ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్లు మారరా..
-
ఆకస్మిక తనిఖీల సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం
-
రూ.1.67కోట్లతో వైద్య పరికరాలు
నెల్లూరు(అర్బన్): బయోమెట్రిక్ సక్రమంగా వినియోగించడం లేదు..సకాలంలో ఓపీకి డాక్టర్లు రావడం లేదు..ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా.. అంటూ కలెక్టర్ ముత్యాలరాజు డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక దర్గామిట్టలోని సర్వజన ఆస్పత్రి(పెద్దాస్పత్రి)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి వార్డును, రోగుల ఆహారాన్ని, బయోమెట్రిక్, సీసీ కెమెరాల పనితీరు, డాక్టర్ల హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోమెట్రిక్ సక్రమంగా పాటించని డాక్టర్‌ల జీతాల్లో కోత విధించాలని ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలను ఆదేశించారు. కుట్లు వేసే గదిని పరీశీలించగా అక్కడ డాక్టర్ లేకపోవడాన్ని గుర్తించి ఆరా తీశారు. సెక్యూరిటీ గార్డు వేస్తున్నారని తెలుసుకుని డాక్టర్లపై మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాస్పత్రిని ఈ–ఆస్పత్రిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. పింఛన్ల కోసం సదరమ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని, వారం లోపు సదరమ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయాన్ని పరిశీలించి రోగులకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. బ్లడ్‌బ్యాంకు వివరాలు, ఏ రోగికి ఎక్కించారో పూర్తి వివరాలు రికార్డుల్లో ఉండాలన్నారు. తేడాలొస్తే ఇంటికి పంపుతామని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన పరికరాలను ఎప్పటికప్పుడే బాగు చేయించి వైద్య సేవలందించాలని కోరారు.
పరికరాలకు రూ.1.67 కోట్లు
సీఎస్‌ఆర్ కింద ఆస్పత్రిలో వివిధ రకాల వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు రూ.1.67 కోట్లను కేటాయించామని తెలిపారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా.నిర్మల, డా.కళారాణి తదితరులు ఉన్నారు.