
వీఎం బంజర్ రింగ్ సెంటర్
పెనుబల్లి: కరోనా మహమ్మారి జిల్లాలో మళ్లీ వ్యాప్తి చెందుతోంది. పుణె నుంచి వచ్చిన ఒక మహిళకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.మాలతి బుధవారం ధ్రువీకరించారు. మండలంలోని వీఎం బంజర్ బేడా బుడగ జంగం కాలనీకి చెందిన సుమారు 252 మంది మూలికా వైద్యం చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లారు. వీరంతా ఈ నెల 10 నుంచి 15వ తేదీ మధ్య కాలంలో దఫాలుగా స్వగ్రామానికి చేరుకున్నారు. అధికారుల సూచన మేరకు వీరిలో 24 మందిని వీఎం బంజర్ బీసీ బాలుర వసతి గృహంలో, ఎస్సీ బాలుర వసతి గృహంలో 23 మందిని, శ్రీరామ ఇంజనీరింగ్ కళాశాలలోని క్వారంటైన్‌లో 108 మందిని ఉంచారు.
లంకపల్లి బీసీ హాస్టల్‌లో 60 మందిని, జెడ్పీ ఉన్నత పాఠశాలలో 37 మందిని.. మొత్తం 252 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. వీఎం బంజర్ వసతి గృహంలో ఉన్న 24 మందిలో ఏడుగురు మహారాష్ట్ర నుంచి, మిగిలిన వారు గుజరాత్ నుంచి ఈ నెల 13న ఇక్కడికి చేరుకున్నారు. అయితే మధిర మండలం మహదేవపురంలో గత సోమవారం ఒక పాజిటివ్ కేసు నమోదైన విషయం విదితమే. వారితోపాటు మహారాష్ట్ర నుంచి వచ్చిన వీరిపై అనుమానం రావడంతో వెంటనే తహసీల్దార్ రవికుమార్, ఎస్‌ఐ నాగరాజు బీసీ వసతి గృహంలో ఉన్న ఏడుగురిని విచారించారు. వీరిలో ఇద్దరు భార్యభర్తలు. వీరికి జలుబు, దగ్గు అనుమానిత లక్షణాలు ఉండటంతో సోమవారం 104 వాహనంలో పరీక్షల కోసంఖమ్మంకు తరలించారు. ఇందులో భర్తకు నెగెటివ్ రాగా.. మహిళకు పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. ఆమెను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో వీరితోపాటు కలిసి ఉన్న మరో ఐదుగురు, గుజరాత్ నుంచి వచ్చిన 17 మంది ఆరోగ్య పరిస్థితిపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా కరోనా సోకిన మహిళ నివాసం ఉండే ప్రాంతంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారీ చేశారు. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
క్వారంటైన్‌తో తప్పిన ముప్పు
పెనుబల్లి మండలానికి వివిధ రాష్ట్రాల నుంచి 455 మంది వ్యక్తులు రాగా.. వీరిలో 252 మంది వీఎం బంజర్ బేడా బుడగ జంగం కాలనీవాసులే. వీరు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల నుంచి వచ్చారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో తహసీల్దార్, ఎస్‌ఐ ప్రత్యేక శ్రద్ధ చూపించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వీరందరినీ ఐదు ప్రభుత్వ భవనాల్లో క్వారంటైన్ చేశారు. ఈ నెల 13వ తేదీన వచ్చిన వీరు అప్పటి నుంచి క్వారంటైన్‌లోనే ఉండటంతో పెను ప్రమాదంతప్పిందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకానొక దశలో వీరంతా తమను హోం క్వారంటైన్‌కు తరలించాలని అధికారులను నిలదీసినా వారు ససేమిరా అన్నారు. చివరకు రాజకీయ ఒత్తిళ్లు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం ప్రభుత్వ క్వారంటైన్‌లోనే ఉండాలని సర్ది చెప్పారు. ఇదిలా ఉండగా.. వారం రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న వీరికి ఆహారం అందిస్తున్న దాతలు, పలకరించడానికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment