నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎన్నికల కోడ్ అమలవుతుండగానే మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరుగుతుందనగా ఓ వైద్యాధికారి కనీస నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్ పరిశీలించకుండానే ఉద్యోగికి పదోన్నతి కల్పించారు. ఈ విషయం సంబంధిత శాఖలోని ఇతర ఉద్యోగులకు కూడా తెలియకుండా జరగడం గమనార్హం. ఈ వ్యవహారం జిల్లా ఆస్పత్రుల సమన్వయ కర్త కార్యాలయంలో పది రోజుల క్రితం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు .. జిల్లా ఆస్పత్రిలోని నాల్గో తరగతి ఉద్యోగికి పది రోజుల క్రితం డీసీహెచ్‌ఎస్ పదోన్నతి కల్పించారు. ఎన్నికల కోడ్ ఉండగానే ఈ పదోన్నతి ఇచ్చారు.
డీసీహెచ్‌ఎస్ గత నెలలో పదవీవిరమణ చేయనుండగా పదోన్నతి ప్రక్రియను ముగించారు. పదోన్నతి ఉత్తర్వులు సంబంధిత సెక్షన్ ఉద్యోగికి తెలియకుండానే తన ఇంట్లో ఉత్తర్వులను సిద్ధం చేసి, సంతకం చేసి పదోన్నతి కాపీని అందించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పదోన్నతి కల్పించకూడదని ఉద్యోగులు ఎంత చెప్పినా ఆయన మాత్రం వినిపించుకోకుండా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా ఆరుగురు ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారు. అయితే ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తీసుకున్నారు. పదోన్నతులు, బదిలీలు ఎన్నికల కోడ్ ఉండగా చేపట్టకూడదని నిబంధన ఉన్నా వైద్య, విధాన పరిషత్ అధికారి మాత్రం పదోన్నతి కల్పించారు. ఈ వ్యవహారంపై వైద్యశాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సెక్షన్‌కు సంబంధం లేకుండా ఎలాంటి, ఫైలు కూడా లేకుండా పదోన్నతి కల్పించడంతో వారు ఉన్నతాధికారిపై మండిపడుతున్నారు.
ఎన్నికల కోడ్ ఉండగానే పదోన్నతి
Published Sat, May 3 2014 2:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement