rahul bojja
-
నీటి వాటా..ఆపరేషనల్ ప్రొటోకాల్ తేల్చాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వాటా తేలేదాకా...50:50 నిష్పత్తితో నీటిని పంచాలని, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల ఆపరేషనల్ ప్రొటోకాల్ ఖరారు అయితేనే ప్రాజెక్టులు అప్పగిస్తామని తెలంగాణ స్పష్టం చేసినట్టు కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది. ఈనెల 1వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి సంబంధించిన మినట్స్‌ను బోర్డు శుక్రవారం విడుదల చేసింది. మినట్స్‌లో ఏముందంటే... ► రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తేనే జలవిద్యుత్ కేంద్రాలు అప్పగించగలమని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపినట్టు బోర్డు పేర్కొంది. ► జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన ఓ లేఖను ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్ అందజేశారు. ఆ లేఖను మినట్స్‌లో బోర్డు జతచేసింది. ► నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులతోపాటు వాటి పరిధిలోని 15 కాంపోనెంట్లు అప్పగించాలని కృష్ణా నదీ యాజమాన్యబోర్డు(కేఆర్ఎంబీ) కోరింది. వీటి నిర్వహణకు భారీగా నిధులు అవసరం. ఆ నిధులను నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలి. నాగార్జునసాగర్ డ్యామ్ పై మొహరించిన సీఆర్ పీఎఫ్ బలగాలు ఇరు రాష్ట్రాల అధికారులను ప్రాజెక్టుపై అనుమతిస్తాయి. ప్రాజెక్టుపై ఏ పనులు చేయాలన్నా... ఉద్యోగులను నియమించుకోవాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ► త్రీమెంబర్ కమిటీ(కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఉండే) తీసుకునే నిర్ణయాలు/ వాటర్ రిలీజ్ ఆర్డర్ కచి్చతంగా ఆయా కాంపోనెంట్లను అమలు చేయాలి. కమిటీ నిర్ణయాలు అమలు చేయాలి. ► ఒకవేళ ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాలు బోర్డుకు అప్పగిస్తే... ఆ ప్రాజెక్టులపై ఆయా రాష్ట్రాల నుంచి సమాన స్థాయిలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు. వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. ఏ మేరకు ఉద్యోగులు కావాలో, ఆ వివరాలన్నీ వారం రోజుల్లోపు బోర్డుకు అందించాలి. ప్రాజెక్టులన్నీ బోర్డు నియంత్రణలో ఉంటాయి. అయితే నిరంతర, అత్యవసర నిర్వహణ పనుల ను సంబంధిత రాష్ట్రాలు, ఇదివరకు ఉన్న పద్ధ తిని (శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ) పాటించాల్సి ఉంటుంది. సాగర్, శ్రీశైలం పరిధిలో ఉన్న కాంపోనెంట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఏపీ ఈఎన్సీ తెలిపారు. అయితే తెలంగాణ ప్రాజెక్టులతో పాటే మా ప్రాజెక్టులు తీసుకోవాలన్నారు. రాహుల్‌బొజ్జా లేఖలోని ముఖ్యాంశాలు జనవరి 17వ తేదీన ప్రాజెక్టుల అప్పగింతపై కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం తాలూకు మినట్స్‌కు సవరణలు చేయాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. అందులో ఏముందంటే....‘నీటి వాటాలు తేలేదాకా ప్రాజెక్టులను అప్పగించలేం. ట్రిబ్యునల్ కృష్ణా జలాలను పంచేదాకా 50:50 నిష్పత్తితో నీటిని పంచాలి. శ్రీశైలం జలాశయం కట్టిందే జలవిద్యుత్ ఉత్పాదన కోసం...నాగార్జునసాగర్ కింద ఉన్న నీటి అవసరాలు తీర్చడానికి వీలుగా దీనిని కట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 830 అడుగులుగా ఉండాలి. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్ తేలేదాకా వాటిని అప్పగించలేం. ఇక జలవిద్యుత్ కేంద్రాలతో పాటు ప్రాజెక్టుల అప్పగించాలంటే తెలంగాణ ప్రభుత్వమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రాజెక్టులు బోర్డుకు ఇవ్వలేం. ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పకపోయినా, మినట్స్‌లో రికార్డు అయ్యింది: రాహుల్ బొజ్జా ‘‘జనవరి 17వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కృష్ణా ప్రాజెక్టులను అప్పగిస్తామని చెప్పినట్టు మినట్స్‌లో రికార్డు అయ్యింది. అయితే తాము చెప్పిన అంశాలేవీ ఇందులో నమోదు కాలేదు. ఆ మినట్స్‌లో సవరణలు చేయాలని కోరుతూ జనవరి 27వ తేదీన కేంద్రానికి లేఖ రాశాం’అని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. శుక్రవారం ఆయన ఈఎన్సీ మురళీధర్‌తో కలిసి శుక్రవారం జలసౌధలో విలేకరులతో మాట్లాడారు. బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత నిర్ణయం గతంలోనే తీసుకున్నారని తెలిపారు. 2023–24 బడ్జెట్లో ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించనున్నామని, ఇందు కోసం సీడ్ మనీ కింద రూ.200 కోట్లు ఇవ్వనున్నామని ప్రతిపాదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు. ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర: ఈఎన్సీ సి.మురళీధర్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుది ప్రేక్షకపాత్ర మాత్రమేనని ఈఎన్సీ (జనరల్) మురళీధర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలంటే నీటిని ఏ ప్రాతిపదికన పంచుకోవాలి అనే అంశాలతో ముడిపడిన ఆపరేషనల్ ప్రొటోకాల్‌పై తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని గుర్తు చేశారు. త్రీమెంబర్ కమిటీ (కృష్ణాబోర్డు మెంబర్ సెక్రటరీ/ కన్వినర్, తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు) నిర్ణయం ఆధారంగానే నీటి విడుదల, పంపిణీ, పర్యవేక్షణ ఉంటుందన్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆయా రాష్ట్రాల భూభాగంలో ఉన్నాయన్నారు. సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి తీసుకోవాలని, గతనవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని కేంద్ర జలశక్తి శాఖను కూడా కోరామని, కేంద్రం ఆదేశించినా పోలీసు బలగాలను వెనక్కితీసుకోవడం లేదన్నారు. -
దళితబంధుకు దరఖాస్తు ఎలా?
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టించింది. ఈ పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించినప్పటికీ.. పథకం అమలుకు మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా, ఈ ఏడాది కూడా ప్రభుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గస్థాయిలో పథకం అమలు, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ.. తదితరాలకు సంబంధించి అనుమతులిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ పథకానికి ఎస్సీ కుటుంబాలను గుర్తించి వారి అర్హతను నిర్ధారించాలని ఉత్తర్వుల్లో తెలిపినప్పటికీ అధికారుల్లో మాత్రం స్పష్టత లేదని తెలుస్తోంది. ఎంపికపై స్పష్టత కరువు..! ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ.. ప్రత్యేకంగా దళితబంధు పోర్టల్‌ను రూపొందించింది. దీంతోపాటు మొబైల్ యాప్‌ను కూడా త యారు చేయించిన ప్రభుత్వం.. పథకం అమలులో పారదర్శ కత కోసం లబ్దిదారుల వివరాలు, యూనిట్ల ఏర్పాటు, పథ కం పురోగతి తదితరాలన్నీ పోర్టల్, యాప్‌ల ద్వారానే నిర్వ హించనుంది. ఈ అంశాలన్నీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వు ల్లో పేర్కొన్నప్పటికీ లబ్దిదారుల ఎంపికపైన మాత్రం ఉత్తర్వుల్లో వివరణ ఏమీ లేదని చెపుతున్నారు. నియోజకవర్గస్థాయిలో ప్రజాప్రతినిధి సహకారంతో ఎస్సీ కుటుంబాలను గు ర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఉండడంతో ఆయన సహకారంతో అర్హులను ఎంపిక చేసే వీలుంటుంది. కానీ క్షేత్రస్థా యి నుంచి దరఖాస్తులు స్వీకరించాలా? లేక ఎమ్మెల్యే సూ చించిన పేర్లతో కూడిన జాబితాను ఆమోదించాలా? అనే అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. వసూళ్లపర్వం బహిరంగమే.. దళితబంధు పథకంలో పెద్ద ఎత్తున వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో లబ్దిదారు నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తన వద్ద ఉందంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సైతం హెచ్చరించారు. ఇలాంటివి సహించబోనని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ఈ పథకం అమలులో పక్షపాత వైఖరి ఉందంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా.. అర్హుల ఎంపికలో ఎమ్మెల్యే జోక్యం ఉండకూదని తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో కొత్తగా మార్గదర్శకాలు వస్తాయని ఎస్సీ కార్పొరేషన్ భావించింది. ఇందులో భాగంగానే గతేడాది ఈ పథకాన్ని అమలు చేయలేదని తెలుస్తోంది. తాజాగా ఎస్సీ అభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ ఈ అంశంపై స్పష్టత లేకపోవడం.. పాత విధానాన్నే అమలు చేసేలా సూచనలు ఇవ్వడం పట్ల క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలకే లబ్దిదారుల ఎంపిక బాధ్యతలు ఇవ్వడంవల్ల అక్రమాలు మరింత ఎక్కువగా జరుగుతాయని పలువురు ఆక్షేపిస్తున్నారు. -
పంటనష్టంపై విస్తృత సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షా లు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై సర్వే చేపట్టాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు గురువారం విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్కసారికి సాయం అందించేందుకు గ్రామాలవారీగా, సాగుదారులవారీగా పంటనష్టంపై సవివరమైన సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖకు సూచించారు. నష్టాన్ని చవిచూసిన రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీల మధ్య ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురియడంతో అన్నిరకాల పంటలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికారుల బృందం పంటలకు నష్టం జరిగిన వివిధ ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేసిందన్నారు. పంట చేతికొచ్చేదశలో ఉందని, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వందశాతం నష్టం వాటిల్లిందని, దీంతో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, పంటనష్టాన్ని గ్రామాల్లో అంచనా వేయాలని, లబ్ది దారులను గుర్తించాలని వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణాధికారు(ఏఈవో)లను ప్రభుత్వం ఆదేశించింది. 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే వాస్తవంగా ఇది ఐదు లక్షల వరకు ఉంటుందని రైతు సంఘాలు, కిందిస్థాయి నుంచి సమాచారం వస్తోంది. కాగా, ప్రభుత్వం వేసిన నష్టం అంచనా ప్రకారం మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. తాజాగా చేయబోయే సర్వేలో ఇంకేమైనా అదనంగా నష్టం వెలుగుచూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. నష్టపరిహారంగా దీన్ని పేర్కొనకూడదని, సహాయ, పునరావాస చర్యలు అని పిలవాలని ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని ఆయన తెలిపిన సంగతి తెలిసిందే. సీఎం ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని వారం, పది రోజుల్లో రైతులకు అందజేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. -
దళిత బంధు: ‘ఆలస్యమవుతుంది, రాదు అనే అనుమానాలొద్దు’
సాక్షి, కరీంనగర్: జిల్లా కలెక్టరేట్లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మమాట్లాడుతూ.. దళిత బంధు అద్భుతమైన పథకమని కొనియాడారు. పథకం కింద 10 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందనన్నారు. స్వేచ్ఛగా ఏ ఉపాధి పొందుతారో ఆ రంగంలో డబ్బులు ఇస్తారని తెలిపారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని, అనుమానాలు ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు. ఇంకా ఎవరిని కూడా లబ్ధిదారులను ఎంపిక చేయలేదని అన్నారు. అందరికీ అమలు అవుతుందని, తమకు ఆలస్యమవుతుందని, మాకు రాదు అనే అనుమానాలు అవసరం లేదన్నారు. దళిత బంధు హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుంటున్నామమని రాహుల్ బొజ్జా అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దళితుల జాబితా తమ వద్ద ఉందని, వివరాలు లేని వారిని కూడా నమోదు చేస్తారని వెల్లడించారు. ప్రతీ గ్రామం నుంచి నలుగురు కో ఆర్డినేటర్లు ఉంటారని, గ్రామ సభ ద్వారా అందరి ముందు లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రతీ కుటుంబంతో మాట్లాడి ఏ స్కీం తీసుకుంటారో చర్చించి అవగాహన కల్పించి పథకాన్ని గ్రౌండ్ చేస్తారని తెలిపారు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ కూడా స్కీం తీరును అధికారులు మానిటర్ చేస్తారని పేర్కొన్నారు. దళిత రక్షక నిధి కూడా ఉంటుందని అన్నారు. సాక్షి, కరీంనగర్: ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
నత్తనడకన ‘స్కాలర్‌షిప్పు’!
సాక్షి, హైదరాబాద్ : పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కాస్త నత్తనడకన సాగుతోంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు 13 శాతానికి మించి రాలేదు. డిసెంబర్ 31వ తేదీతో దరఖాస్తు స్వీకరణ గడువు ముగియనుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్దేశించిన గడువులోగా పూర్తిస్థాయి విద్యార్థులు దరఖాస్తులు సమర్పించే అవకాశం కనిపించడం లేదు. యాజమాన్యాల పట్టింపేది..? ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఏటా సగటున 12.5 లక్షల దరఖాస్తులు వస్తున్నాయి. ఇందులో రెన్యువల్ విద్యార్థులు 7 లక్షలకుపైగా కాగా, ఫ్రెషర్స్ ఐదు లక్షలమంది ఉంటున్నారు. ఈ క్రమంలో 2020–21 విద్యాసంవత్సరంలో కూడా ఇదేస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 31 వరకు గడువును నిర్దేశించిన ప్రభుత్వం ఈలోగా విద్యార్థులతో దరఖాస్తులు సమర్పించేలా అవగాహన కల్పించాలని కాలేజీ యాజమాన్యాలకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు ఫ్రెషర్స్ విద్యార్థుల్లో కేవలం 1,07,679 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు. ఈ ఏడాది 7.99 లక్షల మంది ఫ్రెషర్స్ ఉన్నట్లు గణాంకాలు చెబుతుండగా అందులో కేవలం 13.4 శాతం మంది మాత్రమే స్పందించారు. మరో నెలన్నర గడువు మాత్రమే ఉండగా ఆలోపు విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో ఉపకార, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేయించడంలో కాలేజీ యాజమాన్యాలదే కీలకబాధ్యత. కోవిడ్–19 నేపథ్యంలో ప్రస్తుతం విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఈ క్రమంలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులతో ఫోన్లో సంప్రదింపులు సాగిస్తున్న యాజమాన్యాలు ఉపకార, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తులపై కూడా అవగాహన కల్పించాలని సంక్షేమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కానీ, యాజమాన్యాలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదని, తప్పనిసరిగా దర ఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధిస్తే విద్యార్థులు స్పందిస్తారని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మొదలు కాని ఫ్రెషర్స్ దరఖాస్తులు ప్రస్తుతం రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తున్నారు. ఇంకా పలు కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో ఫ్రెషర్స్ విద్యార్థుల దరఖాస్తుల స్వీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. ఒకట్రెండురోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు దరఖాస్తు నమోదుపై శ్రద్ధ తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
జిల్లాల్లో యూరియా ఫైట్
యూరియా కోసం.. ఎరువుల కోసం రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. సరిపడా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలో యూరియా కోసం మంగళవారం టోకెన్లు పంపిణీ చేయగా.. బుధవారం తెల్లవారుజాము నుంచే సొసైటీ గోదాం వద్ద రైతులు క్యూ కట్టారు. –భీమ్‌గల్ సాక్షి, హైదరాబాద్: పాత జిల్లాలకు, కొత్త జిల్లాలకు మధ్య యూరియా పోరు నడుస్తోంది. పాత జిల్లాల్లోని మార్క్‌ఫెడ్ స్టాక్ పాయింట్ల నుంచి కొత్త జిల్లాలకు సరఫరా కావాల్సిన యూరియాను అనేక చోట్ల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లయితే స్టాక్ వెళ్లనీయకుండా లిఖిత పూర్వక ఆదేశాలు ఇస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ ప్రాంతానికే దక్కాలని మొండిపట్టు పడుతున్నారు. దీంతో కొత్త జిల్లాలకు సరఫరా నిలిచిపోవడంతో యూరియా కొరత పీడిస్తోంది. దీంతో ఆయా జిల్లాల రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా యూరియా నల్లబజారుకు తరలిపోయింది. దీంతో ఒక్కసారిగా యూరియా ధర పెరిగింది. ఇటీవల వర్షాలు కురవడం, వరి నాట్లు బాగా పడటం, యూరియా వినియో గం పెరగడంతో పాత జిల్లాల రైతులు ఆవేదన చెందుతున్నారు. కొందరు మంత్రులు తమ నియోజకవర్గం ఉన్న జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. బఫర్‌స్టాక్ పాయింట్లు పాత జిల్లాల్లోనే ఈసారి ఖరీఫ్‌లో 19.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. అందులో యూరియానే 8.50 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. గత నెల రాష్ట్రానికి రావాల్సిన 2.21 లక్షల మెట్రిక్ టన్నుల్లో 1.04 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇక సెప్టెంబర్‌కు రెండు లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని వ్యవసాయశాఖ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 60 వేల మెట్రిక్ టన్నుల యూరియానే అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. మార్క్‌ఫెడ్ వద్ద ఎప్పుడూ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్‌గా ఉండాలి. కేం ద్రం నుంచి రాకపోవడం, ఉన్న నిల్వలను రైతుల కు అందజేయడంతో స్టాక్ 20 వేల మెట్రిక్ టన్నులకు పడిపోవడంతో కొరత ఏర్పడింది. మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్ పాయింట్లన్నీ పాత జిల్లాల్లో ఉన్నాయి. కొత్త జిల్లాల కోటాను పాత జిల్లాలే ఇలా వాడుకోవడంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా స్లాక్ పాయింట్ నుంచి కామారెడ్డి జిల్లాకు యూరియా పంపవద్దని అక్కడి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అక్కడి జిల్లా వ్యవసాయశాఖ అధికారి విఫలం కావడంతో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాహుల్ బొజ్జా తెలిపారు. నాయకుల తీరుపై మండిపాటు ఆయన వ్యవసాయశాఖ పరిధిలోని ఒక కార్పొరేషన్‌కు చైర్మన్. తన ప్రాంత పరిధిలోని వ్యవసాయ సహకార సొసైటీకి అవసరమున్నా లేకపోయినా అత్యధికంగా యూరియా కేటాయింపు లు చేసుకున్నాడు. తనకు సన్న యూరియానే కావాలని పట్టుబట్టి కేటాయించుకున్నాడు. పక్క జిల్లాకు తనకు సంబంధం లేదని వాదన పెట్టు కున్నాడు. అదే శాఖలో మరో కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్న నాయకుడి తీరు కూడా అలాగే ఉంది. తన జిల్లాకే ప్రాధాన్యం ఇవ్వాలని, పక్క జిల్లాకు 500 టన్నులు పంపాల్సి ఉన్నా దాన్ని అడ్డుకుంటున్నారని వ్యవసాయశాఖ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఆ కార్పొరేషన్ చైర్మన్ వ్యవసాయ కమిషనర్‌ను కలిసి ఈ మేరకు విన్నవించినట్లు తెలిసింది. జిల్లాల మధ్య పోరు, కొందరు నాయకుల తీరు వల్ల కృత్రిమ కొరత తలెత్తిందన్న విమర్శలున్నాయి. దీంతో యూరి యా ధర ఒక్కసారిగా పెరిగింది. -
ఈసీఐదే తుది నిర్ణయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలింగ్ వాయిదాపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ లోక్‌సభ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన రజత్‌కుమార్.. బరిలో ఉన్న రైతు అభ్యర్థులు, ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ను వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు కోరుతున్నారని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీఐ)కి నివేదిస్తామని చెప్పారు. దీనిపై తుది నిర్ణయం వారిదేనని స్పష్టం చేశారు. గుర్తుల కేటాయింపు సక్రమంగా జరగలేదనీ, మొదటిసారి బరిలో ఉన్నామనీ, ఈ గుర్తులపై సరిగ్గా అవగాహన లేదని, గుర్తులు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయనీ, పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయామని రైతు అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ముందుగా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరుపుతామని ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ ఈవీఎంలతో నిర్వహిస్తున్నారనే అంశాలన్నీ కూడా చర్చకొచ్చాయని పేర్కొన్నారు. ప్రచారం నిర్వహించేందుకు సమయం లేనందున వారం, పది రోజులు పోలింగ్‌ను వాయిదా వేయాలని కోరారని చెప్పారు. అలాగే ఈవీఎంలను ముందుగా ఎల్ ఆకారంలో పెడతామని, మళ్లీ ఇప్పుడు డిజైన్‌ను మార్చారనే అంశంపై రైతు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. ఈ విషయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పోలింగ్ వాయిదా వేయడంపై ఈసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 11న పోలింగ్ నిర్వహించాలని ప్రకటించిన మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని రజత్‌కుమార్ తెలిపారు. ప్రపంచంలోనే తొలి ఎన్నిక ఇది 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈవీఎంలతో నిర్వహించడం దేశంలోనే కాకుండా, ప్రపంచంలో కూడా ఇది తొలి ఎన్నిక అవుతుందని రజత్‌కుమార్ పేర్కొన్నారు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకున్నామని చెప్పారు. 27 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వివరించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. ఈనెల 7లోపు అన్ని ఈవీఎంలను పంపిణీ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. మాక్ పోలింగ్ నిర్వహించాం మాక్ పోలింగ్ ప్రక్రియను నిర్వహించామని, వంద మంది అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా ఓటు వేసి చూశారని, ఓటింగ్ సమయాన్ని కూడా పరిశీలించారని, మాక్ పోలింగ్‌పై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు, ఎన్నికల సంఘం అదనపు ఈసీఓ బుద్ధ్దప్రకాశ్, సంయుక్త సీఈఓ రవి కిరణ్, అదనపు డీజీపీ జితేందర్, ఎన్నికల పరిశీలకులు గౌరవ్ దాలియా, ఎన్నికల ప్రత్యేక అధికారి రాహుల్‌బొజ్జా తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ చెల్లింపుదారుల వివరాల సేకరణ
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను కట్టే వారందరి వివరాలు ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ బిస్వనాథ్ ఝాను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం–కిసాన్) పథకానికి విధించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులను గుర్తించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే ఐదెకరాలకు కుటుంబం యూనిట్‌గా తీసుకుంటుండటంతో పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ కార్డుల జాబితా ఆధారంగా లబ్ధిదారులను వడపోస్తుండగా, ఆదాయపు పన్ను కట్టే వారి వివరాలను కూడా సేకరించే పనిలో వ్యవసాయశాఖ నిమగ్నమైంది. రూ.10 వేల పింఛన్ తీసుకునే వారి వివరాలను కూడా తీసుకుంది. రాష్ట్రంలో 5 ఎకరాలలోపు 47.28 లక్షల మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. అయితే కేంద్రం విధించిన నిబంధనల కారణంగా ఇందులో సగం మంది మాత్రమే లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఐటీ చెల్లించే వారిని, రూ.10 వేలు పింఛన్ తీసుకునే వారిని అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. కుటుంబం యూనిట్‌గా తీసుకుంటున్న కారణంగా ఐదెకరాలలోపు ఉన్నవారిలో 30 శాతం అనర్హులు అవుతారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వడపోతల అనంతరం వచ్చిన వివరాలను ఈనెల 25 నాటికి పీఎం–కిసాన్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఒకవేళ అర్హులై ఉండి జాబితాలో పేరు లేకుంటే అధికారులకు విన్నవించుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మొదటి విడత సొమ్మును పొందడానికి ఏడాదిపాటు అవకాశం కల్పించారు. ఒకవేళ ఈనెల 25 నాటికి అర్హులైన రైతులందరి జాబితాను అప్లోడ్ చేయకపోయినా, వివరాలు పంపించిన ఏడాదిలోపు ఎప్పుడైనా సొమ్ము రైతుల ఖాతాలో వేస్తారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు సంబంధించి కసరత్తుపై కేంద్ర వ్యవసాయశాఖ మంగళవారం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. లబ్ధిదారుల జాబితాను రూపొందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఇదిలావుండగా పీఎం కిసాన్ పథకం అమలుకు అన్ని రాష్ట్రాలలో నోడల్ శాఖను, అధికారిని నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాను రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించింది. ‘రైతుబంధు’పై విషప్రచారం: పార్థసారథి తెలంగాణలో రైతుబంధు తాత్కాలికం అంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేసినట్లుగా కొన్ని సంస్థలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ మొద టి ప్రాధాన్యం రైతులను ఆదుకోవడమేనన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు రైతు లకు అండగా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. రైతుబంధు దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, ఇలాంటి పథకం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు తెలంగాణని రోల్ మోడల్‌గా చూస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి వార్తలు ప్రచారం చేసి ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించవద్దని ఆయన కోరారు. రైతుబంధుతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా సంస్థలు, వార్తాపత్రికలు, సోషల్ మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. -
ఆన్లైన్లో కొనేద్దామా!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగం కావాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. తద్వారా రైతులకు కావాల్సిన వ్యవసాయ ఉపకరణాలు మొదలు తమకు అవసరమైన స్టేషనరీని తక్కువ ధరకు ఆన్లైన్లో కొనుగోలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో అవకతవకలు లేకుండా కొనుగోళ్లు చేయవచ్చని భావిస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యం లో కేంద్రం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం)ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తమ శాఖ తరఫున జీఈఎం పోర్టల్ నుంచి కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధమవుతున్నామని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ సంబంధ యంత్రాలూ అందులో లభ్యమవుతున్నాయని, వివరాలు పూర్తిగా తెలుసుకున్నాక కొనుగోలు చేస్తామని వివరించారు. పత్తి యంత్రాలు మొదలు ల్యాప్‌టాప్‌ల వరకూ... ప్రైవేటులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆలీబాబా తదితర ఆన్లైన్ పోర్టళ్లు ఎలాగో కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే జీఈఎం అలాంటిదే. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా వస్తువులపై కేంద్ర ప్రభుత్వ పన్నులు ఉండవు. కాబట్టి తక్కువ ధరకే లభిస్తాయి. ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్టేషనరీ మొదలు ల్యాప్‌టాప్‌లు, కార్లు, వ్యవసాయ ఉపకరణాలన్నీ లభ్యమవుతాయి. హైఎండ్ ఇన్నోవాకారు బయటి మార్కెట్లో రూ. 20 లక్షలుంటే, జీఈఎంలో రూ.16 లక్షలకే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. పత్తిని తీసేందుకు బ్యాటరీతో పనిచేసే మిషన్లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు, హార్డ్‌వేర్ పరికరాలు, సీసీ కెమెరాలు, ప్యాసింజర్ మోటార్ వాహనాలు, కార్యాలయ ఫర్నిచర్ వంటి 8 వేలకు పైగా ఉత్పత్తులు అందిస్తున్నారు. ఇప్పుడు అందజేస్తున్న వ్యవసాయ యంత్రాలను ఆన్లైన్లో కొనుగోలుచేసే అవకాశం ఉంది. ప్రభుత్వం వాటికి సబ్సిడీ ఇచ్చి రైతులకు అందజేయమని చెబితే పోర్టల్‌లోనే ఆర్డర్ చేయడానికి వీలుంది. ఇప్పటికే ట్రాక్టర్లు సబ్సిడీపై ఇస్తున్నామని, వాటినీ ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జీఈఎంలో కొనుగోలుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసి జీఈఎంలో కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తున్నారు. వ్యవసాయ శాఖలోని వ్యవసాయ ఉపసంచాలకులకు ఈ–మెయిల్ సౌకర్యం కల్పించి అవసరమైనవి కొనుగోలు చేసేందుకు అనుమతించాలని భావిస్తున్నారు. -
ఐఏఎస్సా.. ఐపీఎస్సా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి త్వరలోనే కొత్త ఎండీ రానున్నారు. ఓ యువ ఐఏఎస్ అధికారిని పూర్తిస్థాయి ఎండీగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఆర్టీసీ ఎండీ రమణారావు పదవీకాలం మేలో పూర్తయింది. తరువాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. కానీ, ఆ బాధ్యతలను ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మకు అప్పగించారు. రోడ్లు–భవనాలు, రవాణాశాఖకు ఆయన కమిషనర్‌గా వ్యహరిస్తూనే.. ఆర్టీసీ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఆర్టీసీ బాధ్యతలనుంచి తనను తప్పించాల్సిందిగా శర్మ ప్రభుత్వాన్ని కొంతకాలంగా విన్నవిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో యువ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా పేరును, మరో డీజీపీ ర్యాంకు స్థాయి ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ పేర్లు తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్ బొజ్జా పరిపాలన దక్షత కలిగిన అధికారిగా మంచిపేరు సంపాదించారు. ప్రస్తుతం రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కృష్ణ ప్రసాద్‌కు రోడ్డు రవాణారంగంపై మంచి పట్టు ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎవరినీ ఖరారు చేయలేదు. వీరిద్దరిలో ఒకరి పేరు ఖరారు చేస్తూ త్వరలోనే ఆదేశాలు రావొచ్చని ఆర్టీసీలో చర్చ నడుస్తోంది. -
కలెక్టరేట్లో ఇ–ఆఫీస్ ప్రారంభం
సాక్షి,సిటీబ్యూరో: పేపరు లెస్ కార్యాలయం లక్ష్యంగా శనివారం కలెక్టరేట్లో ఇ–ఆఫీస్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టరేట్లోని తొమ్మిది విభాగాల ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని స్కాన్ చే సి, వాటిని భద్రపరిచే చర్యలకు శ్రీకారం చుట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ త్వరలో అన్ని జిల్లా కార్యాలయాల్లో ఇ–ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ భారతి హోళికేరి, ఏజేసీ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. -
అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆర్థిక సహాయం చేశారు. శనివారం సచివాలయంలో ఐదు కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చారు. 1969 తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన కె.వెంకటేశ్వరరావు, ఎన్.నాగభూషణం, ఎస్.నర్సింగరావు, పి.విజయ్ కుటుంబ సభ్యులకు, 2001 మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన చెట్టి కనకయ్యలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలో అమరవీరుల కుటుంబాల నుంచి 23 దరఖాస్తులు అందాయని, వాటిలో 8 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. ఎంత డబ్బు ఇచ్చినా వారిని తిరిగి తీసుకురాలేమని, కానీ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తమ ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తుందన్నారు. ఇళ్లు లేనివారికి ఇళ్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వడం వంటి నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించిందన్నారు. జిల్లా మంత్రులు వారి జిల్లాల్లో అమరవీరులను గుర్తించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారన్నారు. జీఓను సవరించి 1969లో చనిపోయిన వారికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఇంకా ఎవరైనా అమరవీరుల కోటా కింద దరఖాస్తు చేసుకోదలిస్తే సంబంధిత కలెక్టర్ కార్యాలయంలో చేయవచ్చని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై పెట్టిన వెయ్యి కేసులు ఎత్తివేశామన్నారు. ఇంకేమైనా కేసులు పెండింగ్‌లో ఉంటే వాటిని కూడా ఎత్తివేసే ప్రయత్నం చేస్తామన్నారు. రైల్వే కేసులకు సంబంధించిన కేసుల పరిష్కారం కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, డీఆర్ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓ నిఖిల, తహశీల్దార్లు శ్రీనివాస్‌రెడ్డి, సుజాత, అనురాధ పాల్గొన్నారు. -
భూములు పరిరక్షిస్తా...
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తానని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. నగరంలో భూ సమస్య ప్రధానమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నూతన కలెక్టర్‌గా సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతోమాట్లాడుతూ ఇతర జిల్లాలకు, హైదరాబాద్‌కు పాలన పరంగా చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. అర్బన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు సేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. గతంలో వరంగల్, మెదక్‌లలో కలెక్టర్‌గా పని చేసిన అనుభవంతో హైదరాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ భూ వివాదాలు ఎక్కువగా ఉన్నట్టు గ్రహించానన్నారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీవో 59కు అనుగుణంగా ఇళ్ల క్రమబద్ధీకరణ వేగవంతానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కలెక్టర్‌ను కలిసిన అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్, ఏజేసీ కె.రాజేందర్, డీఆర్ఓ అశోక్ కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురాం శర్మ, జిల్లా అధికారులు మోతీలాల్, సోమిరెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్షుడు కృష్ణయాదవ్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విష్ణుసాగర్ , వీఆర్ఓల సంఘ నాయకుడు సతీష్, నాలుగో తరగతి సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షుడు సదానంద్, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి కలెక్టర్‌కు స్వాగతం పలికారు. -
14న కొత్త కలెక్టర్ రాక
సాక్షి, సంగారెడ్డి : కొత్త కలెక్టర్ రోనాల్డ్ రాస్ ఈనెల 14న బాధ్యతలు చేపట్టనున్నారు. రాహుల్ బొజ్జా హైదరాబాద్‌కు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోనాల్డ్‌రాస్‌ను ప్రభుత్వం మెదక్ జిల్లా కలెక్టర్‌గా నియమించింది. రోనాల్డ్ ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈనెల 14న ఆయన తిరిగి రానున్నారు. అదేరోజు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. రోనాల్డ్ రాస్ ప్రస్థానం.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రోనాల్డ్ రాస్ మద్రాసు యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. 1980 జూన్ 24న జన్మించిన ఆయన మద్రాసు యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తూ 2006లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2006 నుంచి 2007 వరకు ట్రైనింగ్ పూర్తి చేసిన రోస్కు 2007 జులై 22న అసిస్టెంట్ కలెక్టర్‌గా ల్యాండ్ రెవెన్యూ హైదరాబాద్ కార్యాలయంలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. అసిస్టెంట్ కలెక్టర్, సబ్‌కలెక్టర్ హోదాలలో అదే కార్యాలయంలో పనిచేసిన ఆయన 2008 సెప్టెంబర్‌లో నర్సాపూర్ సబ్‌కలెక్టర్‌గా నియమితులు కాగా అక్కడ 2010 వరకు పని చేశారు. 2010 ఫిబ్రవరి 19న రంపచోడవరం ఐటీడీఏ పీవోగా నియమితులైన రొనాల్డ్ 2011 ఆగస్టు 19 వరకు అక్కడే విధులు నిర్వహించారు. 2011 ఆగస్టు 20న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో అడిషనల్ సీఈవోగా పనిచేశారు. 2012 సెప్టెంబర్11న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. సుమారు రెండు సంవత్సరాల పాటు జీహెచ్ఎంసీలో వివిధ జోన్లలో పనిచేసిన ఆయన సిటీ ప్లానింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు. విధుల్లో ముక్కుసూటిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరున్న రోనాల్డ్‌రాస్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారిగా సమర్థంగా ఎన్నికలు నిర్వహించారన్న పేరుంది. సిటీ ప్లానింగ్ విభాగం నుంచి నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ కాాగా అక్కడ నుంచి ప్రస్తుతం మెదక్ జిల్లాకు బదిలీ అయ్యారు. -
కలెక్టర్‌కు కారు బహుమతి!
హాస్టల్ విద్యార్థుల కానుక రాత్రి నిద్రలో నవ్వుల జల్లులు సాక్షి, సంగారెడ్డి: కలెక్టర్ రాహుల్ బొజ్జా కారు బహుమతిగా అందుకున్నారు. హాస్టల్ నిద్రలో పాల్గొన్న ఆయనకు బహుమతి లభించింది. బహుమతిగా వచ్చిన కారు రంగు చూసిన ఆయన మెచ్చుకోవటంతోపాటు కారు భలే ఉందంటూ ప్రశంసించారు. దీంతో బహుమతి అందజేసిన వారు ఆనందంతో పొంగిపోయారు. అయితే జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా అందుకుంది నిజమైన కారు కాదు. హాస్టల్ నిద్ర కోసం తమ వద్దకు వచ్చే జిల్లా కలెక్టర్‌కు మరచిపోలేని బహుమతి ఇవ్వాలని సంగారెడ్డిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 5, 6వ తరగతి విద్యార్థులు వర్థన్, వంశీ అనుకున్నారు. అనుకున్నదే తడువుగా అప్పటికప్పుడు హాస్టల్లో తమకు అందుబాటులో అట్టలు, రంగు కాగితాలు ఇతర వస్తువులతో అందమైన కారును తయారు చేశారు. సోమవారం రాత్రి 11కు హాస్టల్‌కు వచ్చిన కలెక్టర్ రాహుల్ బొజ్జా తమతో కలిసి మాట్లాడిన తర్వాత నిద్రకు ఉపక్రమించే ముందు విద్యార్థులు వర్థన్, వంశీలు తాము తయారు చేసిన బహుమతిని కలెక్టర్‌కు అందజేశారు. మరో విద్యార్థి సురేష్ చిన్న కుక్కపిల్ల బొమ్మ ఉన్న ఎర్రరంగు కారు కీస్ హోల్టర్ను కలెక్టర్‌కు బహుమతిగా అందజేశాడు. విద్యార్థులు బహుమతిగా ఇచ్చిన కారు బొమ్మ, కుక్కబొమ్మను చూసిన కలెక్టర్ ముచ్చపడిపోయారు, విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుని ప్రశంసించారు. ఇంత విలువైన బహుమతులను తన వద్దే ఉంచుకుంటానని పిల్లలకు తెలపటంతో చిన్నారులు సంతోషించారు. చిన్నారులతో కలెక్టర్ ముఖాముఖీ సంగారెడ్డిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో సోమవారం విద్యార్థులతో కలిసి నిద్రించిన కలెక్టర్ రాహుల్ బొజ్జా పిల్లతో కలిసి రెండు గంటలపాటు కులాసాగా గడిపారు. కలెక్టర్ ఉపాధ్యాయుని అవతారం ఎత్తి విద్యార్థులను ప్రశ్నల్తో ముంచెత్తడంతోపాటు ఎలా చదువుకుంటే బాగా అర్థం అవుతుందో వివరించారు. హాస్టల్లోని విద్యార్థులతో కలిసి నేలపై కూర్చున్నారు. పిల్లలు ఏయే తరగతులు చదవుతున్నదీ ఆరా తీశారు. విద్యార్థులను పుస్తకాలు తెరిచి తెలుగు, ఇంగ్లీషు, సైన్స్ పాఠాలు చదవాల్సిందిగా సూచించారు. పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు చదవారు మరికొంత మంది హిందీ పద్యాలను చదివి వినిపించారు. జహీరాబాద్ ప్రాంతానికి చెం దిన వారు ఇంత దూరం వచ్చి హాస్టల్లో చేరటంపై విద్యార్థులను ప్రశ్నించగా ‘సార్ జహీరాబాద్‌లో హాస్టల్లో ఉంచితే ఆవారా గా తయారు అవుతారు, అందుకే మమ్మల్ని తల్లిదండ్రులు ఇక్కడ చేర్చారు’ అంటూ ఓ విద్యార్థి సమాధానం ఇవ్వటంతో కలెక్టర్ సహా అందరూ పెద్దగా నవ్వారు. హాస్టల్లోని విద్యార్థులంతా బాగా చదవుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు తమకు వాలీ బాల్, క్రికెట్ కిట్ కావాలని కోరగా వెంటనే పంపిస్తానని కలెక్టర్ రాహుల్ బొజ్జా హామీ ఇచ్చారు. రాత్రి 11.45కు కలెక్టర్ విద్యార్థులకు గుడ్‌నైట్ చెప్పి నిద్రకు ఉపక్రమించారు. -
అర్హులకు ఆరు కిలోల బియ్యం
సంగారెడ్డి అర్బన్: వచ్చే నెల 1,2 తేదీల్లో జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్డీఓలు, తహాశీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రత కార్డులకు 7లక్షల 91వేల దరఖాస్తులు అందాయని , అన్ని దరఖాస్తులను పరిశీలించడం పూర్తయిందన్నారు. తహాశీల్దార్లు పంపిణీ కేంద్రాల్లో పండగ వాతావరణం కల్పించాలని, తమ ప్రాంత ప్రజా ప్రతినిధులను సప్రందించి వారితో పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెల 31 లోగా డేటా ఎంట్రీ పూర్తిచేసి అర్హులకు బియ్యం అందజేయాలని సూచించారు. డీలర్లు కూడా ఇంటింటికి వెళ్లి సంబంధిత కుటుంబాలకు మంజూరైన బియ్యం వివరాలు తెలపాలని, అధికారులు చాటింపు వేయించాలన్నారు. పింఛన్ల పథకాన్ని సమీక్షించి దాదాపు 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇటీవల కొందరు లబ్ధిదారులు వారి వయస్సును ఆధార్ కార్డుల్లో మార్పు చేయించి లబ్ధిపొందుతున్నారని తెలిసిందని, వారంతా అర్హులా కాదా అనే విషయాన్ని మరోమారు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. జనవరి 1 నుంచి జిల్లాలోని 264 సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ప్రతి వసతి గృహానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించడం జరిగిందన్నారు. వారంతా ఈ నెల 31, జనవరి 1న వారికి కేటాయించిన వసతి గృహాలకు వెళ్లి సబ్సిడీ బియ్యంతో వండిన భోజనాన్ని విద్యార్థులకు అందించే విధంగా పర్యవేక్షించాలన్నారు. వెల్దుర్తి తదితర మండలాల్లో ఇసుక అక్రమ రవాణ కొనసాగుతున్నట్లు గమనించామని, తహాశీల్దార్లు సంబంధిత వాహనాలను సీజ్ చేసి వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , అంతే కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను కలెక్టర్‌కు నివేదిక రూపంలో పంపితే ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండదన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, డీఆర్డీఏ పీపీ సత్యనారాయణరెడ్డి, డీఎస్ఓ ఏసురత్నం, డీఏం సివిల్ సప్లయీస్ జయరాం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు మెదక్‌కు సీఎం కేసీఆర్
కొల్చారం/పాపన్నపేట : సీఎం కేసీఆర్ నేడు మెదక్‌కు రానున్నారు. కొల్చారం, పాపన్నపేట మండలాల మధ్య గల ఘనపురం ప్రాజెక్ట్‌ను సందర్శించి ఆనకట్ట ఎత్తు పెంపు అంశంపై స్థానిక అధికారులతో సమీక్షించడంతో పాటు స్థానిక అధికారులతో కలిసి ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఎస్ఈ రాధాకృష్ణలతో కలిసి ఘనపురం ప్రాజెక్ట్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పరి శీలించారు. అనంతరం కలెక్టర్ మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనపురం ఆనకట్ట వద్దకు హెలీకాఫ్టర్లో చేరుకుంటారని తెలిపారు. అనంతరం ఘనపురం ప్రాజెక్ట్ చుట్టూ అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంచితే పెరిగే నిల్వ నీటి సామర్థ్యం వివరాలు పరిశీలిస్తారన్నారు. ఇందుకనుగుణంగా ఇరిగేషన్ అధికారులు ఆనకట్టపై, ప్రాజెక్ట్ చుట్టూరా జెండాలు ఏర్పాటు చేసి సీఎంకు వివరిస్తారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాలినడకన ఆనకట్ట చుట్టూ తిరిగి వివరాలు తెలుసుకుంటారని వెళ్లడించారు. అనంతరం మెదక్ పట్టణానికి వచ్చి ఇండోర్ స్టేడియం వద్ద మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారుల, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పం చ్‌లు, కో ఆపరేటివ్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్విహ స్తారని కలెక్టర్ తెలిపారు. ఎంఎన్ కెనాల్ పక్కన హెలీప్యాడ్ కొల్చారం మండలం చిన్నఘనపురం శివారులో గల మహబూబ్ నహర్ కెనాల్ దిగువన, మెకానికల్ బ్రిడ్జి పక్కన సీఎం కేసీఆర్ హెలీకాఫ్టర్ దిగేందుకు హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్. వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, కొల్చారం తహశీల్దార్ నిర్మల, పోతం శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ యాదాగౌడ్, ఏడుపాయల డెరైక్టర్ యాదయ్య, లక్ష్మిపతి, గౌరిశంకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సర్వే అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్ పక్కనే భోజనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లపై జేసీ శరత్ సమీక్ష సంగారెడ్డి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మెదక్ పర్యటన ఏర్పాట్లపై జేసీ శరత్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ శరత్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్ష సమావేశానికి అధికారులంతా తగు నివేదికలతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో డీఆర్ఓ దయానంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చేపట్టనున్న సమీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ వేదికగా సీఎం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా అధికారులు నివేదికలతో సిద్దమయ్యారు. సీఎం సమీక్ష నేపథ్యంలో ఈనెల 27న గజ్వేల్‌లోని శ్రీలక్ష్మీ గార్డెన్స్‌లో కలెక్టర్ రాహుల్ బొజ్జా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సీఎం సమీక్షకు వాస్తవ నివేదికలతో రావాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సహిం చేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు రెండ్రోజులుగా ఈ పనిలో నిమగ్నమై నివేదికలు తయారు చేశారు. గజ్వేల్‌లో సాగుతున్న పథకాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి. జూన్ 4న గజ్వేల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్, ఆ తర్వాత పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అదివారం సైతం అదే తరహాలో సమీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మొదలుకొని వివిధ శాఖల రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, గజ్వేల్ నియోజకవర్గ అధికారులతోపాటు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం పాల్గొంటుండడం విశేషం. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల అవసరాలపై సీఎం కేసీఆర్ అంశాల వారీగా సమీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం సేకరించి అభివృద్ధి ప్రణాళికలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ నగర పంచాయతీని తెలంగాణలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దనున్న నేపథ్యంలో ఈ సమీక్షలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నగర పంచాయతీకి రూ.90 కోట్లతో రింగ్ రోడ్డు, రూ.60 కోట్లతో గోదావరి సుజల స్రవంతి పైప్‌లైన్ నుంచి శాశ్వత మంచినీటి పథకాన్ని మంజూరు చేసిన సీఎం, తాజా సమీక్షలో నియోజకవర్గానికి మరిన్ని వరాలు కురిపించే అవకాశముంది. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు సమీక్ష సమావేశం కోసం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌లు పరిశీలించారు. ఫాంహౌస్ ఆవరణలో సుమారు 400 మంది కూర్చునేందుకు వీలుగా టెంట్ వేశారు. సమీక్షలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పాల్గొననున్నారు. -
ఆధార్ లేకున్నా రేషన్
సంగారెడ్డి అర్బన్: ఆధార్‌కార్డులేని వారికి కూడా రానున్న రెండు నెలలు రేషన్ సరుకులు అందజేస్తామని, ఆలోపు కార్డుదారులంతా తప్పకుండా ఆధార్ కార్డు పొందాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమస్యలు లేవనెత్తారు. ఈ సందర్భంలోనే అల్లాదుర్గం జెడ్పీటీసీ సభ్యురాలు మమత, రాయికోడ్ జెడ్పీటీసీ సభ్యుడు అంజయ్యలు మాట్లాడుతూ, ఆధార్ సెంటర్ సమీపంలో లేక, అవగాహన లేక చాలా మంది కార్డుదారులు ఇంతవరకూ ఆధార్‌కార్డులు పొందలేదని, మరోవైపు పౌరసరఫరాలశాఖ ఆధార్‌కార్డు సమర్పించని కార్డుదారులకు రేషన్‌సరుకులు పంపిణీ నిలివేయడంతో చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఆధార్‌కార్డు పొందేందుకు వారికి వారికి కాస్త సమయం ఇవ్వాలని, అంతవరకూ రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్...మరో రెండునెలల పాటు ఆధార్‌కార్డుతో అనుసంధానంకాకపోయినా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన్నారు. సర్కార్ ఆహారభద్రత కార్డులను త్వరలోనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, ఆహారభద్రత కార్డు పొందాలంటే తప్పకుండా ఆధార్‌కార్డు ఉండాల్సిందేనని, అందువల్ల ఇంతవరకు ఆధార్‌కార్డు పొందని వారంతా సాధ్యమైనంత త్వరగా కార్డు పొందాలన్నారు. ఇందుకోసం సంగారెడ్డి పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఆధార్ కేంద్రంతో పాటు మండలంలో కూడా కొత్తగా ఆధార్ కేంద్రం కొత్తగా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కూసునే జాగ చూపండి ఎంపీడీఓ కార్యాలయాల్లో తమకు చాంబర్లు లేక ఎక్కడ కూర్చోవాలో తెలియని దుస్థితి ఉందని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేయగా, స్పందించిన చైర్పర్సన్ రాజమణి, ఎంపీడీఓ కార్యాలయాల్లో జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా చాంబర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు ఏకరువు పటాన్చెరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమల కాలుష్యంతో ఇస్నాపూర్ చెరువు నీరు కలుషితమై ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, ఈ విషయంపై గవర్నర్ నరసింహన్ కూడా చెరువును సందర్శించి తగిన చర్యలు తీసుకుపోవాలని సూచనలు చేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని పటాన్చెరు జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ సభ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. చేగుంట మండలం మక్కరాజ్‌పేట వద్ద గల పరిశ్రమలు వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నాయని దీంతో నీరంతా కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చేగుంట జెడ్పీటీసీ సభ్యుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఘనపురం ఆనకట్ట ఆదుధునికీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపక పోవడమే కాకుండా శిలాఫలకంపై కూడా పేర్లు ముద్రించలేదని స్థానిక జెడ్పీటీసీ సమావేశంలో ప్రస్తావించగా, స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం పంపాలని జిల్లా పంచాయతీ అధికారి , జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, బేగంపేట్ , చిద్రుప్ప, ఆరట్ల నుంచి రోజూ రూ.2 కోట్ల విలువచేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, వాహన దారులు ఓవర్‌లోడ్‌తో వెళ్తుడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని జిన్నారం జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్ సమావేశంలో ప్రస్తావించారు. సంగారెడ్డి మండల ఆర్ఐ సత్తార్ ప్రోత్సాహంతో మండలంలో అక్రమ ఫిల్టర్లు జోరుగా సాగుతున్నాయని చర్యలు తీసుకోవాలని సంగాారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌గౌడ్ కలెక్టర్‌ను కోరగా, ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
వాస్తవ నివేదిక లతో రండి
గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 30న నిర్వహించనున్న సమీక్షకు అధికారులు వాస్తవ నివేదికలతో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు. సీఎం సమీక్ష నేపథ్యంలో కలెక్టర్ రాహుల్ బొజ్జా, జేసీ శరత్, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావులతో కలిసి గురువారం సాయంత్రం గజ్వేల్‌లోని లక్ష్మీ గార్డెన్స్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గస్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రతిష్టాత్మకమన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ సందర్భంగా శాఖలవారీగా ప్రగతి, ప్రణాళికలపై సమీక్షించారు. చాలావరకు నివేదికలు వాస్తవాలను ప్రతిబింబించే విధంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వీటిని సరి చేసి మరో నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రధానంగా గజ్వేల్ వాటర్ గ్రిడ్, రోడ్లు, విద్యుత్ తదితర శాఖల తీరుపై చర్చించారు. విద్యుత్ సంబంధించిన సమీక్షలో కొత్తగా తూప్రాన్‌లో 220కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రతిపాదించినట్లు ఎస్ఈ రాములు కలెక్టర్ వివరించి, ఇందుకోసం సేకరించిన పదెకరాల భూమిని తమకు స్వాధీనం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ వెంటనే తూప్రాన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న మిగతా సబ్స్టేషన్ల స్థల సేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయాలని ఆయా మండలాల తహశీల్దార్లను ఆదేశించారు. అంతకుముందు జేసీ శరత్ గజ్వేల్‌లో రూ.10 కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ కార్యాలయాల ఇంటిగ్రేటేడ్ కాంప్లెక్స్‌కు సంబంధించి స్థల సేకరణ, ప్రగతిపై గజ్వేల్ తహశీల్దార్ బాల్‌రెడ్డితో సమీక్షించారు. వెంటనే భవన నిర్మాణానికి అనువైన రెండెకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్ఓ సోనిబాల, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, జేడీఏ హుక్యా నాయక్, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సురేంద్ర, ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ విజయప్రకాశ్, ఇరిగేషన్ ఈఈ ఆనంద్, ఆర్అండ్బీ ఈఈ బాల్‌నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆసరా అందించండి
సంగారెడ్డి అర్బన్: పింఛన్ల పంపిణీ కార్యక్రమం ‘ఆసరా’ను శనివారం అధికారికంగా ప్రారంభించాలని రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ స్థాయి ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా శుక్రవారం ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 8న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పింఛన్ల పంపిణీ నిర్వహించాలన్నారు. దీనిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగేలా చూడాలని సూచించారు. పెన్షన్లు ఇచ్చేందుకు మండల పరిధిలోని గ్రామాల నుంచి తీసుకువచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలన్నారు. లబ్ధిదారులను క్షేమంగా తిరిగి వారి గ్రామాలకు చేరవేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం యథావిధిగా ఆయా గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు. పింఛన్లు అందజేసే చోట వైద్య శిబిరం మంచినీటి సౌకర్యం, తదితర మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో మెదక్ డివిజన్ నుంచి జేసీ డా.ఎ.శరత్ , డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జడ్పీ ఇన్చార్జ్ సీఈవో, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓలు మధుకర్‌రెడ్డి, వనజాదేవి, ముత్యంరెడ్డి, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
మారండి.. మార్చండి
జిల్లా ఆస్పత్రి సిబ్బంది పనితీరులో మార్పు రావాలని, హాస్పిట ల్లో సరైన సేవలు అందడం లేదంటూ ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని చెరిపేయాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా సూచించారు. వైద్యులు, స్టాఫ్‌లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు. డాక్టర్లను దేవుళ్లుగా భావించి వైద్యం కోసం దవాఖానకు వచ్చే నిరుపేదలకు మెరుగైన చికిత్సలు చేయాలని జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి కోరారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌బొజ్జా అన్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం పట్టణంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ ప్రథమ పౌరురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సమాచారం అందించారా..? అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. దీనిపై తడబడ్డ ఆయన సమాధానం దాటవేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన చికిత్సలు అందించడానికి అవసరమైన మందులు, పరికరాలు, సిబ్బంది వివరాలను వివరాలను ఈ నెల 16 లోపు తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో సరైన సేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, ఈ అపవాదును తొలగించడానికి ప్రతిఒక్క రూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. శానిటేషన్ వ్యవస్థ సరిగా లేదని, కాంట్రాక్టర్ కాలపరిమితి ముగిసినందున సబ్ కాంట్రాక్ట్‌ను తొలగించి టెండర్లు పిలవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మరుగుదొడ్ల మరమ్మతులు, సీసీ కెమెరాల మంజూరు, 250 పడకల ఆస్పత్రిని 500 పడకల స్థాయికి పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు అవసరమైన వివరాాలపై నివేదికలు తెప్పించుకుని ఇవ్వాలని డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, ఎన్ఆర్హెచ్ఎం డీపీఓలకు సూచించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్ సిస్టమ్, హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ, రూఫ్ లీకేజీ మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈఈ రఘును ఆదేశించారు. ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో వెంటీలెటర్లను అమర్చుకోవాలని, ఎంతమంది సిబ్బంది అవసరమో తెలియజేయాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.5 లక్షలను ఎన్హెచ్ఎం నిధులను ఖర్చు చేసేందుకు కమిటీ ఆమోదించింది. జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రేమతో మాట్లాడి వారికి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యే అసహనం... డిప్యూటీ సీఎం పర్యటించి ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజునే సమయపాలన పాటించకపోవడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్లో మార్పు రాకుంటే శాఖ పరమైన చర్యలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల కో-ఆర్డినేటర్ నరేంద్రబాబు, ఆర్ఎంఓ మురహరి, డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ బాలాజీ పవార్, ఎన్హెచ్ఎం డీపీఓ జగన్నాథరెడ్డి, టీఎస్ ఎస్ఎమ్ఐడీసీ రఘు, జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్ గయాసొద్దీన్, వివిధ విభాగాల డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్డుల సందర్శన... జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని వివిధ విభాగాలను జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా మంగళవారం ఉదయం సందర్శించారు. ఓపీ యూనిట్‌ను, ఇన్ బర్న్, ఔట్ బర్న్, వార్డులను గైనిక్, శిశుసంజీవని, ఎన్ఆర్సీ యూనిట్లు, ఐసీయూ యూనిట్లను పరిశీలించారు. -
అర్హులను గుర్తించేందుకే సమగ్ర గణన
కలెక్టర్ రాహుల్ బొజ్జా సంగారెడ్డి అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాను సారమే కుటుంబంలోని వ్యక్తులు, వారి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, కులం, విద్యార్హతలు తదితర వివరాలను 2011 నుంచి సేకరించామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ వివరాలను వివిధ ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా పథకాల అమలులో వినియోగిస్తామన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 10 న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, గ్రామైక్య సంఘాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో, పురపాలక సంఘాల్లో వెబ్సైట్ల ద్వారా ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచుతామన్నారు. గతంలో నిర్వహించిన సర్వే సమయంలో అందుబాటులో లేని వారు, విద్యార్హతలు ఇతర సమాచారాన్ని సరిచేయించుకోవాలనుకునే వారు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19న గ్రామ సభలు నిర్వహిస్తామని, నవంబర్ 8 వ తేదీన ఆక్షేపణలను స్వీకరిస్తామన్నారు. నవంబర్ 30లోపు ఆక్షేపణలను పరిష్కరించి ముసాయిదా జాబితాను డిసెంబర్ 30 లోపు ప్రచురిస్తామన్నారు. ప్రజలంద రూ ముసాయిదా జాబితాలో కుటుంబ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబంలోని వ్యక్తుల పేర్లు లేనట్లయితే, జాబితాలోని సమాచారాన్ని సవరణ చేయడానికి , ఇతరుల సమాచారంపై ఆక్షేపణలు చేయడానికి, తొలగించడానికి వినతులను సంబంధిత అధికారులకు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడటం ఈ జాబితా ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మాత్రమే దరఖాస్తును నేరుగా అధికారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలి నెల రోజులుగా రుణమాఫీ కోసం చర్యలు తీసుకుంటున్నామని, రూ.లక్షలోపున్న రైతుల రుణాలు మాఫీ చేయడంతో పాటు రీషెడ్యూల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2013 ఖరీఫ్ లోన్ మూడు సంవత్సరాలకు రీషెడ్యూల్డ్ అవుతుంద న్నారు. మొదటి సంవత్సరం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే రెండు, మూడు సంవత్సరాలలో రూ.లక్ష చెల్లిస్తుందన్నారు. రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి రీషెడ్యూల్ మాత్ర మే చేయించుకోవాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆహార భధ్రత కార్డులను మంజూరు చేయనున్నట్లు సమాచారం అందిందని కలెక్టర్ తెలిపారు. ఈ దరఖాస్తులను వీఆర్వో కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. తెల్లకాగితంపై సాధారణ వివరాలు పొందుపరుస్తూ, ఆధార్‌కార్డు వివరాలు అందించినట్లయితే సమగ్ర కుటుంబ సర్వేలో పొందుపర్చిన వివరాల ఆధారంగా కార్డులు అందజేస్తామన్నారు. ఈ నెల 15 తర్వాత షెడ్యూల్డ్ ప్రకటిస్తామన్నారు. వీటితో పాటు ఫాస్ట్ పథకం, పెన్షన్ల ప్రక్రియ అక్టోబర్ లోపు ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పూర్తిచేస్తామన్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అన్లైన్ ద్వారా మీ-సేవా కేంద్రంలో http://epass.cgg.gov.in సంప్రదించగలరన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్, డీఆర్డీఏ పీడి రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్
సంగారెడ్డి రూరల్: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ అభియాన్ సాధ్యమవుతుందని కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి మండలం నాగాపూర్‌లో సర్పంచ్ కటకం రాజు అధ్యక్షతన గురువారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మాగాంధీ పేర్కొన్నారన్నారు. దేశంలోని గ్రామాలన్నీ పరిశుభ్రమైన గ్రామాలుగా మారాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు , గ్రామాల శుభ్రతకు కృషిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్యానికి గురైతే డబ్బు వృధా అవుతుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ సాధన కోసం ప్రతి ఒక్కరు ఏడాదికి వంద గంటలు, వారానికి రెండు గంటలు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. నాబార్డ్ సీజీఎం జీజీ మెమన్ మాట్లాడుతూ నాబార్డ్ ఆధ్వర్యంలో జిల్లాలో వర్మి కంపోస్ట్ ప్రాజెక్ట్‌ను, డెయిరీ, బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకు ముందు కలెక్టర్, ఎమ్మెల్యే,తదితరులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీపీ రవీందర్‌రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, నాబార్డ్ జీఎం కిషన్ సింగ్, డీజీఎం షెవుడే, డీడీఎం రమేష్, తహాశీల్దార్ గోవర్థన్, ఎంపీడీఓ సరళ, ఈఓపీఆర్డీ సంధ్య, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎంపీటీసీ క్రిష్ణవేణి అశోక్‌గౌడ్‌తో పాటు వివిధశాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కోసం కృషి : భెల్ ఈడీ రవిచందర్ రామచంద్రాపురం: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భెల్ ఈడీ రవిచందర్ పేర్కొన్నారు. గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా భెల్ పరిశ్రమ ముఖధ్వారం నుంచి బుధవారం సంత వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుధవారం సంత ప్రాంగణాన్ని భెల్ ఈడీతో పాటు అధికారులు, కార్మికులు శుభ్రపరిచారు. అనంతరం రవిచందర్ మాట్లాడుతూ కార్మికులు ప్రతి శనివారం రెండు గంటలు పరిసరాలను శుభ్రపరిచేందుకు సమయం కేటాయించాలన్నారు. శ్రమదానం నిర్వహించి స్వచ్ఛ భారత్ సాధనకు కృషి చేయాలన్నారు. -
సంబురాలకు పంచాయతీ నిధులు వాడుకోవచ్చు
మెదక్: బతుకమ్మ సంబరాలకు గ్రామ పంచాయతీ నిధులను వాడుకోవచ్చని కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. మంగళవారం మెదక్‌కు వచ్చిన ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో బతుకమ్మలు ఆడే స్థలాల్లో ప్రత్యేక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. నిమజ్జనం చేయడానికి చెరువుల వద్ద ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు గ్రామ పంచాయతీ నిధులను, పట్టణాల్లో మున్సిపాలిటీ నిధులను, జిల్లా పరిపాలన నిధులు కూడా వెచ్చిస్తున్నామన్నారు. అలాగే ఈ నెల 24 నుంచి 27 వరకు జిల్లాస్థాయి పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మెదక్ పట్టణంలో బతుకమ్మలు నిమజ్జనం చేసే ప్రదేశాలైన బంగ్లా చెరువు, మల్లంచెరువులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కమిషనర్ వెంకటేశం తదితరులు ఉన్నారు. బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పాట్లు... సంగారెడ్డి అర్బన్: బతుకమ్మ పండుగను జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈనెల 24 నుండి అక్టోబర్ 2 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు , మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్టు తె లిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా ఉద్యోగులు పాల్గొంటారన్నారు. 25న డీఆర్డీఏ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఉద్యోగినులు పాల్గొంటారని, ఆదేరోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న మెప్మా, గృహనిర్మాణం, ట్రెజరీ శాఖల ఉద్యోగినులు బతుక మ్మ ఉత్సవాలలో పాల్గొంటారని, ఈ సందర్భంగా కోలాటం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 27న ఐసీడీఎస్, ఏపీఎంఐపీ, వ్యవసాయ శాఖ ఉద్యోగినులు పాల్గొంటారని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న జిల్లా పరిషత్తు, సీపీఓ, వయోజన విద్యాశాఖల ఉద్యోగినులు పాల్గొంటారని, అదే రోజు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 29న పశుసంవర్థక శాఖ, ఎస్సీ,బీసి కార్పొరేషన్ల ఉద్యోగినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 30న రెవెన్యూ , విద్యాశాఖ, సివిల్‌సప్లయ్ శాఖల ఉద్యోగినులు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. అక్టోబర్ 1న డ్వామా, వైద్య ఆరోగ్య శాఖ,సహకార శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణతో పాటు మహిళలకు సంప్రదాయక వస్త్ర ధారణ పోటీలుంటాయని తెలిపారు. 2న అన్ని శాఖల ఉద్యోగులందరూ బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటారని అదే రోజు బహుమతి ప్రధానం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.