కలెక్టర్ రాహుల్ బొజ్జా
సంగారెడ్డి అర్బన్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాను సారమే కుటుంబంలోని వ్యక్తులు, వారి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, కులం, విద్యార్హతలు తదితర వివరాలను 2011 నుంచి సేకరించామని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈ వివరాలను వివిధ ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా పథకాల అమలులో వినియోగిస్తామన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 10 న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, గ్రామైక్య సంఘాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో, పురపాలక సంఘాల్లో వెబ్‌సైట్‌ల ద్వారా ముసాయిదా జాబితాను అందుబాటులో ఉంచుతామన్నారు.
గతంలో నిర్వహించిన సర్వే సమయంలో అందుబాటులో లేని వారు, విద్యార్హతలు ఇతర సమాచారాన్ని సరిచేయించుకోవాలనుకునే వారు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19న గ్రామ సభలు నిర్వహిస్తామని, నవంబర్ 8 వ తేదీన ఆక్షేపణలను స్వీకరిస్తామన్నారు. నవంబర్ 30లోపు ఆక్షేపణలను పరిష్కరించి ముసాయిదా జాబితాను డిసెంబర్ 30 లోపు ప్రచురిస్తామన్నారు. ప్రజలంద రూ ముసాయిదా జాబితాలో కుటుంబ వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబంలోని వ్యక్తుల పేర్లు లేనట్లయితే, జాబితాలోని సమాచారాన్ని సవరణ చేయడానికి , ఇతరుల సమాచారంపై ఆక్షేపణలు చేయడానికి, తొలగించడానికి వినతులను సంబంధిత అధికారులకు అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడటం ఈ జాబితా ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మాత్రమే దరఖాస్తును నేరుగా అధికారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు.
రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలి
నెల రోజులుగా రుణమాఫీ కోసం చర్యలు తీసుకుంటున్నామని, రూ.లక్షలోపున్న రైతుల రుణాలు మాఫీ చేయడంతో పాటు రీషెడ్యూల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2013 ఖరీఫ్ లోన్ మూడు సంవత్సరాలకు రీషెడ్యూల్డ్ అవుతుంద న్నారు. మొదటి సంవత్సరం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే రెండు, మూడు సంవత్సరాలలో రూ.లక్ష చెల్లిస్తుందన్నారు. రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి రీషెడ్యూల్ మాత్ర మే చేయించుకోవాలన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆహార భధ్రత కార్డులను మంజూరు చేయనున్నట్లు సమాచారం అందిందని కలెక్టర్ తెలిపారు. ఈ దరఖాస్తులను వీఆర్‌వో కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. తెల్లకాగితంపై సాధారణ వివరాలు పొందుపరుస్తూ, ఆధార్‌కార్డు వివరాలు అందించినట్లయితే సమగ్ర కుటుంబ సర్వేలో పొందుపర్చిన వివరాల ఆధారంగా కార్డులు అందజేస్తామన్నారు. ఈ నెల 15 తర్వాత షెడ్యూల్డ్ ప్రకటిస్తామన్నారు. వీటితో పాటు ఫాస్ట్ పథకం, పెన్షన్‌ల ప్రక్రియ అక్టోబర్ లోపు ఈ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా పూర్తిచేస్తామన్నారు. కల్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అన్‌లైన్ ద్వారా మీ-సేవా కేంద్రంలో http://epass.cgg.gov.in సంప్రదించగలరన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్, డీఆర్‌డీఏ పీడి రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులను గుర్తించేందుకే సమగ్ర గణన
Published Fri, Oct 10 2014 12:02 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement