ఎకో–టెంపుల్ టూరిజంలో భాగంగా భద్రాచలంలో ‘ఏరు’ పేరుతో రివర్ ఫెస్టివల్
9, 10, 11 తేదీల్లో నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు
ముక్కోటి ఏకాదశిన దైవదర్శనానికి వచ్చే భక్తులను ఆకర్షించేలా ప్రణాళిక
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎకో టూరిజం.. ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో పాపికొండలు, అరకు వంటి ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాలే మనకు గుర్తొస్తాయి. అందుకే ఆయా ప్రాంతాలకే ఎక్కువ మంది టూరిస్టులు క్యూ కడుతుంటారు. కానీ పర్యాటకులకు ప్రకృతి పర్యాటకానికి అసలైన నిర్వచనం ఇచ్చేందుకు.. అచ్చమైన తెలంగాణ గిరిజన సంస్కృతిని పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త థీమ్‌తో ముందుకొచి్చంది. ఎకో–టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా భద్రాచలం, పరిసర ప్రాంతాలను కలుపుతూ ఏరు–2025 ది రివర్ ఫెస్టివల్ పేరిట వేడుకలు నిర్వహించనుంది. ఈ నెల 10న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి రామయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారిని ఆకర్షించేలా ఈ నెల 9, 10, 11 తేదీల్లో రివర్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టింది. భద్రాచలంతోపాటు పర్ణశాల, బొజ్జుగుప్ప, కిన్నెరసాని, కనకగిరి (చండ్రుగొండ) గుట్టలకు పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తోంది.
ఏమిటీ రివర్ ఫెస్టివల్ ప్రత్యేకత..
గోదావరి గలగలల చెంతన (కరకట్ట వెంబడి) ప్రత్యేక గుడారాలతో కూడిన క్యాంపింగ్ సైట్.. భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన పల్లె సంస్కృతిని ప్రతిబింబించేలా పూర్తిగా వెదురు, గడ్డితో గుడిసెలు, మంచెల ఏర్పాటు.. బోటింగ్ సదుపాయం.. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరించనున్నాయి. అలాగే కొండలు, గుట్టల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. మరింతగా పల్లె వాతావరణం కోరుకొనే వారి కోసం భద్రాచలానికి 17 కి.మీ. దూరాన ఉన్న బొజ్జుగుప్ప అనే గిరిజన గ్రామంలో మరో వేదిక సిద్ధం చేస్తున్నారు. అక్కడకు చేరుకొనే అతిథులకు గిరిజన సంప్రదాయ రీతిలో స్వాగ తం పలికేలా గ్రామస్తులకు శిక్షణ సైతం ఇచ్చారు. అలాగే తాటి మొద్దులతో సిద్ధం చేసిన డయా స్‌పై కొమ్ము, కోయ నృత్యాలతో పర్యాటకులను వారు అలరించనున్నారు. ఈ వేదికకు సమీపాన తామర పూలతో నిండిన చెరువులో బోటింగ్, ఫిషింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
ఆకులు, దుంపలతో వంటకాలు..
ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో వంటకాలు.. గిరిజన తెగలకు చెందిన ఆచార వ్యవహారాలు, పనిముట్లు, అలంకరణ గురించి పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఐటీడీఏ క్యాంపస్‌లోని గిరిజన మ్యూజియాన్ని తీర్చిదిద్దుతున్నారు. స్థానిక గిరిజనులు సేకరించిన తేనె, కరక్కాయ, ఇప్పపూలు తదితర అటవీ ఉత్పత్తులు అమ్మనున్నారు. అడవుల్లో దొరికే, పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఆకులు, దుంపలు, చిరుధాన్యాలతో గిరిజనులు చేసిన వంటలను ప్రత్యేకంగా పర్యాటకులకు వడ్డించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment