
భద్రాచలం: భద్రాచలంలోని బస్టాండ్ సెంటర్‌లో నడిరోడ్డుపై మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కుంజా సత్యవతి, ట్రాఫిక్ ఎస్సై సంతోష్ మధ్య మంగళవారం రాత్రి మాటల యుద్ధం జరిగింది. ‘మాజీ ఎమ్మెల్యే వాహనం అని చెప్పినా గౌరవం ఇవ్వకపోతే ఎలా’ అని సత్యవతి ఫైర్ కాగా, ‘రూల్స్ పాటించకపోతే ఎంతటి వారికైనా జరిమానా వేస్తా’ అని ట్రాఫిక్ ఎస్సై సంతోష్ స్పష్టం చేశారు. ఇలా కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం సాగింది. అక్కడే ఉన్న మరో బీజేపీ నాయుకుడు నాగబాబు సైతం ఎస్సైతో వాదనకు దిగారు. వాహనాలు కావాలంటే తమను అడుగుతారని, ఇప్పుడు తమ వాహనాలకే జరిమానా వేస్తారా అని ఆయన ఎస్సైతో వాదన పడ్డారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ఎవరికైనా జరిమానా వేస్తానని, బీజేపీ నాయకులేమీ అతీతులు కారని ఎస్సై అన్నారు. తొలుత కుంజా సత్యవతి తన వాహనంలో బస్టాండ్ ఎదురుగా గల ఓ ఆస్పత్రికి వచ్చారు. రోడ్డుపైనే వాహనం నిలిపి లోనికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్సై సంతోష్ రోడ్డుపై వాహనాన్ని తీయాలని డ్రైవర్‌కు సూచించారు. అది మాజీ ఎమ్మెల్యే సత్యవతిదని డ్రైవర్ చెప్పినా.. వాహనాన్ని అక్కడ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ తీసుకెళ్లి, తిరిగి యూ టర్న్ తీయించి, బస్టాండ్ వైపు రోడ్డుపై ఆస్పత్రి ఎదుట పార్కింగ్ చేయించారు. విషయం తెలుసుకున్న సత్యవతి ట్రాఫిక్ ఎస్పైతో వాదనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment