Dchs
-
అసలేం జరుగుతోంది..?
సాక్షి చీపురుపల్లి(విజయనగరం) : చీపురుపల్లి సీహెచ్‌సీలో వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిల్లా అధికారులకు, ఇక్కడి వైద్యులకు సమన్వయం లేకపోవడం ఒకెత్తయితే, అసలు ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎవరు ఏపని చేయాలో కూడా తెలియని స్థితి నెలకొంది. ఈ విషయం డీసీహెచ్ఎస్ ఉష శ్రీ ఎదుటే తేటతెల్లం కావడంతో ఆమె సైతం వైద్యులు తీరుపై అవాక్కయ్యారు. ఈ నెల 30న రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై అక్కడ పని చేస్తున్న శానిటరీ సూపర్వైజర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆయనపై కేసు కూడా నమోదైంది. దీనిపై డీసీహెచ్ఎస్ ఉషశ్రీ దర్యాప్తుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చారు. ఆమెకు వైద్యులు అసభ్యకరత ప్రవర్తన విషయం అంతటిని చెప్పకుండా దాచిపెట్టారు. అంతేకాదు ఇంత పెద్ద సంఘటన జరిగితే పోలీసులకు కూడా వైద్యులు ఫిర్యాదు చేయలేదు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి రాష్ట్ర అధికారులు డీసీహెచ్ఎస్కు సమాచారం ఇచ్చారు. అంతా మాయ.. మరో వింత ఏంటంటే అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తిని 4 రోజుల ముందే తొలగించినట్లు కాంట్రాక్టర్ తనకు చెప్పాడని డీసీహెచ్ఎస్కు చెబుతుంటే, లేదు ఆ శానిటరీ సూపర్వైజర్ ఇంకా విధుల్లోనే ఉన్నాడని డాక్టర్లు చెబుతున్నారు. లేదు నాలుగు రోజుల క్రితమే సదరు సూపర్వైజర్ ఎస్‌కోట నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చాడని అశోక్ అనే మరో ఉద్యోగి డీసీహెచ్ఎస్కు చెప్పాడు. ఇదంతా చూస్తుంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఎలా రాజ్యమేలుతుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగినా ఉన్నతాధికారులకు ఇక్కడి నుంచి సమాచారం వెళ్లలేదంటే ఇంకా ఎంత పెద్ద విషయం చోటు చేసుకున్నా చెప్పరేమో అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆస్పత్రిని గాడిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు బహిరంగంగానే అనుకుంటున్నారు. గాలికొదిలేస్తారా..? దర్యాప్తు చేసేందుకు గురువారం సీహెచ్‌సీకి వచ్చిన డీసీహెచ్ఎస్ ఉషశ్రీ అక్కడి పరిస్థితులు చూసి డాక్టర్లు, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. చికిత్సకు వచ్చిన రోగికి అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయరా..? ఉన్నతాధికారులకు విషయం చెప్పరా..? ఇది ప్రభుత్వ ఆస్పత్రి అనుకుంటున్నారా..? లేక ప్రైవేటు ఆస్పత్రి అనుకుంటున్నారా...? సెల్ఫోన్లు చూసుకునేందుకా ఇక్కడికి మీరు డ్యూటీకి వస్తుంది అంటూ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. లీగల్ విషయాలు పట్టించుకోకుండా ఆస్పత్రిని గాలికి వదిలేద్దామనుకుంటున్నారా..? అందరికి మెమోలు ఇస్తాను సమాధానం చెప్పండి అంటూ మండిపడ్డారు. అనంతరం సంబంధిత రోగి, ఆమె తల్లితో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇంత పెద్ద సంఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా సమాచారం ఇవ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు ఒక్కోలా.. దర్యాప్తు చేస్తున్న సమయంలో తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, ఆ రోజు పాత ఆస్పత్రికి విధులను వేరొకరికి అప్పగించేందుకు వెళ్లానని ప్రధాన వైద్యాధికారి నారాయణరావు, తాను హాఫ్‌లో ఉన్నానని ఇంకో సీనియర్ డాక్టర్ మహేంద్రగిరి తెలిపారు. ఉన్నా లేకున్నా..? విషయం తెలుసుకుని అయినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందని డీసీహెచ్ఎస్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పోలీసులకు అయినా చెప్పాలి కదా అని అడిగారు. ఈ విషయం ద్వారా మీకు ఎవరికీ బాధ్యత లేదని అర్థమైందని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఇకపై భద్రత ప్రమాణాలు పాటిస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సెక్యూరిటీ గార్డులను నియమిస్తాం. చీపురుపల్లి సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాం. అలా జరిగితే పోలీస్ అవుట్ పోస్టు కూడా ఏర్పడుతుంది. ఇంత పెద్ద సంఘటన ఆస్పత్రిలో జరిగితే సమాచారం ఇవ్వకపోడం, మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఉన్నతాధికారులు తనను అడగడం విచారకరమైన విషయమన్నారు. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ విధుల్లో లేడని కాంట్రాక్టర్, ఉన్నాడని వైద్యులు చెబుతున్నారు. అంటే ఆస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యం ఏలుతోంది. అందరిపైనా చర్యలు ఉంటాయి. – ఉషశ్రీ, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి, విజయనగరం. -
రోడ్డెక్కిన డాక్టర్లు
డీసీహెచ్‌ఎస్‌పై దాడికి నిరసనగా ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ మద్దతుగా నిలిచిన జిల్లా అధికారుల సంఘం అనంతపురం మెడికల్ : నాడి పట్టాల్సిన వైద్యులు రోడ్డెక్కారు. న్యాయం చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. కదిరి ఏరియా ఆస్పత్రి వద్ద జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ రమేష్‌నాథ్‌పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైద్యులు, సిబ్బంది ఏకమై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. వీరికి జిల్లా అధికారుల సంఘం నేతలు మద్దతు తెలిపారు. సోమవారం ఉదయాన్నే అనంతపురం సర్వజనాస్పత్రి వద్దకు చేరుకున్న డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుని బైఠాయించారు. దీంతో కలెక్టర్ కోన శశిధర్ వారిని లోపలికి పిలిపించి మాట్లాడారు. ఇలా వైద్యులపై దాడి చేయడం ఏంటని..? పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ఎలా విధులు నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఎంత ఒత్తిడి ఉన్నా విధులను సమర్థవంతంగా చేపడుతున్నామని, ఇలాంటి చర్యల వల్ల విధులకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందన్నారు. తక్షణం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ, ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఈ అంశాన్ని తనకు వదిలేయాలని, బాధ్యులపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇక రెవెన్యూ భవన్లో జరిగిన ‘మీ కోసం’కు వచ్చిన అధికారులు కూడా దాడి ఘటనను ముక్తకంఠంతో ఖండించారు. కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఏదైనా ఉంటే అధికారులకు విన్నవించాలే గానీ ఇలా దాడులు చేస్తే ఎలాగని, తక్షణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేతలు కోరారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ యుగంధర్, ఆస్పత్రి యూనిట్ అధ్యక్షులు డాక్టర్ రామస్వామి నాయక్, కార్యదర్శి డాక్టర్ వీరభద్రయ్య, నర్సింగ్ సంఘం అధ్యక్షురాలు సావిత్రి, ఐఎంఏ అధ్యక్షులు కొండయ్య, కార్యదర్శి వినయ్, డాక్టర్లు జగన్మోహన్రెడ్డి, ఆదిశేషు, ప్రవీణ్‌దీన్‌కుమార్, యండ్లూరి ప్రభాకర్, కన్నేగంటి భాస్కర్, రాంకిషోర్, విజయమ్మ, డీఆర్ఓ సి.మల్లీశ్వరి దేవి, డీఎఫ్ఓ రాఘవయ్య, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, సెరికల్చర్ ఏడీ అరుణకుమారి, మార్కెటింగ్ శాఖ ఏడీ హరిలీల, ఎస్ఎస్ఏ పీఓ దశరథరామయ్య, డీఎంహెచ్ఓ వెంకటరమణ, చేనేత జౌళీ శాఖ ఏడీ పవన్‌కుమార్, ఉద్యాన శాఖ డీడీ సుబ్బరాయుడు, బీసీ సంక్షేమ శాఖ డీడీ రమాభార్గవి, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ రోశన్న, డ్వామా పీడీ నాగభూషణం, డీఎస్ఓ ప్రభాకర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరేరామనాయక్, జేడీఏ శ్రీరామ్మూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ జయకుమార్, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, కార్మిక శాఖ అధికారి రాణి, మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ వెంకటేశ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు డాక్టర్ రమేష్‌నాథ్‌పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. గుంతకల్లులో వైద్యులు రోడ్డుమీదకొచ్చి ఆందోళన చేశారు. హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. గుంతకల్లులో బీజేపీ నాయకులు ఎస్ఐకు వినతిపత్రం అందజేశారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్జీఓ ఉద్యోగులు, వైద్య సిబ్బంది ర్యాలీలు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మడకశిరలో ర్యాలీ చేశారు. పెనుకొండలో ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. తాడిపత్రి, గోరంట్ల, గుత్తి, కణేకల్లు, ఆత్మకూరులో ఆందోళనలు నిర్వహించారు. రాయదుర్గంలో విధులు బహిష్కరించారు. శింగనమల, గార్లదిన్నె సీహెచ్‌సీల వద్ద ధర్నా చేశారు. కూడేరు, ఉరవకొండలో విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. -
ఎవరా నలుగురు..?
ఆపరేషన్ విజయవంతమైంది కానీ, రోగి మరణించాడు అన్నట్టుంది జిల్లాకేంద్రాస్పత్రిపై అధికారుల తీరు. లంచం ఇవ్వలేక తండ్రీ కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నానా హంగామా చేసి విచారణ అధికారిని నియమించారు. ఘటనకు నలుగురు బాధ్యులంటూ ఆ అధికారి తేల్చారు. వారిపై చర్య తీసుకున్నట్టు కలెక్టర్ కూడా ప్రకటించారు. కానీ, ఆ నలుగురు ఎవరనేది ఎవరికీ తెలియదు. కనీసం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా ఉన్న జెడ్పీ చైర్మన్, ఆస్పత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్‌లకు కూడా తెలియకపోవడం గమనార్హం. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా ఆస్పత్రిలో లంచావతారుల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటనపై నలుగురిపై చర్య తీసుకున్నామని చెబుతున్నా వారి పేర్లు మాత్రం బయట పెట్టడం లేదు. సంఘటన జరిగిన రోజు ఆగమేఘాల మీద ప్రభుత్వ యంత్రాంగం రెండు రోజుల పాటు హడావిడి చేసింది. ప్రజాప్రతి నిధులు ఆస్పత్రి చుట్టూ క్యూ కట్టారు. ఈ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేక విచారణ జరిపించారు. నివేదిక అంది పక్షంరోజులు గడుస్తున్నా ఘటనకు సంబంధించిన వ్యక్తులపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు. దీనిపై కలెక్టర్ నాలుగు రోజుల క్రితం విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రికి ఘటనకు సంబంధించి నలుగురిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ నలుగురు ఎవరనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌లను సంప్రదించినా తమకు తెలియదంటున్నారు. జిల్లా ఆస్పత్రిలోని సిబ్బంది అంతా యధావిధిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం సస్పెన్స్‌గా మారింది. అసలేం జరిగిందంటే..! జిల్లా కేంద్రంలోని కురిహినిశెట్టి కాలనీకి చెందిన కొండపురం చెన్నకేశవులు (30) తాపీమేస్త్రీ. రెండో కా న్పు కోసం భార్య నాగలక్ష్మిని జనవరి 19న జిల్లా ఆ స్పత్రికి తీసుకెళ్లాడు. అదే నెల 20న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆస్పత్రి సిబ్బంది మాత్రం ఆ డబిడ్డ పుడితే రూ.500, మగబిడ్డ పుడితే.. రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. అందులో భాగంగా చెన్నకేశవులును కూడా లంచం కోసం పీడించారు. అయితే, ఆ డబ్బులు ఇవ్వలేక ఆందోళనకు గురైన చెన్నకేశవులు విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలోజరుగుతున్న దారుణాన్ని సూసైడ్ నోట్ రాసి తన మూడేళ్ల కూతురుతో కలిసి జనవరి 22న రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనపై ప్రత్యేక విచారణ.. లంచావతారుల ఆగడాలకు తండ్రీ కూతురు చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద కదలివచ్చింది. దీని పై జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ప్రత్యేక దృష్టి సారించి... ఏజేసీ రాజారాం నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. ఆయన కూడా దీనిపై వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆస్పత్రిలో లంచాల వసూలు భారీగానే ఉన్నట్లు ఏజేసీ ఇచ్చిన రిపోర్టులో ఉన్నట్లు సమాచారం. ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బంది పేర్లను పేర్కొంటూ కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. ఈ విషయమై చెన్నకేశవులు భార్య భాగ్యలక్ష్మి స్వయంగా కలెక్టర్ శ్రీదేవిని కలిసి తన భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నలుగురిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే ఆ నలుగురు ఎవరనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ శామ్యూల్‌ను, డీసీహెచ్ పద్మజలను సంప్రదిస్తే తమకు తెలియదంటున్నారు. ఎవరిపైన చర్యలు తీసుకున్నారో తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలూ అందలేదని వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆస్పత్రిలోని సిబ్బంది మాత్రం అందరూ యధావిధిగా విధులకు హాజరవుతున్నారు. కలెక్టర్ ఎవరిపై చర్యలు తీసుకున్నారనేది అంతా సస్పెన్స్‌గా మారింది. -
స్వైన్ ఫ్లూ వార్డులు తప్పనిసరి
టెక్కలి: ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ వార్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయూలని జిల్లా ప్రాంతీయ ఆస్పత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) ఎం.సునీలా స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి ఏరియా ఆస్పత్రిని ఆమె సందర్శించారు స్వైన్‌ఫ్లూ వార్డును పరిశీలించి ఏర్పాట్లు బాగోలేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రామాకేర్ విభాగంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని సూపరింటెండెట్ కేశవరావును ఆదేశించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. టెక్కలి, పాలకొండ, రాజాం ఆస్పత్రుల్లో పదేసి పడకలతో, పలాస, సోంపేట, బారువ, ఇచ్ఛాపురం, పాతపట్నం, రణస్థలం, కోటబొమ్మాళి ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మూడేసి పడకలతో స్వైన్‌ఫ్లూ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే వ్యాధి నివారణకు ఆయుష్ విభాగం నుంచి హోమియో మందులు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రణస్థలం, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి మండలాల్లోని ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఆయుష్ పారా మెడికల్ సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా శిబిరాలను ఏర్పాటు చేసి ‘ఆర్సనికం ఆల్బమ్ 30 పొటాన్సీ’ హోమియో మందులను ఈ నెల ఏడో తేదీ వరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ఓల్డేజ్ హోమ్‌లలో పంపిణీ చేస్తామన్నారు. -
51 లక్షల మంది ఆరోగ్యానికి మీరే రక్ష
కాకినాడ క్రైం :‘ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. అనుకుంటే మీరేదైనా చేయగలరు. మీరు మారాలి’ అంటూ వైద్యులకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రభుత్వాస్పత్రుల వైద్యులకు సూచించారు. శనివారం కాకినాడలో ఆయన కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, జీజీహెచ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ, మెట్ట, మైదాన, ఏజెన్సీ వంటి ప్రాంతాలతో వైవిధ్యభరితమైన వాతావరణం కలిగిన జిల్లాలోని 51 లక్షల మంది ఆరోగ్యానికి వైద్యులే బాధ్యులన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు పూర్తి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జబ్బు పడి ఆస్పత్రికి వస్తే కొత్త రోగాల బారిన పడతామనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. డ్యూటీ వేళలో విధిగా ఆస్పత్రిలోనే ఉండాలని, నర్సింగ్ హోంలకు వెళ్లవద్దని చెప్పారు. జిల్లాలో బయోమెట్రిక్ విధానం అమలవుతున్నందున ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. బాధ్యతారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ‘సమన్వయం’ ఎక్కడ..? జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్), జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారుల మధ్య సమన్వయం కొరవడిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. డీసీహెచ్ఎస్ ఇచ్చిన నివేదికలకు, వైద్యాధికారులు చెప్పే వివరాలకు పొంతన లేదన్నారు. ఆస్పత్రి ప్రసవాలు, మాతా శిశు మరణాలు, ఎస్ఎన్సీయూ, ఇమ్యూనైజేషన్, జవహర్ బాల ఆరోగ్య రక్ష, టీబీ, హెచ్ఐవీ/ఎయిడ్స్, అంధత్వ నివారణ, స్కూల్ హెల్త్ తదితర కార్యక్రమాలు అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎంఈ డాక్టర్ జి.శాంతారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.పవన్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు ఆదర్శం కావడం బాధాకరం.. తాను రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించానని, అప్పట్లో ఆ కళాశాలకు ధీటుగా ఉండాలని కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు ఆకాంక్షించేవారని, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయని మంత్రి కామినేని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా జీజీహెచ్‌ను తీర్చిదిద్దాలనుకోవడం బాధాకరమన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేయనున్న మెటర్నిటీ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాకుకు మంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఐసీయూని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులిచ్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సహకరించాలన్నారు. సీఎస్ఆర్ నిధులను పుష్కలంగా అందిస్తే మెరుగైన సౌకర్యాలు జీజీహెచ్‌లోనే సమకూరుతాయన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకట బుద్ధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎంపీ తోట నరసింహం, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, మెన్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ కె.లకో్ష్మజీనాయుడు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, సీ పోర్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కామినేనిని పలువురు సత్కరించారు. ఆయన జీజీహెచ్, ఆర్ఎంసీలను పరిశీలించారు. జిల్లా ఇన్చార్జిగా సౌరభ్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాల సక్రమ అమలుకు ఐఏఎస్ అధికారులను ఇన్చార్జిలుగా నియమించామని మంత్రి కామినేని వెల్లడించారు. జిల్లాకు సౌరభ్‌ను ఇన్చార్జిగా నియమించామన్నారు. ఆయన నెల నెలా జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్షించి తనకు నివేదికలు అందజేస్తారన్నారు. మాతా శిశుమరణాలు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజలకు మంచి చికిత్స, ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఇన్చార్జిలను నియమించామన్నారు. -
ఎన్నికల కోడ్ ఉండగానే పదోన్నతి
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతుండగానే మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరుగుతుందనగా ఓ వైద్యాధికారి కనీస నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ పరిశీలించకుండానే ఉద్యోగికి పదోన్నతి కల్పించారు. ఈ విషయం సంబంధిత శాఖలోని ఇతర ఉద్యోగులకు కూడా తెలియకుండా జరగడం గమనార్హం. ఈ వ్యవహారం జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త కార్యాలయంలో పది రోజుల క్రితం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు .. జిల్లా ఆస్పత్రిలోని నాల్గో తరగతి ఉద్యోగికి పది రోజుల క్రితం డీసీహెచ్ఎస్ పదోన్నతి కల్పించారు. ఎన్నికల కోడ్ ఉండగానే ఈ పదోన్నతి ఇచ్చారు. డీసీహెచ్ఎస్ గత నెలలో పదవీవిరమణ చేయనుండగా పదోన్నతి ప్రక్రియను ముగించారు. పదోన్నతి ఉత్తర్వులు సంబంధిత సెక్షన్ ఉద్యోగికి తెలియకుండానే తన ఇంట్లో ఉత్తర్వులను సిద్ధం చేసి, సంతకం చేసి పదోన్నతి కాపీని అందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పదోన్నతి కల్పించకూడదని ఉద్యోగులు ఎంత చెప్పినా ఆయన మాత్రం వినిపించుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా ఆరుగురు ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారు. అయితే ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకున్నారు. పదోన్నతులు, బదిలీలు ఎన్నికల కోడ్ ఉండగా చేపట్టకూడదని నిబంధన ఉన్నా వైద్య, విధాన పరిషత్ అధికారి మాత్రం పదోన్నతి కల్పించారు. ఈ వ్యవహారంపై వైద్యశాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సెక్షన్‌కు సంబంధం లేకుండా ఎలాంటి, ఫైలు కూడా లేకుండా పదోన్నతి కల్పించడంతో వారు ఉన్నతాధికారిపై మండిపడుతున్నారు.