ఆపరేషన్ విజయవంతమైంది కానీ, రోగి మరణించాడు అన్నట్టుంది జిల్లాకేంద్రాస్పత్రిపై అధికారుల తీరు. లంచం ఇవ్వలేక తండ్రీ కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నానా హంగామా చేసి విచారణ అధికారిని నియమించారు. ఘటనకు నలుగురు బాధ్యులంటూ ఆ అధికారి తేల్చారు. వారిపై చర్య తీసుకున్నట్టు కలెక్టర్ కూడా ప్రకటించారు. కానీ, ఆ నలుగురు ఎవరనేది ఎవరికీ తెలియదు. కనీసం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న జెడ్పీ చైర్మన్, ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్‌లకు కూడా తెలియకపోవడం
గమనార్హం.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా ఆస్పత్రిలో లంచావతారుల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటనపై నలుగురిపై చర్య తీసుకున్నామని చెబుతున్నా వారి పేర్లు మాత్రం బయట పెట్టడం లేదు. సంఘటన జరిగిన రోజు ఆగమేఘాల మీద ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల పాటు హడావిడి చేసింది. ప్రజాప్రతి నిధులు ఆస్పత్రి చుట్టూ క్యూ కట్టారు. ఈ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేక విచారణ జరిపించారు. నివేదిక అంది పక్షంరోజులు గడుస్తున్నా ఘటనకు సంబంధించిన వ్యక్తులపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. దీనిపై కలెక్టర్ నాలుగు రోజుల క్రితం విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రికి ఘటనకు సంబంధించి నలుగురిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ నలుగురు ఎవరనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌లను సంప్రదించినా తమకు తెలియదంటున్నారు. జిల్లా ఆస్పత్రిలోని సిబ్బంది అంతా యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సస్పెన్స్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..!
జిల్లా కేంద్రంలోని కురిహినిశెట్టి కాలనీకి చెందిన కొండపురం చెన్నకేశవులు (30) తాపీమేస్త్రీ. రెండో కా న్పు కోసం భార్య నాగలక్ష్మిని జనవరి 19న జిల్లా ఆ స్పత్రికి తీసుకెళ్లాడు. అదే నెల 20న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ డబిడ్డ పుడితే రూ.500, మగబిడ్డ పుడితే.. రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా చెన్నకేశవులును కూడా లంచం కోసం పీడించారు. అయితే, ఆ డబ్బులు ఇవ్వలేక ఆందోళనకు గురైన చెన్నకేశవులు విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలోజరుగుతున్న దారుణాన్ని సూసైడ్ నోట్ రాసి తన మూడేళ్ల కూతురుతో కలిసి జనవరి 22న రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
సంఘటనపై ప్రత్యేక విచారణ..
లంచావతారుల ఆగడాలకు తండ్రీ కూతురు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద కదలివచ్చింది. దీని పై జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేక దృష్టి సారించి... ఏజేసీ రాజారాం నేతృత్వంలో విచారణకు ఆదేశించారు.
ఆయన కూడా దీనిపై వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆస్పత్రిలో లంచాల వసూలు భారీగానే ఉన్నట్లు ఏజేసీ ఇచ్చిన రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బంది పేర్లను పేర్కొంటూ కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ విషయమై చెన్నకేశవులు భార్య భాగ్యలక్ష్మి స్వయంగా కలెక్టర్ శ్రీదేవిని కలిసి తన భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నలుగురిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే ఆ నలుగురు ఎవరనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ శామ్యూల్‌ను, డీసీహెచ్ పద్మజలను సంప్రదిస్తే తమకు తెలియదంటున్నారు. ఎవరిపైన చర్యలు తీసుకున్నారో తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆస్పత్రిలోని సిబ్బంది మాత్రం అందరూ యధావిధిగా విధులకు హాజరవుతున్నారు. కలెక్టర్ ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది అంతా సస్పెన్స్‌గా మారింది.
ఎవరా నలుగురు..?
Published Sun, Feb 8 2015 3:36 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement