ఇండియన్ అవుట్ ఫిట్‌లో ప్రత్యేక స్థానం
ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సృష్టిస్తూ
పాతికేళ్లుగా పక్కకు పోనివ్వకుండా
చీర చుట్టూ తిరుగుతున్న ఫ్యాషన్ మార్కెట్
నగరం ఓ మినీ ఇండియా. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్‌తో పాటు మధ్య భారతం, పశి్చమ, వాయువ్య భారతం అంతా కనిపిస్తుంది. నోరు విప్పి మాట్లాడిన తరవాత భాషను బట్టి వారిది ఏ రాష్ట్రమో తెలుస్తుంది. కానీ మహిళల వస్త్రధారణ మౌనంగా మాట్లాడుతుంది. ఇండియన్ ఫ్యాషన్ అవుట్ ఫిట్‌లో చీరది ప్రత్యేకమైన స్థానం. చీరలకు అతి పెద్ద షోకేస్ హైదరాబాద్ నగరం. వెస్టర్న్ ప్యాటర్న్స్ ఎన్ని వచి్చనా వాటిని స్వాగతిస్తూనే ఉంది.
పాతికేళ్ల కిందట ఒక టేబుల్ వేసుకుని కాటన్ వస్త్రం మీద అందమైన డిజైన్లను అద్దడంతో చీర కొత్త పుంతలు తొక్కింది. అప్పటి వరకూ చేనేతకారులు తరతరాల సాదా మోడల్స్ దగ్గరే ఉన్నారు. సూరత్‌లోని టెక్స్‌టైల్ మిల్స్ ఒక డిజైన్ రూపొందిస్తే ఆ డిజైన్‌లో వేలాది చీరలు దేశమంతటా విస్తరించేవి. అలాంటి సమయంలో ఒక చీరకు అద్దిన డిజైన్ మరో చీరలో ఉండకూడదని, వేటికవే వినూత్నంగా ఉండాలని మహిళా డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ప్రతిదీ యూనిన్‌గా ఉండాలని కోరుకునే మహిళలకు ఈ ప్రయోగం ఓ వరంలా కనిపించింది. డిజైనర్లు రూపొందించిన డిజైన్లకే పరిమితం కాకుండా సొంత డిజైన్లు గీసి మరీ చేయించుకోవడం మొదలైంది. క్రమంగా అద్దకం ఓ ట్రెండ్ అయ్యింది. చీరను ట్రెండ్ నుంచి పక్కకు పోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉంది మెట్రో ఫ్యాషన్. పాతికేళ్లుగా హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్‌ని గమనిస్తున్న ప్రముఖ డిజైనర్ గాయత్రి రెడ్డి చెబుతున్న మాట ఇది.
నేతలో క్రియేటివిటీ..
చీర మీద అద్దిన డిజైన్ హైలైట్ కావడానికి డిజైన్ అవుట్ లైన్ ఎంబ్రాయిడరీ చేయడం మరో ప్రయోగం. అక్కడి నుంచి మగ్గం వర్క్ మొదలైంది. చీరతోపాటు బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీ, చీర కంటే బ్లౌజ్‌కు పెద్ద ఎంబ్రాయిడరీ, బ్లౌజ్‌కు హైలైట్ కావడానికి ప్లెయిన్ చీర కాంబినేషన్ వంటి ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో మహిళా డిజైనర్లు తమ క్రియేటివిటీని చేనేత వైపు మళ్లించారు. పోచంపల్లి, ఇకత్ నుంచి నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, పాటూరు వంటి నేతలన్నింటికీ ఫ్యాషన్ లుక్ తెచ్చారు. దాంతో ఫ్యాషన్ ప్రపంచాన్ని చేనేత శాసించేంతగా డిజైన్‌లు పాపులర్ అయ్యాయి. పట్టు చీరల బరువు తగ్గించడంలో విజయవంతమయ్యారు. దాదాపు క్రేప్ మాదిరి తేలిగ్గా ఉంటోందిప్పుడు.
వాతావరణం మారింది
నగరంలో ఏడాదిలో పది నెలలు చల్లని వాతావరణం ఉండేది. ఈ పాతికేళ్లలో బాగా మార్పులు వచ్చాయి. ఏడాదిలో పది నెలలు వేడిగా ఉంటోంది. వెదర్‌కు అనుకూలంగా ఉండేటట్లు డిజైనర్ శారీస్ కాటన్‌లో తీసుకురావడం కొత్త తరం మహిళలు చీరపై మోజు పడడానికి ఓ కారణం. చీర కట్టే రోజులు తగ్గినా.. కొనడం మాత్రం తగ్గలేదు. ప్రతి ఫంక్షన్‌కీ ఓ కొత్త చీర కొనే ట్రెండ్ వచ్చేసింది. సాఫ్ట్‌వేర్ ఉమర్స్ పారీ్టలకు చీరలో మెరిసిపోతున్నారు. రోజూ చుడీదార్ ధరించే వాళ్లు కూడా బర్త్‌డే పార్టీ, గెట్ టు గెదర్ వంటి వాటికి చీర కడుతున్నారు.
చీర చుట్టూ ఫ్యాషన్..
పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో నూటికి 70 నుంచి 80 శాతం మహిళలు రోజూ చీరలే ధరించేవారు. క్రమంగా 2015 నాటికి 40 శాతానికి పరిమితమైంది. వర్కింగ్ ఉమెన్స్, డాక్టర్లు, లెక్చరర్లు చీరలతోనే డ్యూటీ చేశారు. ఇప్పుడిది పాతిక శాతం మాత్రమే ఉంది. ఆధునిక వనితల వార్డ్‌రోబ్‌లో చుడీదార్, జీన్స్ డైలీ వేర్ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ చీర మాత్రం దూరం కాలేదు. తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా మారుతోంది చీర. అందుకే శారీఫ్యాషన్ ఎప్పటికీ తెరమరుగు కాదు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment