ఈసీఐదే తుది నిర్ణయం | Rajat Kumar Nizamabad Election Postpone | Sakshi
Sakshi News home page

ఈసీఐదే తుది నిర్ణయం

Published Sat, Apr 6 2019 3:24 AM | Last Updated on Sat, Apr 6 2019 3:24 AM

Rajat Kumar Nizamabad Election Postpone - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌:  నిజామాబాద్‌ పోలింగ్‌ వాయిదాపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన రజత్‌కుమార్‌.. బరిలో ఉన్న రైతు అభ్యర్థులు, ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ను వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు కోరుతున్నారని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీఐ)కి నివేదిస్తామని చెప్పారు. దీనిపై తుది నిర్ణయం వారిదేనని స్పష్టం చేశారు.

గుర్తుల కేటాయింపు సక్రమంగా జరగలేదనీ, మొదటిసారి బరిలో ఉన్నామనీ, ఈ గుర్తులపై సరిగ్గా అవగాహన లేదని, గుర్తులు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయనీ, పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయామని రైతు అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ముందుగా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా పోలింగ్‌ జరుపుతామని ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ ఈవీఎంలతో నిర్వహిస్తున్నారనే అంశాలన్నీ కూడా చర్చకొచ్చాయని పేర్కొన్నారు. ప్రచారం నిర్వహించేందుకు సమయం లేనందున వారం, పది రోజులు పోలింగ్‌ను వాయిదా వేయాలని కోరారని చెప్పారు. అలాగే ఈవీఎంలను ముందుగా ఎల్‌ ఆకారంలో పెడతామని, మళ్లీ ఇప్పుడు డిజైన్‌ను మార్చారనే అంశంపై రైతు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. ఈ విషయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పోలింగ్‌ వాయిదా వేయడంపై ఈసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 11న పోలింగ్‌ నిర్వహించాలని ప్రకటించిన మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని రజత్‌కుమార్‌ తెలిపారు. 

ప్రపంచంలోనే తొలి ఎన్నిక ఇది 
185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈవీఎంలతో నిర్వహించడం దేశంలోనే కాకుండా, ప్రపంచంలో కూడా ఇది తొలి ఎన్నిక అవుతుందని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు. దీన్ని ఓ సవాల్‌గా తీసుకున్నామని చెప్పారు. 27 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వివరించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. ఈనెల 7లోపు అన్ని ఈవీఎంలను పంపిణీ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. 

మాక్‌ పోలింగ్‌ నిర్వహించాం 
మాక్‌ పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించామని, వంద మంది అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా ఓటు వేసి చూశారని, ఓటింగ్‌ సమయాన్ని కూడా పరిశీలించారని, మాక్‌ పోలింగ్‌పై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు, ఎన్నికల సంఘం అదనపు ఈసీఓ బుద్ధ్దప్రకాశ్, సంయుక్త సీఈఓ రవి కిరణ్, అదనపు డీజీపీ జితేందర్, ఎన్నికల పరిశీలకులు గౌరవ్‌ దాలియా, ఎన్నికల ప్రత్యేక అధికారి రాహుల్‌బొజ్జా తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement