
కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిక్కు
గాంధీ ఆస్పత్రి: అపస్మారకస్థితి చేరుకుని చికిత్స పొందుతున్న రోగి మృతి చెందాడని భావించి ఇంటికి తీసుకెళ్లి పాడె సిద్ధం చేస్తుండగా స్పృహలోకి వచ్చిన రోగి తనకేమైందంటూ ప్రశ్శించడంతో కుటుంబసభ్యులు, బంధువులు అవాక్కయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... ఖమ్మంజిల్లా కొత్తగూడెం మండలం రూపాలతండాకు చెందిన బీ. బిక్కు (35) ఐదు రోజుల క్రితం మద్యం మత్తులో బైక్‌పై నుంచి పడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
అతడిని ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా, మెదడులో రక్తనాళాలు గడ్డకట్టుకుపోయినందున మెరుగైన వైద్యచికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఈనెల 1న గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఎంఆర్‌ఐ స్కానింగ్ తీసి వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగా అపస్మారకస్థితిలో ఉన్న రోగి బిక్కు మృతి చెందాడని బంధువులు భావిం చారు.
ఎంఎల్‌సీ కేసు కావడంతో పోస్టుమార్టం చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బందికి తెలియకుండా ఈనెల 2న అతడిని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.శనివారం ఉదయం దహనసంస్కారాలు చేసేందుకు పాడె సిద్ధం చేస్తుండగా స్పృహలోకి వచ్చిన బిక్కు ఏం జరుగుతోందని ప్రశ్శించడంతో వారు నివ్వెరపోయారు.
మంత్రికి ఫిర్యాదు...
బిక్కును తీసుకువచ్చిన బంధువులను వివరణ కోరగా గాంధీ ఆస్పత్రి వైద్యులు మృతిచెందాడని చెప్పినందునే తాము తీసుకువచ్చామన్నారు. విషయం తెలుసుకున్న రూపాలతండా మాజీ సర్పంచ్ బధ్రు విషయాన్ని స్థాని క ఎమ్మెల్యేకు చెప్పగా, ఆయన వైద్యమంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు.
గాంధీ యంత్రాంగం పరుగులు...
వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ఏం జరిగిందో తక్షణమే తనకు సమాచారం అందించాలని ఆదేశించడంతో గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టారు. ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన మరణాల జాబిత అందించాల ని వైద్యులను అదేశించారు. అందులో బిక్కు మృతి చెందిన సమాచారం లేదు. ఎక్కడో తిరకాసు జరిగిందని భావించి గురు, శుక్రవారాల్లో అడ్మిట్ అయిన కేస్‌షీట్లను పరిశీలించడగా న్యూరోసర్జరీ విభాగంలో బిక్కు కేస్‌షీట్ లభించింది.
బిక్కు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారా, మృతి చెందాడని భావించి బంధువులే వార్డునుంచి తరలించారా, వైద్యులు, సిబ్బందికి తెలియకుండా అపస్మారకస్థితిలో ఉన్న రోగిని ఎలా తీసుకువెళ్లారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ జేవీరెడ్డి తెలిపారు. ప్రస్తుతం బిక్కు కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రూపాలతండా మాజీ సర్పంచ్ బధ్రు తెలిపారు.