అ"సమగ్ర" సర్వే
– పెద్దలకో తీరు.. పేదలకో తీరు
– వివరావ్విలని పచ్చ నేతలు
((((జిల్లాలో ఆయన అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి. ధనవంతుల్లో జాబితా సిద్ధం చేస్తే ముందువరుసలో ఉంటారు. ఇదే విధంగా అధికార పార్టీకి చెందిన మరొక ప్రజాప్రతినిధి ఆస్తుల విలువ లెక్కిస్తే ‘టాప్ టెన్’లో నిలుస్తారు. ఈయనకు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనే కాకుండా హైదరాబాద్‌లోనూ విలువైన భూములు, ఆస్తులు ఉన్నాయి. ఎన్నికల్లో సమయంలో ఆయన ఇచ్చిన అఫిడివిట్ పరిశీలిస్తే ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తుల చిట్టా ఎంత పొడవుందో తెలుస్తుంది. ఇదే విధంగా అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కోట్లకు పడగలెత్తారు. అయితే వీరెవరూ స్మార్ట్ పల్స్ సర్వే(ప్రజా సాధికార సర్వే)లో తమకు సంబంధించిన ఆస్తుల వివరాలను సమగ్రంగా ఇవ్వలేదని తెలిసింది.)))
అనంతపురం అర్బన్ : జిల్లాలో ప్రజా సా«ధికార సర్వే ‘చోద్యం’గా మారింది. పెద్దలకో తీరు... సామాన్యులకో తీరు చందంగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి గుచ్చి గుచ్చి వివరాలను సేకరిస్తున్నారు. అదే కోట్ల రూపాయలకు పడగలెత్తిన అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం సర్వేలో తమ వివరాలను సమగ్రమంగా ఇవ్వడం లేదు. ఏదో మొక్కుబడిగా కానిచ్చేస్తున్నట్లు తెలిసింది. ఒకవైపు ప్రజల సాధికారత కోసమే సర్వే అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ప్రతి పౌరుడు తమకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలనీ చెప్పింది.
ఇవ్వన్నీ సామాన్యులకే తప్ప అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు వర్తించడం లేదనేది సర్వే తీరు స్పష్టం చేస్తోంది. జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యుల పేరున లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు తమ ఆస్తుల సమాచారాన్ని సర్వేలో వెల్లడించకుండా గోప్యంగా ఉంచుకున్నారని తెలిసింది. వాస్తవంగా 22 ఆధారాలను సర్వే సిబ్బందికి ప్రజలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పలువురు ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా కొన్ని వివరాలు చెప్పి ఎన్యుమరేటర్లను పంపుతున్నారని సమాచారం. కనీసం వరిని ఇళ్లలోకి కూడా రానివ్వట్లలేదని తెలుస్తోంది.
ఆధార్‌తో అనుసంధానం కాని ఆస్తులెన్నో..
జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు ధనిక ప్రజాప్రతినిధుల ఆస్తులు చాలా వరకు ఆధార్‌తో అనుసంధానం కాలేదని తెలిసింది. ఆధార్ కార్డు విధానం అమలులోకి రాక ముందు ఉన్న ఆస్తులు ఆధార్ పరిధిలోకి రాలేదని సమాచారం. ఇలాంటి ఆస్తుల వివరాలను పచ్చనేతలు సర్వేలో వెల్లడించకుండా గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. కాగా సామాన్యుల నుంచి మాత్రం వివరాలను ఎన్యుమరేటర్లు పక్కాగా సేకరిస్తున్నారు. వారి ఇళ్లలోకి ప్రతి వస్తువునూ పరిశీలించి నమోదు చేసుకుంటున్నారు. దీంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. వాటి కారణంగానే ఎక్కడ ప్రభుత్వ పథకాలను దూరం చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.