భద్రాద్రి రైల్వేలైన్ సర్వే పూర్తి
Published Sat, Mar 18 2017 12:58 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు సిటీ : కొవ్వూరు–భద్రాచలం మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు సంబంధించి సర్వే పూర్తి చేశామని కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. జిల్లాలో కొత్త రైలు మార్గాలు, వంతెనల నిర్మాణం తదితర అంశాలపై రైల్వే శాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. భద్రాచలం రైల్వే లైన్‌కు సంబంధించి రైల్వే శాఖ నుంచి తగిన ప్రతిపాదనలు ఇస్తే యుద్ధప్రాతిపదికన భూములు సేకరించి అప్పగిస్తామన్నారు. జిల్లాలో రైల్వే లైన్ల విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రానున్న రెండేళ్లలో మన జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించనుందని, ఈ దృష్ట్యా రైల్వేలకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. కొత్త రైలు మార్గాలను గుర్తించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ రైల్వే అడిషనల్ మేనేజర్ కె.వేణుగోపాలరావును కోరారు. ఏలూరు నుంచి జీలుగుమిల్లి మీదుగా భద్రాచలం వరకు కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తే మెట్ట ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. కైకలూరు నుంచి భీమవరం, పాలకొల్లు, నరసాపురం వరకు రైల్వే రెండో ట్రాక్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, డెల్టాలో మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఏలూరు నుంచి ద్వారకాతిరుమల వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే భక్తులు ఉపయోగం కలుగుతుందన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఏలూరు లేదా భీమడోలులో రైలు దిగి రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల వెళ్లాల్సి వస్తోందన్నారు. రైల్వే ఏడీఆర్‌ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ వట్లూరు వద్ద ఆర్‌ఓబీ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని, పాలకొల్లులో రైల్వే గేటు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ నిర్మల, రైల్వే డివిజినల్ ఇంజినీర్ వరుణ్‌బాబు, రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఏవీ సత్యనారాయణ, పార్సిల్ సూపర్‌వైజర్ ఎస్‌కే మీర్‌హుస్సేన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement