51 లక్షల మంది ఆరోగ్యానికి మీరే రక్ష | 51 million people in the health of yourself amulet | Sakshi
Sakshi News home page

51 లక్షల మంది ఆరోగ్యానికి మీరే రక్ష

Published Sun, Aug 3 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

51 లక్షల మంది ఆరోగ్యానికి మీరే రక్ష

51 లక్షల మంది ఆరోగ్యానికి మీరే రక్ష

 కాకినాడ క్రైం :‘ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది. అనుకుంటే మీరేదైనా చేయగలరు. మీరు మారాలి’ అంటూ వైద్యులకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రభుత్వాస్పత్రుల వైద్యులకు సూచించారు. శనివారం కాకినాడలో ఆయన కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్, జీజీహెచ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోనసీమ, మెట్ట, మైదాన, ఏజెన్సీ వంటి ప్రాంతాలతో వైవిధ్యభరితమైన వాతావరణం కలిగిన జిల్లాలోని 51 లక్షల మంది ఆరోగ్యానికి వైద్యులే బాధ్యులన్నారు.
 
 ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యులు పూర్తి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జబ్బు పడి ఆస్పత్రికి వస్తే కొత్త రోగాల బారిన పడతామనే భావన ప్రజల్లో  నెలకొందన్నారు. డ్యూటీ వేళలో విధిగా ఆస్పత్రిలోనే ఉండాలని, నర్సింగ్ హోంలకు వెళ్లవద్దని చెప్పారు. జిల్లాలో బయోమెట్రిక్ విధానం అమలవుతున్నందున ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. బాధ్యతారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
 
 ‘సమన్వయం’ ఎక్కడ..?
 జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి (డీసీహెచ్‌ఎస్), జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారుల మధ్య సమన్వయం కొరవడిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. డీసీహెచ్‌ఎస్ ఇచ్చిన నివేదికలకు, వైద్యాధికారులు చెప్పే వివరాలకు పొంతన లేదన్నారు. ఆస్పత్రి ప్రసవాలు, మాతా శిశు మరణాలు, ఎస్‌ఎన్‌సీయూ, ఇమ్యూనైజేషన్, జవహర్ బాల ఆరోగ్య రక్ష, టీబీ, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, అంధత్వ నివారణ, స్కూల్ హెల్త్ తదితర కార్యక్రమాలు అమలవుతున్న తీరుపై ఆరా తీశారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎంఈ డాక్టర్ జి.శాంతారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.పవన్ కుమార్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 కార్పొరేట్ ఆస్పత్రులు ఆదర్శం కావడం బాధాకరం..
 తాను రంగరాయ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించానని, అప్పట్లో ఆ కళాశాలకు ధీటుగా ఉండాలని కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు ఆకాంక్షించేవారని,  ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయని మంత్రి కామినేని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా జీజీహెచ్‌ను తీర్చిదిద్దాలనుకోవడం బాధాకరమన్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేయనున్న మెటర్నిటీ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాకుకు మంత్రి శంకుస్థాపన చేశారు. కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్ సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఐసీయూని ప్రారంభించారు.
 
 ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులిచ్చి పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సహకరించాలన్నారు. సీఎస్‌ఆర్ నిధులను పుష్కలంగా అందిస్తే మెరుగైన సౌకర్యాలు జీజీహెచ్‌లోనే సమకూరుతాయన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకట బుద్ధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎంపీ తోట నరసింహం, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, మెన్స్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ కె.లకో్ష్మజీనాయుడు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, సీ పోర్ట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కామినేనిని పలువురు సత్కరించారు. ఆయన జీజీహెచ్, ఆర్‌ఎంసీలను పరిశీలించారు.
 
 జిల్లా ఇన్‌చార్జిగా సౌరభ్
 జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాల సక్రమ అమలుకు ఐఏఎస్ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించామని మంత్రి కామినేని వెల్లడించారు. జిల్లాకు సౌరభ్‌ను ఇన్‌చార్జిగా నియమించామన్నారు. ఆయన నెల నెలా జిల్లాకు వచ్చి అధికారులతో సమీక్షించి తనకు నివేదికలు అందజేస్తారన్నారు. మాతా శిశుమరణాలు పెరిగిపోతున్న దృష్ట్యా ప్రజలకు మంచి చికిత్స, ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఇన్‌చార్జిలను నియమించామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement