వైద్యులు చేతుత్తేశారు. ఆమె ఐటీడీఏ పీఓను ఆశ్రయించింది.
-
గర్భ సంచీలో పుండుతో బాధపడుతున్న మోతుగూడెం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి పది రోజుల క్రితం ఆపరేషన్ కోసం ఈ ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేసేందుకు రేపు మాపు అంటూ వైద్యులు కాలాయాపన చేసి, చివరికి మత్తు మందు డాక్టర్ అందుబాటులో లేరని, వచ్చాక చేస్తామని సెలవిచ్చారు. చివరికి ఆమెను కటుంబీకులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. వారికి రూ.20వేలు ఖర్చయింది.