అసలిది ఆస్పత్రేనా? | deputy cm rajaiah fires on district hospital superintendent | Sakshi
Sakshi News home page

అసలిది ఆస్పత్రేనా?

Published Tue, Oct 14 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

అసలిది ఆస్పత్రేనా?

అసలిది ఆస్పత్రేనా?

పారిశుద్ధ్యంపై ఇంత నిర్లక్ష్యమా..
* జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్ర హం
* తీరు మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరిక
* జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేస్తానని వెల్లడి

సంగారెడ్డి అర్బన్: ‘అసలిది ఆస్పత్రేనా.. పారిశుద్ధ్య నిర్వహణ ఇలా ఉంటే రోగాలు నయమవడం కాదు...కొత్త వ్యాధులొస్తాయి...ప్రైవేటు ఆస్పత్రులు ఇలాగే ఉంటాయా...అసలు మీరు పనిచేస్తున్నారా.. మీరే సరిగా పనిచేస్తే పరిస్థితి ఇంత  అధ్వానంగా ఉంటుందా...ప్రధానమంత్రే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారు.. మీరు అంత కంటే ఎక్కువా..సిబ్బంది పనిచెప్పేముందు మనమూ చేసి చూపాలి’ అంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మండిపడ్డారు.

సోమవారం ఆయన సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులన్నీ తిరిగి పరిశీలించారు. గైనిక్ ఓపి, నవజాత శిశు సంరక్షణ వార్డు తదితర విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రంలోని పిల్లల వార్డులో పారిశుద్ధ్యం కొరవడటం, గోడలు బూజు పట్టి ఉండటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎప్పుడైనా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో పర్యవేక్షించారా అని ప్రశ్నించారు. అలసత్వం వీడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతకుముందు  ఆస్పత్రి సిబ్బంది ఆయనకు స్వాగతం పలకగా ఏజేసీ మూర్తి పుష్పగుచ్ఛం అందజేశారు.

మెడికల్ కళాశాల మంజూరుకు చర్యలు
సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని డిప్యూటీ సీఎం రాజయ్య వెల్లడించారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సంగారెడ్డిలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఇది వరకే కోరారన్నారు. వైద్యకళాశాల ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని 250 నుంచి 500 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు అందాయని, త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.

మెరుగైన వైద్యం అందించాలి
సర్కార్ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. సిబ్బందిలో చిత్తశుద్ధి లోపిస్తే, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదన్నారు. ఆస్పత్రిలో పనిచేసే నాల్గవ తరగతి ఉద్యోగుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందన్నారు. వారు పనితీరు మెరుగుపర్చుకోకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. పారిశుద్ధ్య పనులు కాంట్రాక్టర్ చేస్తున్నట్లయితేఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులలో పనిచేసే వైద్యులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వర్తించాలన్నారు.

డ్యూటీ డాక్టర్ 24 గంటలూ వైద్యసేవలందించాలన్నారు. కాల్ డ్యూటీ డాక్టర్ పనిచేసే చోట అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వైద్యులైనా సరే ఇంటికి సాగనంపుతామన్నారు. జిల్లాలో వైద్యుల కొరత కారణంగా 80 శాతం రోగులు  హైదరాబాద్‌లోనే ఆపరేషన్‌లు చేయించుకుంటున్నారని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ఖాళీగా ఉన్న 22 వైద్యాధికారుల పోస్టులను త్వరలో భ ర్తీ చేయనున్నట్లు తెలిపారు.  

ఆరోగ్యశ్రీ కింద రివాల్వింగ్ ఫండ్ రూ.28 లక్షలు ఉన్నాయని ప్రతిపాదనలు పంపిస్తే ఆ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. హెచ్‌డీఎస్‌లో ఉన్న రూ.5 లక్షలు కనీస అవసరాలు తీర్చేందుకు కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులలో పేద  ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు.   

డిప్యూటీ సీఎం వెంట  జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ , టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్‌ఎస్ ట్రేడ్ యూనియన్ నాయకులు పిట్టెల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్ గౌడ్, అదనపు జే సీ మూర్తి, డీఎంహెచ్‌ఓ డా.బాలాజీ పవార్, ఆర్‌ఎంఓ డా.మురహరి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధుకర్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.కిరణ్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement