మారండి.. మార్చండి
జిల్లా ఆస్పత్రి సిబ్బంది పనితీరులో మార్పు రావాలని, హాస్పిట ల్‌లో సరైన సేవలు అందడం లేదంటూ ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని చెరిపేయాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా సూచించారు. వైద్యులు, స్టాఫ్‌లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. డాక్టర్లను దేవుళ్లుగా భావించి వైద్యం కోసం దవాఖానకు వచ్చే నిరుపేదలకు మెరుగైన చికిత్సలు చేయాలని జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి కోరారు.
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా అన్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం పట్టణంలోని డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రథమ పౌరురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సమాచారం అందించారా..? అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. దీనిపై తడబడ్డ ఆయన సమాధానం దాటవేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్సలు అందించడానికి అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది వివరాలను వివరాలను ఈ నెల 16 లోపు తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆస్పత్రిలో సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, ఈ అపవాదును తొలగించడానికి ప్రతిఒక్క రూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని, కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసినందున సబ్ కాంట్రాక్ట్‌ను తొలగించి టెండర్లు పిలవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతులు, సీసీ కెమెరాల మంజూరు, 250 పడకల ఆస్పత్రిని 500 పడకల స్థాయికి పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు అవసరమైన వివరాాలపై నివేదికలు తెప్పించుకుని ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఓలకు సూచించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు.
ఆస్పత్రిలో బయోమెట్రిక్ సిస్టమ్, హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ, రూఫ్ లీకేజీ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈఈ రఘును ఆదేశించారు. ఇన్సెంటివ్ కేర్ యూనిట్‌లో వెంటీలెటర్లను అమర్చుకోవాలని, ఎంతమంది సిబ్బంది అవసరమో తెలియజేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.5 లక్షలను ఎన్‌హెచ్‌ఎం నిధులను ఖర్చు చేసేందుకు కమిటీ ఆమోదించింది. జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రేమతో మాట్లాడి వారికి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
ఎమ్మెల్యే అసహనం...
డిప్యూటీ సీఎం పర్యటించి ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజునే సమయపాలన పాటించకపోవడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్‌లో మార్పు రాకుంటే శాఖ పరమైన చర్యలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ నరేంద్రబాబు, ఆర్‌ఎంఓ మురహరి, డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ బాలాజీ పవార్, ఎన్‌హెచ్‌ఎం డీపీఓ జగన్నాథరెడ్డి, టీఎస్ ఎస్‌ఎమ్‌ఐడీసీ రఘు, జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాసొద్దీన్, వివిధ విభాగాల డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వార్డుల సందర్శన...
జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని వివిధ విభాగాలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మంగళవారం ఉదయం సందర్శించారు. ఓపీ యూనిట్‌ను, ఇన్ బర్న్, ఔట్ బర్న్, వార్డులను గైనిక్, శిశుసంజీవని, ఎన్‌ఆర్‌సీ యూనిట్‌లు, ఐసీయూ యూనిట్లను పరిశీలించారు.