Kunja Satyavathi
-
తెలంగాణ బీజేపీలో విషాదం.. కుంజా సత్యవతి హఠాన్మరణం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో ఎన్నికల వేళ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి హఠాన్మరణం చెందారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందారు. దీంతో, ఆమె మృతి పట్ల బీజేపీ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి అకాల మరణం చెందారు. కాగా, ఆదివారం రాత్రి ఆమె తన నివాసంలో ఉన్న సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. ఇక, ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారారు. అనంతరం, బీజేపీలో చేరారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: మేనిఫెస్టోలో చెప్పినవీ, చెప్పనివీ అమలు చేశాం -
మాజీ ఎమ్మెల్యే వాహనం అని చెప్పినా...
భద్రాచలం: భద్రాచలంలోని బస్టాండ్ సెంటర్లో నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతి, ట్రాఫిక్ ఎస్సై సంతోష్ మధ్య మంగళవారం రాత్రి మాటల యుద్ధం జరిగింది. ‘మాజీ ఎమ్మెల్యే వాహనం అని చెప్పినా గౌరవం ఇవ్వకపోతే ఎలా’ అని సత్యవతి ఫైర్ కాగా, ‘రూల్స్ పాటించకపోతే ఎంతటి వారికైనా జరిమానా వేస్తా’ అని ట్రాఫిక్ ఎస్సై సంతోష్ స్పష్టం చేశారు. ఇలా కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం సాగింది. అక్కడే ఉన్న మరో బీజేపీ నాయుకుడు నాగబాబు సైతం ఎస్సైతో వాదనకు దిగారు. వాహనాలు కావాలంటే తమను అడుగుతారని, ఇప్పుడు తమ వాహనాలకే జరిమానా వేస్తారా అని ఆయన ఎస్సైతో వాదన పడ్డారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ఎవరికైనా జరిమానా వేస్తానని, బీజేపీ నాయకులేమీ అతీతులు కారని ఎస్సై అన్నారు. తొలుత కుంజా సత్యవతి తన వాహనంలో బస్టాండ్ ఎదురుగా గల ఓ ఆస్పత్రికి వచ్చారు. రోడ్డుపైనే వాహనం నిలిపి లోనికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్సై సంతోష్ రోడ్డుపై వాహనాన్ని తీయాలని డ్రైవర్‌కు సూచించారు. అది మాజీ ఎమ్మెల్యే సత్యవతిదని డ్రైవర్ చెప్పినా.. వాహనాన్ని అక్కడ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ తీసుకెళ్లి, తిరిగి యూ టర్న్ తీయించి, బస్టాండ్ వైపు రోడ్డుపై ఆస్పత్రి ఎదుట పార్కింగ్ చేయించారు. విషయం తెలుసుకున్న సత్యవతి ట్రాఫిక్ ఎస్పైతో వాదనకు దిగారు. -
భద్రాద్రి ఏరియా ఆస్పత్రిలో ‘కార్పొరేట్’ సేవలు!
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: ఏజెన్సీ వాసులకు శుభవార్త. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మహర్దశ కలగనుంది. కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 100 పడకలకుతోడు మరో 120 పడకలకు సరిపడా భవన నిర్మాణానికి అనుమతి రానుంది. ఈ నేపథ్యంలో స్థల పరిశీలన కోసం నాబార్డు బృందం ఆస్పత్రి ప్రాంగణాన్ని మంగళవారం సందర్శించింది. ఎమ్మెల్యే కుంజా సత్యవతి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పలు విషయాలపై చర్చించింది. అనంతరం నాబార్డు మేనేజర్ సంజయ్ జోక్లేకర్ విలేకరులతో మాట్లాడుతూ భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఆధునికీకరణకు నాబార్డు ముందుకు వచ్చిందన్నారు. భవన నిర్మాణానికి రూ. 19 కోట్లు, వైద్య పరికరాల కొనుగోలుకు రూ. 2 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. స్థల పరిశీలన అనంతరం ముంబాయిలోని నాబార్డు కార్యాలయానికి నివేదిక పంపుతామన్నారు. అనుమతులు వచ్చాక 120 పడకలకు సరిపడా భవనం, సిబ్బంది క్వార్టర్లు, మార్చురీ గది ఆధునికీకరణ, క్యాంటీన్, గ్యారేజ్, సెక్యూరిటీ గది తదితర నిర్మాణాలు చేపడతామని వివరించారు. పరిశీలన బృందంలో నాబార్డు అధికారి జ్ణానేశ్వర్, భద్రాచలం ఏఎంఐ సభ్యుడు డాక్టర్ కాంతారావు తదితరులు ఉన్నారు. హర్షణీయం : ఎమ్మెల్యే సత్యవతి భద్రాద్రిలో కార్పొరేట్ వైద్యశాలకు అనుమతి రావడం ఆనందకరమని ఎమ్యెల్యే కుంజా సత్యవతి అన్నారు. కార్పొరేట్ వైద్యశాల నిర్మాణం అనంతరం ఇక్కడే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు అనుమతి కోసం కృషి చేస్తానన్నారు. దానికనుగుణంగానే కార్పొరేట్ వైద్యశాల నిర్మాణం కోసం పాత ఆస్పత్రి వద్ద ఉన్న స్థలాన్ని చూపించినట్లు తెలిపారు.