ఖమ్మంవైద్యవిభాగం: పెద్దాసుపత్రిలో తరచు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరికలు చేస్తున్నా వివాదాలు మాత్రం ఆగడంలేదు. ఇటీవల కాలంలో ప్రసవ దృశ్యాలు చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టడం, సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ పెట్టిన ఘటనలు వివాదాస్పదమైన విషయం విదితమే. తాజాగా ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయకుండా తిప్పి పంపటంతో మరో వివాదానికి తెరలేపారు ఇక్కడి వైద్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఇనపనూరి అశ్విని(20)కి పురుటి నొప్పులు రావడంతో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స ప్రారంభించిన డాక్టర్లు 5 గంటల సమయంలో ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపటి తర్వాత గర్భిణికి రక్తస్రావమైంది. ఎంత ప్రయత్నించినా రక్తస్రావం ఆగకపోవటంతో డాక్టర్లు ఆమెను వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు.
ఆందోళనకు గురైన అశ్విని తండ్రి పగడాల లక్ష్మయ్య(మున్సిపల్ వర్కర్) సీఐటీయూ నాయకులను సంప్రదించాడు. సీఐటీయు నాయకులు విష్ణు తదితరులు వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను డెలివరీ చేయాలని విజ్జప్తి చేశారు. చికిత్స అందించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చేసేది లేక కుటుంబ సభ్యులు గర్భిణిని 108 వాహనం ద్వారా వైరారోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించగా మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఆస్పత్రిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ చేయిస్తే రూ.30 వేలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు , ఆర్‌ఎంఓ కృపాఉషశ్రీ సముదాయించి ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూస్తామని చెప్పడంతో సీఐటీయు నాయకులు శాంతించారు.
ఎంసీహెచ్ భవనం ఎదుట డాక్టర్ల ధర్నా
సీఐటీయూ నాయకుడు విష్ణు డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులు ఓపీ సేవలు నిలిపివేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గైనిక్ సేవలందించే డాక్టర్లు ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని, పెరుగుతున్న ఓపీ సేవలకు అనుగుణంగా గైనిక్ వైద్యులు నియమించాలని కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డాక్టర్ల ఆందోళనతో ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు వైద్య సేవలు లేక వెనుతిరిగారు. కాగా ఇరు వర్గాలు పరస్సరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి.
డాక్టర్లను ఇబ్బంది పెడితే వైద్య సేవలు ఎలా అందిస్తారు..?
డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తే వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ఆస్పత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. ఓపీ సేవలు నిలిపివేసి సూపరింటెండెంట్ చాంబర్‌లో సమావేశమైన డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించటం సరికాదన్నారు. డాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తానని, కలెక్టర్‌కు కూడా లేఖ అందజేస్తామని తెలిపారు. - వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్.
Comments
Please login to add a commentAdd a comment