అది ఏ దిక్కూలేని దవాఖానా. అక్కడ వైద్యులు ఉండరు. సకాలంలో వైద్యం అందదు. కళ్లుతిరిగి పడిపోయిందని ఆస్పత్రికి తీసుకెళితే వృద్ధురాలి ఆయువు తీశారు. ప్రాణాలు పోతున్నా వైద్యం చేసేవారు కరవు అనేందుకు రాజంపేట ఏరియా ఆస్పత్రిలో శనివారం జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు, వైద్యుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజంపేట: ఆకేపాడు గ్రామపరిధిలోని రామిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆవుల సుభద్రమ్మ (68) అనే వృద్ధురాలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు... సుభద్రమ్మ కళ్లు తిరిగి కిందకిపడిపోయింది. ఆమెను రాజంపేట ఏరియా ఆసుపత్రి(వైద్యవిధానపరిష్)కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్స్ స్థానిక వైద్యునికి సమాచారం తెలియజేశారు. ఆయన వచ్చే సరికే వృద్ధురాలి పరిస్థితి విషమించింది. మృత్యుఓడిలోకి చేరుకుంది. వృద్ధురాలిని పరిశీలించి అక్కడి నుంచి వైద్యుడు వెళ్లిపోయారు. సకాలంలో వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చినప్పటికి వైద్యం అందించలేకపోవడంతో బంధువులు ఆగ్రహించారు. అన్ని సౌకర్యాలు ఉంటాయనే (ట్రామాకేర్‌సెంటర్) ఉద్దేశంతో వృద్ధురాలిని తీసుకు వచ్చామని.. ఆస్పత్రి దుస్థితి తమకు తెలిసి ఉంటే తీసుకొచ్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదైనా కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా కాపాడుకునేవాళ్లమని మృతురాలి సంబంధీకులు వాపోయారు.
కాల్‌డ్యూటీలు..
రాజంపేట ఏరియా హాస్పిటల్‌లో కాల్‌డ్యాటీలు అమలుచేస్తున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది కొరత సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలో కాల్‌డ్యాటీలు తెరపైకి వచ్చాయి. వైద్యుడు 10 నుంచి 15 నిమిషాల్లో వచ్చి చికిత్స చేసేలా నిర్ణయం తీసుకున్నారని ఆసుపత్రి వర్గాలు మరోవైపు చెబుతున్నాయి. అయితే కొందరు వైద్యులు జీవో ప్రకారం స్థానికంగా లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైవుతాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కాల్‌డ్యూటీలో రోగులు తమకు సహకరించాలని ముందస్తుగా సెంటర్‌లో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఆ లెక్కన చూస్తే శనివారం వృద్ధురాలని 12.15గంటలకు తీసుకొస్తే 12.40గంటలకు కానీ వైద్యం చేసేందుకు ఎవరూ రాలేదు. దీంతో వృద్ధురాలి కానరాని లోకాలకు చేరుకుంది.
వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన
వృద్ధురాలి మృతికి సకాలంలో వైద్య సేవలందించకపోవడమే కారణమని, ఇక్కడ వైద్యులు అందుబాటులో లేరని వైఎస్సార్‌సీపీ నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గీతాల నరసింహారెడ్డి, నీనేస్తం అధ్యక్షుడు పెంచలయ్యనాయుడు, దళితనాయకులు దండుగోపి, ఆర్‌సీ పెంచలయ్య, సొంబత్తిన శ్రీనివాసులు, మాజీ సర్పంచి బుర్రునాగేశ్వరరావు, మాధవరం వల్లి, ఆకేపాడు గ్రామానికి చెందిన నాయకులు ట్రామా కేర్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యవిధానపరిషత్ నిర్వహణ విఫలమయ్యిందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైద్యులు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి కృషితో ట్రామాకేర్‌సెంటర్‌ను తీసుకొచ్చారని, ఇప్పుడు టీడీపీ పాలనలో దిక్కులేని దవాఖానాగా మారిపోయిందని విమర్శించారు.
ప్రాణాలు కాపాడలేని పెద్దాసుపత్రి
ప్రాణాలు పోసేవిధంగా ఉండాలే కానీ, ప్రాణాలను కాపాడలేని విధంగా రాజంపేట పెద్దాసుపత్రి నిర్వహణ తీరు కనిపిస్తోంది. గతంలో చిన్నారి భవ్యశ్రీ మృతి సంఘటనలో చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఈ రోజు వృద్ధురాలి ప్రాణంపోయి ఉండేది కాదు. తాను ఎంతో కృషిచేసి ట్రామాకేర్‌సెంటర్ మంజూరు, ఓపీబ్లాక్ ఆధునీకరణ లాంటివిచేపడితే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని భావించాను. టీడీపీ పాలకుల వల్లే ఆస్పత్రికి ఈ దుస్థితి వచ్చింది.
–ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట
డీసీహెచ్‌కు ఫోన్‌చేశాను..
అవ్వ అస్వస్థతకు గురికావడంతో రాజంపేట ఏరియా హాస్పిటల్‌కు తీసుకువచ్చాను. అయితే అందుబాటులో వైద్యులు లేరు. వైద్యుని కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మృతిచెందినట్లుగా తెలిసి, ఇక్కడున్న పరిస్థితులను డీసీహెచ్‌కు ఫోన్ ద్వారా వివరించాను. పొంతనలేని సమాధానాలు చెప్పి, ఫోన్ కట్‌చేశారు. –ఆవుల విష్ణుకాంత్‌రెడ్డి,
మృతురాలి మనవడు, ఆకేపాడు
Comments
Please login to add a commentAdd a comment