ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులు (ఇన్‌సెట్‌లో) శ్రీనివాస్ మృతదేహం
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సర్వజనాస్పలో మృతి చెందాడు. వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే అతడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్‌పై దాడికి యత్నించడం ఉద్రిక్తతకు తారికి తీసింది.
సాక్షి, అనంతపురం న్యూసిటీ: ధర్మవరం పట్టణానికి చెందిన కె.శ్రీనివాస్ (20) ఈ నెల నాలుగో తేదీన విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కలెక్టర్ సత్యనారాయణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినపుడు అతడి పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి 9.54 గంటలకు సర్వజనాస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని కుటుంబ సభ్యులు మల్లి, నారాయణస్వామి, వెంకటేశ్‌లు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌కు తెలియజేశారు.
ఇంతకుముందే చికిత్స మొదలు పెట్టామని, ఏమీ కాదులే అని డాక్టర్ సమాధానమిచ్చారు. అర్ధరాత్రి దాటాక 12.05 గంటల సమయంలో శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ రమేష్‌ను దుర్భాషలాడారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మృతదేహాన్ని బెడ్‌పై నుంచి తీయకుండా నిరసన తెలిపారు. చివరకు ఔట్‌పోస్టు ఏఎస్‌ఐలు త్రిలోక్, రాము సర్తి చెప్పడంతో మృతదేహాన్ని మార్చురికీ తరలించారు.
వైద్యుడిని నిలదీసిన బంధువులు
యువకుడి మృతిపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావులు డ్యూటీ డాక్టర్ రమేష్‌కు సూచించారు. డాక్టర్ రమేష్ మెడిసిన్ వార్డు నుంచి ఆర్థో వార్డు వైపుగా వస్తున్నాడు. ఆ సమయంలో మృతుని కుటుంబీకులు ఒక్కసారిగా వైద్యున్ని నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ మృతి చెందాడంటూ మండిపడ్డారు.
చివరకు సెక్యూరిటీ మధ్య డాక్టర్ రమేష్‌ను సూపరింటెండెంట్ చాంబర్‌కు తీసుకొచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ రమేష్‌ను విధుల నుంచి తొలగించాలంటూ మృతుని కుటుంబీకులు సూపరింటెండెంట్ చాంబర్ ముందు బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రే మెరుగైన వైద్య సేవలందించామని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ తెలిపారు. విషపుద్రావకం చాలా ప్రమాదకరమని, తమవైపు నుంచి అందించాల్సిన వైద్య సేవలందించామని డాక్టర్ రమేష్ తెలిపారు. వీరి సమాధానంతో సంతృప్తి చెందని మృతుని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. చివరకు ఎస్‌ఐ లింగన్న, ఏఎస్‌ఐ రాము వారిని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ వద్దకు తీసుకెళ్లారు.
విచారణకు ఆదేశం
శ్రీనివాస్ మృతిపై ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ విచారణకు ఆదేశించారు. చిన్నపిల్లల విభాగం, అనస్తీషియా, ఈఎన్‌టీ హెచ్‌ఓడీలు 24 గంటల్లోగా విచారణ చేయాలని సూచించారు. డాక్టర్ రమేష్‌కు మెమో జారీ చేశారు.
ఉద్యోగాలు చేయలేం..
అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ పట్ల మృతుని కుటుంబీకులు వ్యవహరించిన తీరును ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది తప్పుబడుతున్నారు. వైద్యో నారాయణో హరి అని వైద్యున్ని దేవునిగా పోల్చుతారని, అటువంటిది వైద్యునిపై దాడికి యత్నించడమే కాకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడడమేంటని వాపోతున్నారు. ప్రాణం పోయాలని చూస్తామే కానీ.. తీయాలని ఎవరికీ ఉండదని పేర్కొన్నారు. తమ తప్పు లేకపోయినా దూషిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment