Patient Death
-
ఆక్సిజన్ అందక కరోనా రోగి మృతి
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా రోగి మృతి కలకలం రేపుతోంది. ఆక్సిజన్ అందక బెడ్ పైనుంచి కింద పడి కరోనా బాధితుడు సోమవారం మృతి చెందడంతో అక్కడ ఆందోళన నెలకొంది. రోగి మృతికి వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో పాటు ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన బాటపట్టారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ... గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన వృద్దుడు కరోనాతో ఆసుపత్రిలో చేరితే సరైన వైద్యం అందించక, పట్టించుకునేవారు కానరాక కింద పడి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఎల్లో మీడియా క్షణక్షణం ప్రజల్ని భయపెడుతోంది) ఆస్పత్రి నిర్వాకం, వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయకుంటే గవర్నర్ బర్తరఫ్ చేయాలని కోరారు. ఆస్పత్రి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. (చదవండి: వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..) -
వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు
కోట : రాజస్తాన్‌లోని కోటలో శుక్రవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. సాకెట్లో నుంచి వెంటిలేటర్ ప్లగ్ తీసి, ఎయిర్‌కూలర్ ప్లగ్ పెట్టడంతో ఒక రోగి మరణించాడు. వివరాలు.. కరోనా వైరస్ అనే అనుమానంతో ఒక 40 ఏళ్ల వ్యక్తిని రాజస్తాన్‌లోని మహారావు భీమ్ సింగ్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డ్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసోలేషన్ వార్డులో బాగా వేడిగా ఉండటంతో, రోగి కుటుంబ సభ్యులు బయటి నుంచి ఎయిర్ కూలర్ తీసుకువచ్చారు. కూలర్‌ను ఆన్ చేసేందుకు.. వెంటిలేటర్ కనెక్ట్ అయి ఉన్న సాకెట్లో వెంటిలేటర్‌కు సంబంధించిన ప్లగ్‌ను తీసి, కూలర్ ప్లగ్‌ను పెట్టారు. అరగంట తరువాత వెంటిలేటర్లో చార్జింగ్ అయిపోవడంతో ఆ వ్యక్తి మృతి చెందారు. పొరపాటున రోగి కుటుంబ సభ్యులే వెంటిలేటర్ ప్లగ్‌ను తీసేశారని ఎంబీఎస్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.(కరోనాతో నాగిరెడ్డి మనవడు మృతి) అయితే ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో నెగెటివ్ అని తేలిందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో జూన్ 15న సదరు వ్యక్తిని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చినట్లు వెల్లడించారు. ఇంతలోనే కుటుంబసభ్యుల పొరపాటు వల్ల ఇలా జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, వారు దర్యాప్తు జరుపుతున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. -
సర్వజనాస్పత్రిలో ఉద్రిక్తత
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సర్వజనాస్పలో మృతి చెందాడు. వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే అతడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్‌పై దాడికి యత్నించడం ఉద్రిక్తతకు తారికి తీసింది. సాక్షి, అనంతపురం న్యూసిటీ: ధర్మవరం పట్టణానికి చెందిన కె.శ్రీనివాస్ (20) ఈ నెల నాలుగో తేదీన విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కలెక్టర్ సత్యనారాయణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినపుడు అతడి పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి 9.54 గంటలకు సర్వజనాస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని కుటుంబ సభ్యులు మల్లి, నారాయణస్వామి, వెంకటేశ్‌లు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌కు తెలియజేశారు. ఇంతకుముందే చికిత్స మొదలు పెట్టామని, ఏమీ కాదులే అని డాక్టర్ సమాధానమిచ్చారు. అర్ధరాత్రి దాటాక 12.05 గంటల సమయంలో శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ రమేష్‌ను దుర్భాషలాడారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మృతదేహాన్ని బెడ్‌పై నుంచి తీయకుండా నిరసన తెలిపారు. చివరకు ఔట్‌పోస్టు ఏఎస్ఐలు త్రిలోక్, రాము సర్తి చెప్పడంతో మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. వైద్యుడిని నిలదీసిన బంధువులు యువకుడి మృతిపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావులు డ్యూటీ డాక్టర్ రమేష్‌కు సూచించారు. డాక్టర్ రమేష్ మెడిసిన్ వార్డు నుంచి ఆర్థో వార్డు వైపుగా వస్తున్నాడు. ఆ సమయంలో మృతుని కుటుంబీకులు ఒక్కసారిగా వైద్యున్ని నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ మృతి చెందాడంటూ మండిపడ్డారు. చివరకు సెక్యూరిటీ మధ్య డాక్టర్ రమేష్‌ను సూపరింటెండెంట్ చాంబర్‌కు తీసుకొచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ రమేష్‌ను విధుల నుంచి తొలగించాలంటూ మృతుని కుటుంబీకులు సూపరింటెండెంట్ చాంబర్ ముందు బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రే మెరుగైన వైద్య సేవలందించామని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ తెలిపారు. విషపుద్రావకం చాలా ప్రమాదకరమని, తమవైపు నుంచి అందించాల్సిన వైద్య సేవలందించామని డాక్టర్ రమేష్ తెలిపారు. వీరి సమాధానంతో సంతృప్తి చెందని మృతుని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. చివరకు ఎస్ఐ లింగన్న, ఏఎస్ఐ రాము వారిని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ వద్దకు తీసుకెళ్లారు. విచారణకు ఆదేశం శ్రీనివాస్ మృతిపై ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ విచారణకు ఆదేశించారు. చిన్నపిల్లల విభాగం, అనస్తీషియా, ఈఎన్టీ హెచ్ఓడీలు 24 గంటల్లోగా విచారణ చేయాలని సూచించారు. డాక్టర్ రమేష్‌కు మెమో జారీ చేశారు. ఉద్యోగాలు చేయలేం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ పట్ల మృతుని కుటుంబీకులు వ్యవహరించిన తీరును ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది తప్పుబడుతున్నారు. వైద్యో నారాయణో హరి అని వైద్యున్ని దేవునిగా పోల్చుతారని, అటువంటిది వైద్యునిపై దాడికి యత్నించడమే కాకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడడమేంటని వాపోతున్నారు. ప్రాణం పోయాలని చూస్తామే కానీ.. తీయాలని ఎవరికీ ఉండదని పేర్కొన్నారు. తమ తప్పు లేకపోయినా దూషిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి
- ఆందోళనకుదిగిన మృతుడి కుటుంబసభ్యులు ఎంజీఎం : వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, మిత్రులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కథనం ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గకు చెందిన సీహెచ్. అమర్నాథ్(18) ఈనెల 5వ తేదీన కృష్టాష్టమి వేడుకల్లో గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిటయ్యూడు. కాలుతోపాటు నడుముకు తీవ్రగాయాలు కావడంతో అమర్నాథ్ను ఆర్థోవార్డులో అడ్మిట్ చేశారు. అప్పట్నుంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 6వ తేదీ నుంచి అమర్నాథ్ జ్వరంతో బాధపడుతున్నాడు. మరుసటి రోజు జ్వరం తీవ్రమైంది. సోమవారం రాత్రి పరిస్థితి విషమించింది. శ్వాసతీసుకోవడం సైతం ఇబ్బంది కరంగా మారింది. దీంతో సిబ్బంది వెంటనే క్యాజువాలిటీకి తరలించారు. అరుుతే, వైద్య చికిత్సలు అందిస్తున్న క్రమంలోనే అమర్నాథ్ మృతి చెందాడు. వైద్యులు సక్రమంగా వైద్యం చేయలేదని, అందుకోసమే అమర్నాథ్ మృతి చెందాడని బంధువులు, మిత్రులు ఆరోపించారు. వైద్యులు నిర్లక్ష్యం చేశారంటూ ఆందోళనకు దిగారు. అనంతరం మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఎంజీఎం పరిపాలనాధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.