యువత సామాజిక బాధ్యతతో ఓ ముందడుగు వేస్తే వారి వెనుక నడవడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. ప్రకృతి, అక్షరల ప్రయోగాన్ని విజయవంతం చేసి ఆ విషయాన్ని నిరూపించింది ముంబయి నగరం. టెక్స్‌టైల్ రంగంలో వచ్చే వేస్ట్ మెటీరియల్‌తో ఫ్యాషన్ మార్కెట్‌లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు తమ జుహూ బీచ్ స్టూడియో బ్రాండ్‌ను సగర్వంగా ప్రకటించు కుంటున్నారు.
హ్యాట్ కేక్
ముంబయికి చెందిన ప్రకృతి రావు, అక్షర మెహతాలు అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. కోర్సు పూర్తయింది ఇక కెరీర్ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి. మార్కెట్‌లోకి కొత్త ఆలోచనలతో రావాలి. అది పర్యావరణానికి హితంగానూ ఉండాలి... అని ఆలోచించిన మీదట వారికి వచ్చిన ఆలోచన ఇది. చేనేత, వస్త్రాలకు రంగులద్దే కుటుంబ నేపథ్యం వారిది. వస్త్రాల మీద ఒకింత అవగాహన ఎక్కువనే చెప్పాలి. రా మెటీరియల్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలని ఆలోచించారు.
వస్త్రాల తయారీ పరిశ్రమల నుంచి తానులోకి రీల్ చుట్టగా మిగిలిన క్లాత్, ఎక్కడో ఓ చోట మిస్ ప్రింట్ కారణంగా పక్కన పడేసిన మీటర్ల కొద్దీ వస్త్రం... ఇలా సేకరించిన క్లాత్‌తో నాలుగేళ్ల కిందట 60 హ్యాట్‌లు తయారు చేశారు. అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆ తర్వాత వంద స్లింగ్ బ్యాగ్‌లు చేశారు. తమ మీద తమకు ధైర్యం వచ్చిన తర్వాత బేబీ ప్రోడక్ట్స్ మీద దృష్టి పెట్టారు. వారి ప్రయోగం పూర్తి స్థాయి వ్యాపార రూపం సంతరించుకుంది. ముంబయిలోని జుహూ బీచ్ స్టూడియో (జేబీఎస్) వారి వర్క్ ప్లేస్. ఇప్పుడు వాళ్లు పదిమంది మహిళలకు హ్యాండ్ క్రాఫ్ట్స్‌లో శిక్షణనిచ్చి ఉపాధి కల్పించారు. గిఫ్ట్ ఆర్టికల్స్ మార్కెట్‌లో జేబీఎస్ ఒక బ్రాండ్ ఇప్పుడు.
నిరుపయోగం కాకూడదు
ప్రకృతి రావు... టెక్స్‌టైల్ రంగం గురించి వివరిస్తూ... వస్త్రం తయారయ్యే క్రమంలో భూగర్భ జలాలు భారీ స్థాయిలో ఖర్చవుతాయి. తయారైన వస్త్రం అంతా ఉపయోగంలోకి రాకపోతే ఎలా? మిల్లులో తయారయ్యే వస్త్రంలో ముప్పావు వంతు మాత్రమే మార్కెట్‌కు వెళ్తోంది. మిగిలినది వృథా అవుతుంటుంది.
ఇక ఫ్యాషన్ స్టూడియోల దగ్గరకు చేరిన క్లాత్‌లో డిజైన్ కోసం కొంత వాడేసి మిగిలినదానిని పారేస్తుంటాయి. ఇలా చెత్తకుండీల్లోకి చేరిన క్లాత్ మట్టిలో కలిసేలోపు కాలువల్లోకి చేరి ప్రవాహాలకు అడ్డుపడి వరదలకు కారణమవుతాయి. ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరులను నూటికి నూరుశాతం ఉపయోగించుకోవాలి. అదే ప్రకృతికి, పర్యావరణానికి మనమిచ్చే గౌరవం అన్నారు ప్రకృతిరావు, అక్షర మెహతా.
Comments
Please login to add a commentAdd a comment