సాక్షి, అమరావతి: ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సంస్కరణలు ఫలిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ ఇప్పటికే మెరుగుపడింది. ఇంటింటికీ మూడు రంగుల చెత్త డబ్బాల పంపిణీతో ప్రజల్లో సైతం మార్పు కనిపిస్తోంది. ఇంటి వద్దకే చెత్త తరలింపు వాహనాలు వస్తుండటంతో ప్రజలు కూడా సహకరిస్తున్నారు.
ముఖ్యంగా ఎక్కువ జనాభా గల మునిసిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్–1 మునిసిపాలిటీల్లో చెత్త తరలింపునకు ఆధునిక హైడ్రాలిక్ టిప్పర్లను ప్రభుత్వం అందించింది. మొత్తం 42 యూఎల్బీలకు 2,525 హైడ్రాలిక్ టిప్పర్లు అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. వాటిలో 2,465 హైడ్రాలిక్ టిప్పర్లను ఆయా యూఎల్బీలకు అందజేశారు. మరో 60 టిప్పర్లను సంక్రాంతి తర్వాత అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గ్రేడ్–2, 3 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం 1,123 ఈ–ఆటోలను అందించనున్నారు. వీటిలో 387 వాహనాలను వచ్చే నెలలో అందించనున్నారు. హైడ్రాలిక్ టిప్పర్ల ద్వారా చెత్తను సేకరించి, ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం తగ్గినట్టు అధికారులు గుర్తించారు. గతంలో వీధుల్లో ఏర్పాటు చేసిన చెత్త డబ్బాలను తొలగించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తిరిగి చెత్త వేయకుండా చర్యలు చేపట్టారు.
137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక
ఏరోజుకారోజు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ప్రాధమిక దశలో స్థానికంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పోర్టు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇందుకోసం ఆయా పట్టణాల్లో ప్రతి 8 నుంచి 10 వార్డుకు ఒకటి చొప్పున చెత్త రవాణా కేంద్రాన్ని (జీటీఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇలా 83 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇందుకోసం రూ.185 కోట్లతో 137 జీటీఎస్‌ల నిర్మాణానికి ప్రణాళిక అమలు చేయగా.. ప్రస్తుతం 100 జీటీఎస్‌ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
ఈ జీటీఎస్‌ల నుంచి ప్రాసెస్ చేసిన చెత్తను పునర్ వినియోగానికి ఉపయోగపడే వాటిని వేరు చేసి, మిగిలిన చెత్తను విద్యుత్ తయారీ ప్లాంట్‌కు తరలించనున్నారు. అందుకోసం చెత్తను సమగ్ర పద్ధతిలో నిర్వహించేందుకు గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నుంచి వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు తరలించనున్నారు. అందుకోసం రాష్ట్రంలోని 71 యూఎల్బీల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు (ఐఎస్‌డబ్ల్యూఎం) ఏర్పాటు చేయనున్నారు.
వీటిలో ఐదు ప్లాంట్లు నిర్మాణంలో ఉండగా.. వినుకొండ, రాయచోటి యూఎల్బీల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లలో తడి చెత్తను శుద్ధి చేసే పనులు ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్లలో తడి, పొడి చెత్తను ఒకేసారి ఒకేచోట శుద్ధి చేసేందుకు అవకాశముంటుంది.
ఫలిస్తున్న ఆపరేషన్ ‘క్లీన్’
Published Wed, Dec 21 2022 6:15 AM | Last Updated on Wed, Dec 21 2022 11:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment