టెక్కలి: ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ వార్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయూలని జిల్లా ప్రాంతీయ ఆస్పత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) ఎం.సునీలా స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి ఏరియా ఆస్పత్రిని ఆమె సందర్శించారు స్వైన్‌ఫ్లూ వార్డును పరిశీలించి ఏర్పాట్లు బాగోలేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రామాకేర్ విభాగంలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని సూపరింటెండెట్ కేశవరావును ఆదేశించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. టెక్కలి, పాలకొండ, రాజాం ఆస్పత్రుల్లో పదేసి పడకలతో, పలాస, సోంపేట, బారువ, ఇచ్ఛాపురం, పాతపట్నం, రణస్థలం, కోటబొమ్మాళి ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మూడేసి పడకలతో స్వైన్‌ఫ్లూ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే వ్యాధి నివారణకు ఆయుష్ విభాగం నుంచి హోమియో మందులు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రణస్థలం, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి మండలాల్లోని ఆస్పత్రుల్లో పని చేస్తున్న ఆయుష్ పారా మెడికల్ సిబ్బందితో జిల్లా వ్యాప్తంగా శిబిరాలను ఏర్పాటు చేసి ‘ఆర్సనికం ఆల్బమ్ 30 పొటాన్సీ’ హోమియో మందులను ఈ నెల ఏడో తేదీ వరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, ఓల్డేజ్ హోమ్‌లలో పంపిణీ చేస్తామన్నారు.