సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షా లు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై సర్వే చేపట్టాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ మేరకు గురువారం విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్కసారికి సాయం అందించేందుకు గ్రామాలవారీగా, సాగుదారులవారీగా పంటనష్టంపై సవివరమైన సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖకు సూచించారు.
నష్టాన్ని చవిచూసిన రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 21వ తేదీల మధ్య ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురియడంతో అన్నిరకాల పంటలకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అధికారుల బృందం పంటలకు నష్టం జరిగిన వివిధ ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేసిందన్నారు.
పంట చేతికొచ్చేదశలో ఉందని, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల వందశాతం నష్టం వాటిల్లిందని, దీంతో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, పంటనష్టాన్ని గ్రామాల్లో అంచనా వేయాలని, లబ్ది దారులను గుర్తించాలని వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణాధికారు(ఏఈవో)లను ప్రభుత్వం ఆదేశించింది.
2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం
రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే వాస్తవంగా ఇది ఐదు లక్షల వరకు ఉంటుందని రైతు సంఘాలు, కిందిస్థాయి నుంచి సమాచారం వస్తోంది. కాగా, ప్రభుత్వం వేసిన నష్టం అంచనా ప్రకారం మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది.
తాజాగా చేయబోయే సర్వేలో ఇంకేమైనా అదనంగా నష్టం వెలుగుచూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. నష్టపరిహారంగా దీన్ని పేర్కొనకూడదని, సహాయ, పునరావాస చర్యలు అని పిలవాలని ముఖ్యమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. రైతులు మళ్లీ పుంజుకుని, వ్యవసాయం చేసేందుకు వీలుగా సహాయసహకారాలు అందించాలని ఆయన తెలిపిన సంగతి తెలిసిందే.
సీఎం ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని వారం, పది రోజుల్లో రైతులకు అందజేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.పంటకు పెట్టుబడి పెట్టింది కౌలు రైతులే కాబట్టి వాళ్లకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment