అర్హులకు ఆరు కిలోల బియ్యం
సంగారెడ్డి అర్బన్: వచ్చే నెల 1,2 తేదీల్లో జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్డీఓలు, తహాశీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార భద్రత కార్డులకు 7లక్షల 91వేల దరఖాస్తులు అందాయని , అన్ని దరఖాస్తులను పరిశీలించడం పూర్తయిందన్నారు.
తహాశీల్దార్లు పంపిణీ కేంద్రాల్లో పండగ వాతావరణం కల్పించాలని, తమ ప్రాంత ప్రజా ప్రతినిధులను సప్రందించి వారితో పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ఆదేశించారు. ఈ నెల 31 లోగా డేటా ఎంట్రీ పూర్తిచేసి అర్హులకు బియ్యం అందజేయాలని సూచించారు. డీలర్లు కూడా ఇంటింటికి వెళ్లి సంబంధిత కుటుంబాలకు మంజూరైన బియ్యం వివరాలు తెలపాలని, అధికారులు చాటింపు వేయించాలన్నారు. పింఛన్ల పథకాన్ని సమీక్షించి దాదాపు 3 లక్షల పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇటీవల కొందరు లబ్ధిదారులు వారి వయస్సును ఆధార్ కార్డుల్లో మార్పు చేయించి లబ్ధిపొందుతున్నారని తెలిసిందని, వారంతా అర్హులా కాదా అనే విషయాన్ని మరోమారు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు.
జనవరి 1 నుంచి జిల్లాలోని 264 సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ప్రతి వసతి గృహానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించడం జరిగిందన్నారు. వారంతా ఈ నెల 31, జనవరి 1న వారికి కేటాయించిన వసతి గృహాలకు వెళ్లి సబ్సిడీ బియ్యంతో వండిన భోజనాన్ని విద్యార్థులకు అందించే విధంగా పర్యవేక్షించాలన్నారు.
వెల్దుర్తి తదితర మండలాల్లో ఇసుక అక్రమ రవాణ కొనసాగుతున్నట్లు గమనించామని, తహాశీల్దార్లు సంబంధిత వాహనాలను సీజ్ చేసి వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , అంతే కాకుండా ఎప్పటికప్పుడు వివరాలను కలెక్టర్‌కు నివేదిక రూపంలో పంపితే ఎలాంటి పైరవీలకు ఆస్కారం ఉండదన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, డీఆర్‌డీఏ పీపీ సత్యనారాయణరెడ్డి, డీఎస్‌ఓ ఏసురత్నం, డీఏం సివిల్ సప్లయీస్ జయరాం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.