మెదక్: బతుకమ్మ సంబరాలకు గ్రామ పంచాయతీ నిధులను వాడుకోవచ్చని కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. మంగళవారం మెదక్‌కు వచ్చిన ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించినట్లు చెప్పారు.
ఈ నిధులతో బతుకమ్మలు ఆడే స్థలాల్లో ప్రత్యేక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. నిమజ్జనం చేయడానికి చెరువుల వద్ద ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు గ్రామ పంచాయతీ నిధులను, పట్టణాల్లో మున్సిపాలిటీ నిధులను, జిల్లా పరిపాలన నిధులు కూడా వెచ్చిస్తున్నామన్నారు. అలాగే ఈ నెల 24 నుంచి 27 వరకు జిల్లాస్థాయి పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మెదక్ పట్టణంలో బతుకమ్మలు నిమజ్జనం చేసే ప్రదేశాలైన బంగ్లా చెరువు, మల్లంచెరువులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కమిషనర్ వెంకటేశం తదితరులు ఉన్నారు.
బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పాట్లు...
సంగారెడ్డి అర్బన్: బతుకమ్మ పండుగను జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈనెల 24 నుండి అక్టోబర్ 2 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు , మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్టు తె లిపారు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా ఉద్యోగులు పాల్గొంటారన్నారు. 25న డీఆర్‌డీఏ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఉద్యోగినులు పాల్గొంటారని, ఆదేరోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న మెప్మా, గృహనిర్మాణం, ట్రెజరీ శాఖల ఉద్యోగినులు బతుక మ్మ ఉత్సవాలలో పాల్గొంటారని, ఈ సందర్భంగా కోలాటం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 27న ఐసీడీఎస్, ఏపీఎంఐపీ, వ్యవసాయ శాఖ ఉద్యోగినులు పాల్గొంటారని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
28న జిల్లా పరిషత్తు, సీపీఓ, వయోజన విద్యాశాఖల ఉద్యోగినులు పాల్గొంటారని, అదే రోజు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 29న పశుసంవర్థక శాఖ, ఎస్సీ,బీసి కార్పొరేషన్‌ల ఉద్యోగినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 30న రెవెన్యూ , విద్యాశాఖ, సివిల్‌సప్లయ్ శాఖల ఉద్యోగినులు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు.
అక్టోబర్ 1న డ్వామా, వైద్య ఆరోగ్య శాఖ,సహకార శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణతో పాటు మహిళలకు సంప్రదాయక వస్త్ర ధారణ పోటీలుంటాయని తెలిపారు. 2న అన్ని శాఖల ఉద్యోగులందరూ బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటారని అదే రోజు బహుమతి ప్రధానం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.
సంబురాలకు పంచాయతీ నిధులు వాడుకోవచ్చు
Published Tue, Sep 23 2014 11:59 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement