ఆమెకూ హక్కు! | Virasat case revealed in the Collector survey | Sakshi
Sakshi News home page

ఆమెకూ హక్కు!

Published Tue, Oct 17 2017 1:46 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Virasat case revealed in the Collector survey - Sakshi

వారసత్వ చట్టాన్ని అమలు చేయనున్న అధికారులు  కుమారులు, కుమార్తెలకు సమాన వాటా ఇవ్వాలని ఆదేశించిన కలెక్టర్‌  సర్వేలో వెల్లడైన విరాసత్‌ కేసుల్లో నోటీసుల జారీ అభ్యంతరాలు స్వీకరించాక ఆస్తి పంపకం ఇప్పటివరకు 2,600 మంది పట్టాదారులు మృతి చెందినట్లు గుర్తింపు  యంత్రాంగం నిర్ణయంతో ఆశల పల్లకీలో కూతుళ్లు  వివాదాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వేలో మృతి చెందిన పట్టాదారుల విషయమై అవలంభించాల్సిన పద్ధతులపై జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 2007లో సుప్రీం కోర్టు తీర్పు మేరకు వారసత్వ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తహసీల్దార్లు, ఆర్డీఓలకు సూచించారు.

 మొదటి విడతగా జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేపై ఈనెల 12నరెవెన్యూ అధికారులతో  నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రస్తుత సర్వేలో వెల్లడైన విరాసత్‌ కేసుల విషయంలో సర్వోన్నత న్యాస్థాస్తానం తీర్పును అమలు చేయాల్సిందేనని స్ప ష్టం చేశారు. మృతి చెందిన పట్టాదారుల కుమా రులతో పాటు కూతుళ్లకు ఆస్తిలో సమాన హక్కు దక్కే లా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విరాసత్‌పై స్పష్టత
భూవివాదాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సర్వే నంబర్ల వారీగా పరిశీలనలో మృతి చెందిన పట్టాదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తు త సర్వేలో మరణించిన పట్టాదారుల పేరిటే ఇంకా భూములున్నట్లు అధికారులు గుర్తించా రు. రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఇంతకాలం నెట్టుకొచ్చిన అధికారులకు ప్ర స్తుతం నిర్వహిస్తున్న సర్వే ద్వారా విరాసత్‌లు చ ట్ట ప్రకారం చేయక తప్పని పరిస్థితి ఎదురైంది. సెప్టెంబర్‌ 15న జిల్లాలో అధికారికంగా ప్రారంభమైన సర్వే ద్వారా రికార్డులను సరిదిద్దడంలో భాగంగా విరాసత్‌ కేసుల విషయమై మీమాంసలో కొట్టుమిట్టాడుతున్న రెవెన్యూ బృందాలు, తహసీల్దార్లు జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ముందుకు కదులుతున్నారు.

నోటీసుల జారీ.. అభ్యంతరాల స్వీకరణ
రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా సర్వే బృందాల వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేర కు మృతి చెందిన పట్టాదారు వారసులైన  కుమారులు, కూతుళ్లు, ఇతర వారసులకు నోటీసులు జా రీ చేస్తారు. గ్రామపంచాయితీ నోటీసు బార్డుపై నోటీసులను అతికిస్తారు. విరాసత్‌ చేసే విషయంలో ఏడు రో జుల గడువు ఇచ్చి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆలోగా వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని విచారణ చేపడతారు. వారసత్వ చట్టం ప్రకారం కుమారులు, కుమార్తెలందరికీ ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ విరాస త్‌ ప్రక్రియను చేపడతారు. ఈ సందర్భంగా రికార్డుల్లో మార్పులు చేసి పట్టా పాస్‌బుక్‌లు జారీ చేస్తారు.  

ఆశలు.. వివాదాలు
గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహిళల్లో సంతోషం వ్యక్తమవుతున్నప్పటికీ మిగతా సోదరులు, భూ కొనుగోలుదారుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. 2007లో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనంతరం భూకొనుగోలు చేసిన వారిలో అంతర్మథనం మొదలయ్యే అవకాశం లేకపోలేదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచే వారసత్వ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటారా... లేక అంతకు ముందు జరిగిన లావాదేవీల కు సైతం వర్తింపజేస్తారా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న గా మిగలనుంది. పెళ్లి చేసు కుని వెళ్లిన మహిళల్లో జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో ఆస్తిపై ఆశలు పుట్టుకొచ్చే అవకాశముంది. ఈ చట్టం అమలుతో గ్రామాల్లో అల్లర్లు జరిగే అవకాశమూ లేకపోలేదు. అధికారులు తీసుకున్న మంచి నిర్ణయంగా భావిస్తున్న తరుణంలో అవాంతరాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

మరణించిన పట్టాదారులు 2,600 మంది
రెవెన్యూ రికార్డుల ప్యూరిఫికేషన్‌లో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన మొదటి విడత ఇంటింటి సర్వే పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,600 మంది పట్టాదారులు మరణించినట్లు సర్వే బృందాలు గుర్తించాయి. వారి పేరిట ఉన్న భూ విస్తీర్ణాన్ని వారసులకు విరాసత్‌ చేసి రికార్డుల్లో మార్పులు చేస్తారు. జిల్లాలోని 26 మండలాల్లో మొత్తం 97 సర్వే బృందాలు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1,59,193 సర్వే నెంబర్లను పరిశీలించగా... మరణించిన పట్టాదారులు ఉన్నవి 7,636 సర్వే నంబర్లు ఉన్నాయి. వీటిపై దాదాపు 2,600 మంది పట్టాదారులు ఉన్నారు. వీరికి సంబంధించిన భూములపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు కుమార్తెలు, కుమారులకు సమాన హక్కు కల్పించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement