భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ఏజెన్సీ వాసులకు శుభవార్త. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మహర్దశ కలగనుంది. కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 100 పడకలకుతోడు మరో 120 పడకలకు సరిపడా భవన నిర్మాణానికి అనుమతి రానుంది. ఈ నేపథ్యంలో స్థల పరిశీలన కోసం నాబార్డు బృందం ఆస్పత్రి ప్రాంగణాన్ని మంగళవారం సందర్శించింది. ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పలు విషయాలపై చర్చించింది. అనంతరం నాబార్డు మేనేజర్ సంజయ్ జోక్లేకర్ విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు నాబార్డు ముందుకు వచ్చిందన్నారు.
భవన నిర్మాణానికి రూ. 19 కోట్లు, వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 2 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. స్థల పరిశీలన అనంతరం ముంబాయిలోని నాబార్డు కార్యాలయానికి నివేదిక పంపుతామన్నారు. అనుమతులు వచ్చాక 120 పడకలకు సరిపడా భవనం, సిబ్బంది క్వార్టర్లు, మార్చురీ గది ఆధునికీకరణ, క్యాంటీన్, గ్యారేజ్, సెక్యూరిటీ గది తదితర నిర్మాణాలు చేపడతామని వివరించారు. పరిశీలన బృందంలో నాబార్డు అధికారి జ్ణానేశ్వర్, భద్రాచలం ఏఎంఐ సభ్యుడు డాక్టర్ కాంతారావు తదితరులు ఉన్నారు.
హర్షణీయం : ఎమ్మెల్యే సత్యవతి
భద్రాద్రిలో కార్పొరేట్ వైద్యశాలకు అనుమతి రావడం ఆనందకరమని ఎమ్యెల్యే కుంజా సత్యవతి అన్నారు. కార్పొరేట్ వైద్యశాల నిర్మాణం అనంతరం ఇక్కడే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు అనుమతి కోసం కృషి చేస్తానన్నారు. దానికనుగుణంగానే కార్పొరేట్ వైద్యశాల నిర్మాణం కోసం పాత ఆస్పత్రి వద్ద ఉన్న స్థలాన్ని చూపించినట్లు తెలిపారు.
భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో ‘కార్పొరేట్’ సేవలు!
Published Wed, Oct 2 2013 3:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement