panchayat funds
-
పంచాయతీ నిధులపై చర్చకు రా!
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం చేపట్టాక గ్రామ పంచాయతీలకు నిదులిచ్చిన దాఖలాల్లేవు. కేంద్రం స్వచ్ఛభారత్ మిషన్సహా అనేక పథకాల ద్వారా ఇస్తున్న నిధులతోనే అవి నడుస్తున్నయ్. అయినా రూ.కోట్లు ఇస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ విషయమై ఆయన చర్చకు రావాలి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. సోమ వారం రాత్రి పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, ఎస్.కుమార్‌లతో కలసి సంజయ్ మీ డియాతో మాట్లాడారు. కార్పొరేట్ విద్యాసంస్థలు పదోతరగతి, ఇంటర్ ఫలితాలు వచ్చాక టీవీల్లో 1... 2... 3.. ర్యాంకులు మావే అని ప్రకటనలు ఇచ్చినట్టు సీఎం కేసీఆర్ ఏ సభకు వెళ్లినా కోట్లకు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించడంతప్ప పైసలివ్వరని ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్ సభలో ౖకేసీఆర్ చెప్పిన మాటలు వాటినే గుర్తుకు చేశాయన్నారు. కొడుకు లొల్లి చేస్తుండు, అందుకే.. ‘హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హు జూరాబాద్ సహా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గిట్ల నే చెప్పి పైసా ఇవ్వలేదు’అని విమర్శించారు. దు బ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం కేసీఆర్ గూబగుయ్మన్పించినా సిగ్గు రా వడం లేదన్నారు. ‘సీఎం పదవి ఇవ్వాలని ఇంట్లో కొడుకు లొల్లి చేస్తుండు. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ డ్రామా చేస్తుండు’అని వ్యా ఖ్యానించారు. ‘ఇక్కడి పంచాయతీలన్నీ కేంద్ర నిధు లతో నడస్తున్నవే. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా నిధులివ్వని చరిత్ర నీది’అని మండిపడ్డారు. ‘తుక్డేగ్యాంగ్ ప్రకాశ్‌రాజ్‌తో కలసినవంటే కేసీఆర్‌లో హిందూ వ్యతిరేక భావజాలం ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. తుక్డేగ్యాంగ్ పోటీ చేస్తే జనం ఓడించిండ్రు. అయినా కలిసినవంటే కారణమేంది?’అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో కేసీఆర్ పీకిందేమీ లేదు. ఇగ దేశ రాజకీయాల్లోకి వెళ్లి పీకేదేముంది? కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ఆత్మహత్యలు పెరిగిపోయినయ్. ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. జనం తిరగబడుతుంటే, ఈ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండు’అని సంజయ్ అన్నారు. -
కమీషన్లకు కక్కుర్తీ..కలెక్టర్ నోటీసులు!
జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సరైన కారణంతో సంజాయిషి ఇవ్వని సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.37.03 లక్షల లెక్కలపై నిర్లక్ష్యం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ జె.ప్రభాకర్‌రావు, ఉపసర్పంచ్ కురిక్యాల మహేశ్, పంచాయతీ కార్యదర్శి పాషా గ్రామపంచాయతీ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే కారణాలతో కలెక్టర్ ఆరునెలల పాటు సస్పెన్షన్ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. గ్రామపంచాయతీకి చెందిన నిధులు రూ.37,03,865 సంబంధించిన రికార్డులు చూపించకపోగా కలెక్టర్ జారీచేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం సైతం ఇవ్వలేదు. దీంతో పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ముగ్గురిపై సస్పెన్షన్ విధించారు. ప్రతీ నెల రూ.9.17 కోట్లు జిల్లాలోని 380 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.9.17 కోట్లు మంజూరు చేస్తోంది. గ్రామాల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండగా, ఆయా నిధులను పల్లెప్రగతి పనులతో పాటు వైకుంఠదామాలు, పల్లెప్రకృతి వనాలు, శాని టేషన్, పంచాయతీ నిర్వహణ కోసం పాలకవర్గాలు వినియోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో సుమారు రూ.110 కోట్లు గ్రామపంచాయతీల నిధుల రూపంలో జీపీలకు చేరాయి. కొన్ని గ్రామాల్లో నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. చాలా వరకు గ్రామాల్లో శ్మశానవాటిక పనులు పూర్తి కాలేదు. డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపడంతోపాటు నిధుల్లో పారదర్శకత లేని 8 మంది సర్పంచులకు కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధర్మపురి మండలం జైన, రాజారం, రాయికల్ మండలం ధర్మాజీపేట, వెల్గటూర్ మండలం గుల్లకోట, చెగ్యాం, వెల్గటూర్, కథలాపూర్ మండలం బొమ్మెన, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచులకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దుర్వినియోగం ఇలా.. ధర్మపురి మండలంలోని జైనాలో హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన ట్రీగార్డులలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019–2020లో 1,600 ట్రీగార్డులను కొనుగోలు చేశారు. ఒక్కో ట్రీగార్డుకు రూ.54 చొప్పున రూ.86,400 చెల్లించాల్సి ఉండగా.. రూ.1.92లక్షల విలువైన ట్రీగార్డులు కొన్నట్లు రికార్డులు చూపించినట్లు నిర్ధారణయ్యింది. సాధారణ నిధుల కింద రూ.1.95లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.7,95,845, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.27,13,020 మొత్తం రూ.37,03,865 నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ నుంచి షోకాజ్ నోటీలు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లోగా స్పందించకపోవడంతో సస్పెన్షన్ చేస్తున్నట్లు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ధర్మపురి మండలంలోని రాయపట్నంలో రూ.4 లక్షలు, బుగ్గారం పంచాయతీలో రూ.2.40 లక్షలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో షోకాజ్ నోటీస్‌లు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సంజాయిసీ ఇవ్వాలని కోరారు. -
పక్కదారి పట్టిన పంచాయతీ నిధులు
పట్టించుకోని అధికారులు శివ్వంపేట: పంచాయతీ నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్న సంబందిత వివరాలను సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో సంబందిత ఉన్నతాధికారులు నిర్లక్షయ దోరణి అవలంబిస్తున్నారు. మండలంలోని నవాబుపేట గ్రామ పంచాయతీకి సంబందించిన నిధుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచాయతీ పరిధిలో అధికంగా పరిశ్రమలు ఉండడంతో పంచాయతీకి ఆదాయం భారీగా ఉంది. దీంతోపాటు బీఆర్జీఎఫ్, సాధారణ నిధులు పంచాయతీ ఖాతాలో జమ అవుతుంటాయి. మండలంలోని నవాబుపేట పంచాయతీకే అధిక ఆదాయ వనరులు ఉన్నాయి. దీన్ని ఆసరగా చేసుకొని పంచాయతీకి వచ్చిన నిధులను ఖర్చు చేయడంలో అక్రమాలకు పాల్పడిన విషయాన్ని గతనెలలో జరిగిన గ్రామసభలో సభ్యులు లేవనెత్తారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఇద్దరు కలిసి చేపట్టని పనులకు సైతం రికార్డులు సృష్టించి నిధులు కాజేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో 15లక్షల ఆదాయం రాగా అందుకు సంబందించిన ఖర్చులు పూర్తిస్థాయిలో చూపకపోవడం మూలంగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమాలకు పాల్పడిన వారిపై పూర్తి విచారణ చేపట్టి నిధులను రికవరీ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతు పంచాయతీ సభ్యులు కలెక్టరేట్లో సైతం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి నెలరోజులు అవుతున్నా నేటికి ఎలాంటి విచారణ చేపట్టలేదు. అవినీతిలో అధికారులకు సంబందం ఉండడంతోనే పూర్తి వివరాలు చెప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు బయటకు పొక్కకుండా మండల స్థాయి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆరులక్షల అవినీతి.. గత రెండు సంవత్సరాల కాలంలోగ్రామ పంచాయతీకి 15లక్షల ఆదాయం రాగా 6లక్షల వరకు అవినీతి చోటుచేసుకుందని ఉపసర్పంచ్ అశోక్‌రెడ్డి, వార్డు సభ్యులు సంగీత, వెంకటేశ్, నగేష్, ఆంజనేయులు ఆరోపించారు. సర్పంచ్ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి నరేందర్‌రెడ్డిలు కుమ్మక్కై నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో చేసిన పనులకే మల్లీ రికార్డులు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నివేదిక కోరతాం.. పంచాయతీ నిధుల్లో జరిగిన అవినీతిపై సమగ్ర నివేదిక కోరనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు ఫోన్‌ద్వారా చెప్పారు. దుర్వినియోగమైన నిధులపై సమగ్ర విచారణ చేపట్టి అవినీతి చోటుచేసుకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
పంచాయతీ నిధులు రూ.1.26 కోట్లు స్వాహా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామానికి ప్రథమ పౌరులు సర్పంచులు. అయితే, నిధుల దుర్వినియోగంతో కొందరు తమ పేరుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో నిధుల విని యోగంలో చేతివాటం చూపిస్తున్నారు. పలువురు సర్పంచులు పనులు చేయకుండానే రూ.3.23 కోట్లు కాజేశారు. 2006 నుంచి 2013 వరకు అనే క పద్దుల కింద గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల య్యాయి. వీటితోపాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీఆర్జీఎఫ్)ను ఇష్టారాజ్యంగా వాడుకున్న సర్పంచులపై నేటికీ చర్యలు లేవు. పదవి నుంచి వైదొలగిన 165 మంది మాజీ సర్పంచుల వద్దే రూ.1,25,54,516 ఉన్నాయి. 2013 జూన్‌లో జరిగిన ఎన్నికలలో కొత్త సర్పంచులు అధికారం చేపట్టారు. ఇందులో కొందరు గత సర్పంచులనే ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇదీ సంగతి నిధుల దుర్వినియోగంలో జిల్లావ్యాప్తంగా 17 మంది సర్పంచులపై ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు వెనుకబడిన ప్రాం తాల అభివృ ద్ధి నిధుల(బీఆర్జీఎఫ్)ను విడుదల చేసింది. జడ్పీ, ఎంపీ, జీపీ సెక్టార్ల కింద రూ.106.50 కోట్లు విడుదల కాగా, ఇందులో గ్రామ పంచాయతీ సెక్టారు కింద సుమా రుగా రూ. 53 కోట్ల వరకు ఉన్నాయి. ఏడాదికి రూ.21.54 కోట్ల వరకు బీఆర్జీ నిధులు విడుదల కాగా, జడ్పీ సెక్టార్‌కు 20 శాతం, మండల సెక్టార్‌కు 30 శాతం పోను గ్రామ పంచాయతీ సెక్టార్‌కు 50 శాతం కేటాయిస్తూ వచ్చా రు. ఏటా గ్రామాలలో అభివద్ధి పేరిట బీఆర్జీ నిధులను ముందస్తుగా డ్రా చేసిన ప్రజాప్రతినిధులు నిధుల వి నియోగానికి సంబంధించిన ఎంబీ(మేజర్మెంట్ బుక్)లు, యూసీ(యూటిలైజేషన్ సర్టిఫికెట్)లు సమర్పించడంలో విపరీతమైన జాప్యాన్ని ప్రదర్శించారు. ఈ వ్యవహా రంపై మూడేళ్ల తర్వాత ఆరా తీసిన అధికారులు అక్రమాలు జరిగినట్లు తేల్చారు. కొంతమంది సర్పంచుల చెక్‌పవర్ రద్దు చేసి, ఇంకొందరిపై కేసులు పెట్టారు. 2012 డిసెంబర్ నాటికి మొత్తంగా రూ.3,23,16,550 దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. 2013 మేలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, బకాయి ఉంటే పోటీకి అనర్హు లని, ఆర్ఆర్ యాక్టు, క్రిమినల్ కేసులు పెడతామని ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేసిన అధికారులు రూ.1.97 కోట్లు రికవరీ చేశారు. జూన్‌లో జరిగిన ఎన్నికలలో కొ త్త పాలకవర్గం ఎన్నిక కాగా, మాజీ సర్పంచులు 165 మంది మాత్రం రూ.1,25,54,516 తమవద్దే పెట్టుకున్నారు. హిట్ లిస్టులో 29 మంది మాజీలు రూ.1.26 కోట్ల బీఆర్జీఎఫ్ స్వాహాపై చర్యలు నోటీసులకే పరిమితం అవుతున్నాయి. జిల్లా పంచాయతీ అధికారి పలుమార్లు నోటీసులు జారీ చేసినా క్షేత్రస్థాయి అధి కారులు కొందరు స్వాహారాయుళ్లకు అండగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది. వసూలు చేయగా మిగిలిన రూ.1.26 కోట్లలో 165 మంది మాజీ సర్పంచుల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇందులో రూ. లక్ష నుంచి రూ.6.54 లక్షలకు వరకు నిధులు మింగిన 29 మంది మాజీలను హిట్‌లిస్టులో చేర్చారు. పిట్లం, బిచ్కుంద, రెంజల్, మద్నూరు, సదాశివనగర్, దోమకొండ, మాచారెడ్డి, గాంధారి, లింగంపేట, నిజాంసాగర్, సిరికొండ, బాల్కొండ, బోధన్, నవీపేట, ధర్పల్లి, డిచ్పల్లి మండలాలకు చెంది న పలువురు ఉన్నారు. అధికారుల ఉదాసీనత ఇదిలా ఉండగా, గతంలో నిధుల స్వాహాకు పాల్పడిన కొందరు సర్పంచుల నుంచి నిధులు రికవరీ చేయకుండా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శ లున్నాయి. కొత్తగా ఎన్నికైన కొందరు సర్పం చులు దీనిని అదునుగా తీసుకుని నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో 17 మం దిపై ఇటీవల ఆరోపణలు రాగా వాటిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆర్మూరు మండలం గోవింద్‌పేట సర్పంచ్ ప్రభాకర్‌కు మాత్రం షోకాజ్ నోటీసు జారీ చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులు, గ్రామ పంచాయతీ నిధులు మొత్తం రూ.3,48,337 దుర్వినియోగం అయినట్లు విచారణ జరిపిన ఆర్మూరు డీఎల్పీఓ నివేదిక సమర్పించారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం డీపీఓ ఇటీవల సర్పంచుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో సర్పంచులలో కలకలం బయలు దేరింది. ఏదేమై నా గతంలో స్వాహా అయిన నిధులను పూర్తిగా రికవరీ చేయడంతోపాటు, భవిష్యత్‌లోను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని ప్రజలు ఉన్నతాధికారుల ను కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సర్కారు నిధులను దుర్వినియోగం చేస్తే రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్ఆర్ యాక్టు) ప్రయోగించాలని, లేదా క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసినా, క్రిందిస్థాయి సిబ్బంది ఎక్కడా పాటించిన దాఖలాలు లేవు. -
తేలిన నిధుల పంచాయితీ
* జెడ్పీటీసీలకు రెండొంతులు, ప్రజాప్రతినిధులకు ఒకొంతు వాటా * ఎమ్మెల్సీలకు మొండిచేయి.. * రేపటితో ముగియనున్న ప్రతిపాదనల గడువు * 25 మండలాలనుంచే అందిన ప్రతిపాదనలు నల్లగొండ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల పంచాయితీ ఎట్టకేలకు తెగింది. ఈ పథకం కింద జిల్లాకు రూ.40 కోట్లు మంజూరైన విషయం విదితమే. అయితే ఈ నిధుల పంపకాల విషయమై గత నెల 10వ తేదీన జరిగిన జెడ్పీ పనుల స్థాయీ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సూచనల మేరకు పనులు ప్రతిపాదించాలని, నిధుల కేటాయింపులు జరపాలని ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. దీనిని వ్యతిరేకించిన జెడ్పీటీసీలు ఆ విధంగా చేస్తే తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని...అలా కాకుండా ఈ నిధుల్లో ముందుగా తమవాటా ఎంతో తేల్చాలని పట్టుబట్టారు. అయితే ఈ వివాదాన్ని సమావేశంలో కాకుండా బయట చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని అనుకున్నారు. నిధుల్లో ఎవరికెంత వాటా ఇవ్వాలనే దానిపై పరస్పరం చర్చించిన తర్వాత 2:1 నిష్పత్తి ప్రకారం పంపకాలు చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం రూ.40 కోట్ల నిధుల్లో ఒక్కో జెడ్పీటీసీకి రూ.35 లక్షలు చొప్పున ఖరారు చేశారు. 59 జెడ్పీటీసీలు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులకుగాను రూ.21 కోట్ల 35 లక్షలు కేటాయించారు. ఇక ముగ్గురు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలకు రూ.10 కోట్ల 5 లక్షలు కేటాయించారు. మిగిలిన రూ.8.60 కోట్లు జెడ్పీ చైర్మన్ ఆధీనంలో ఉంచారు. మాజీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు, మాజీ జెడ్పీటీసీలు నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిధులు కేటాయిస్తారు. ఈ పనుల ప్రతిపాదనలు పంపించే గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటికే 25 మండలాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సర్పంచ్ల తీర్మానంతోనే.. ఉపాధి హామీ నిబంధనల మేరకు పనుల ప్రతిపాదనలు సర్పం చ్ల తీర్మానంతోనే పంపించాల్సి ఉంటుంది. పనుల గుర్తింపు జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇష్టానుసారంగా జరి గినప్పటికీ సర్పంచ్ల ఆమోదంతోనే తీర్మానం చేయాలి. నిధులు కూడా సర్పంచ్ల ఖాతాల్లోకి వెళతాయి. 60:40 ప్రకారం నిధులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే 60 కూలీలకు, 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ కింద కేటాయించారు. ఈ నిధులతో కల్వర్టులు, సీసీ రోడ్లు, మెటల్ రోడ్ల మరమ్మతులు, కొత్తగా మెటల్ రోడ్ల నిర్మాణం, రోడ్లకు ఇరువైపులా చెట్ల తొలగింపు, మట్టిరోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా మట్టి పోయడం వంటి పనులు చేపడతారు. జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధుల ఇష్టానుసారం పనులు జరిగే పరిస్థితి ఉండడంతో ఆ పనులు ఏవిధంగా జరుగుతాయనే దానిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
సంబురాలకు పంచాయతీ నిధులు వాడుకోవచ్చు
మెదక్: బతుకమ్మ సంబరాలకు గ్రామ పంచాయతీ నిధులను వాడుకోవచ్చని కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. మంగళవారం మెదక్‌కు వచ్చిన ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో బతుకమ్మలు ఆడే స్థలాల్లో ప్రత్యేక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. నిమజ్జనం చేయడానికి చెరువుల వద్ద ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు గ్రామ పంచాయతీ నిధులను, పట్టణాల్లో మున్సిపాలిటీ నిధులను, జిల్లా పరిపాలన నిధులు కూడా వెచ్చిస్తున్నామన్నారు. అలాగే ఈ నెల 24 నుంచి 27 వరకు జిల్లాస్థాయి పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మెదక్ పట్టణంలో బతుకమ్మలు నిమజ్జనం చేసే ప్రదేశాలైన బంగ్లా చెరువు, మల్లంచెరువులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీఓ వనజాదేవి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కమిషనర్ వెంకటేశం తదితరులు ఉన్నారు. బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పాట్లు... సంగారెడ్డి అర్బన్: బతుకమ్మ పండుగను జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. ఈనెల 24 నుండి అక్టోబర్ 2 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు , మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్టు తె లిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో జరిగే బతుకమ్మ ఉత్సవాల్లో మహిళా ఉద్యోగులు పాల్గొంటారన్నారు. 25న డీఆర్డీఏ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఉద్యోగినులు పాల్గొంటారని, ఆదేరోజు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న మెప్మా, గృహనిర్మాణం, ట్రెజరీ శాఖల ఉద్యోగినులు బతుక మ్మ ఉత్సవాలలో పాల్గొంటారని, ఈ సందర్భంగా కోలాటం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 27న ఐసీడీఎస్, ఏపీఎంఐపీ, వ్యవసాయ శాఖ ఉద్యోగినులు పాల్గొంటారని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు పాటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న జిల్లా పరిషత్తు, సీపీఓ, వయోజన విద్యాశాఖల ఉద్యోగినులు పాల్గొంటారని, అదే రోజు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 29న పశుసంవర్థక శాఖ, ఎస్సీ,బీసి కార్పొరేషన్ల ఉద్యోగినులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 30న రెవెన్యూ , విద్యాశాఖ, సివిల్‌సప్లయ్ శాఖల ఉద్యోగినులు బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటారని తెలిపారు. అక్టోబర్ 1న డ్వామా, వైద్య ఆరోగ్య శాఖ,సహకార శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణతో పాటు మహిళలకు సంప్రదాయక వస్త్ర ధారణ పోటీలుంటాయని తెలిపారు. 2న అన్ని శాఖల ఉద్యోగులందరూ బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొంటారని అదే రోజు బహుమతి ప్రధానం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు. -
‘వంద రోజుల’ గుబులు
పల్లెల్లో పారిశుద్ద్య ప్రణాళిక ‘పంచాయ(యి)తీ’ సెలవులు తీసుకోవద్దని మెసేజ్‌లు నిధుల్లేక తలలు పట్టుకుంటున్న అధికారులు అసలే నిధుల లేమితో నీరసించి పోతున్న పంచాయతీలకు ‘వందరోజుల కార్యాచరణ ప్రణాళిక’ మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రణాళిక అమలుకు చంద్రబాబు ప్రభుత్వం పైసా విదల్చకుండా... ఉన్నతాధికారులకు ‘టార్గెట్’ పెట్టడం వారిని తీవ్ర గందర గోళానికి గురిచేస్తుంది. మచిలీపట్నం : పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే... నూతన ప్రభుత్వం వంద రోజుల పారిశుద్ధ్య ప్రణాళికను 1వ తేదీ నుంచి అమలు చేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా తాగునీటి వసతి మెరుగుదల, ఓవర్‌హెడ్ ట్యాంకుల క్లీనింగ్, పంచాయతీ, శివారు గ్రామాల్లో చెత్తా, చెదారం తొలగింపు, తాగునీటి పైప్లైన్ల రిపేరు, దోమల నివారణకు యాంటీ లార్వా పిచికారీ, డ్రెయినేజీల్లో పూడికతీత తదితర పనులు చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అన్ని పంచాయతీలకు అందాయి. మేజర్ పంచాయతీలతో పాటు మైనర్ పంచాయతీల్లోనూ నిధుల కొరత వేధిస్తుండటంతో పంచాయతీ కార్యదర్శులు ఇన్ని పనులు నిధులు లేకుండా ఎలా చేయాలని తలలు పట్టుకుంటున్నారు. ఏడాది క్రితం పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడ్డాయి. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం రూ. 18.14 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ. 1.69 కోట్లు ఈ ఏడాది మే నెలలో విడుదలయ్యాయి. నూతనంగా ఏర్పడిన పంచాయతీ పాలకవర్గాలు ఈ నిధులను వివిధ పనులకు కేటాయించేశారు. ఉన్న కొద్దిపాటి నిధులను పంచాయతీల్లోని వివిధ అవసరాలకు వినియోగించేందుకు ఉంచారు. నూతన ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని హుకుం జారీ చేసింది. ఇందుకోసం పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీల్లో నిధుల లభ్యత లేకుండా 100 రోజుల ప్రణాళిక ఎలా అమలు చేయాలనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. నేడు, రేపు సెలవులు లేవు ఆగస్టు 9, 10 తేదీల్లో శని, ఆదివారాలు వచ్చాయి. 9వ తేదీ రెండో శనివారం కాగా, 10వ తేదీ ఆదివారం వచ్చింది. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయతీ కార్యాలయాలకు సెలవు పాటించాలి. అయితే వంద రోజుల ప్రణాళిక అమలులో భాగంగా ఈ రెండు రోజుల పాటు కచ్చితంగా పంచాయతీ కార్యాలయాలు తెరిచే ఉంచాలని డీపీవో నుంచి పంచాయతీ కార్యదర్శులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌లు అందాయి. -
పంచాయతీలకు నిధుల వరద
విజయనగరం మున్సిపాలిటీ న్యూస్‌లైన్ : జిల్లాలోని పంచాయతీలకు నిధుల వరద పారింది. గత ఏడాది జిల్లాలో 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, పాలకవర్గాలు కొలువుదీరాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో వివిధ గ్రాంట్ల కింద రూ 16 కోట్ల 95 లక్షల 88 వేల 118 విడుదల కాగా...2014-15 ఆర్థిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం నిధులు కింద మరో రూ13 కోట్ల 6 లక్షల ఒక వెయ్యి 700 ఈ నెల మొదటి వారంలో విడుదలైనట్టు జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి మోహనరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. విడుదలైన నిధులను జిల్లాలోని పంచాయతీలకు 2011 సంవత్సర జనాభా లెక్క ల ఆధారంగా కేటాయించి, జిల్లా ట్రెజరీ ద్వారా మండల ట్రెజరీల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు. ఈ నిధులను పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కారం, రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు, విద్యుద్దీకరణ, రక్షిత పథకాల మరమ్మతులు, కాలువల నిర్వహణకు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కింద ఈనెల 26న మరో రూ10 కోట్ల 10 లక్షల నిధులు విడుదల కాగా, వచ్చే నెల 2లోగా వాటిని పంచాయతీలకు కేటాయించ నున్నట్టు జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. 77 గిరిజన పంచాయతీలకు రూ 46.20 లక్షలు విడుదల ః జిల్లాలోని 77 గిరిజన గ్రామాల అభివృద్ధికి సబ్ ప్లాన్ నిధులు కింద రూ 46. 20 లక్షల విడుదలయ్యాయి. ఒక్కొక్క పంచాయతీకి రూ 60వేలు చొప్పున కేటాయించారు. ఈ నిధులు వినియోగంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావలసి ఉంది. గతంలో ఇదే పద్దు కింద మంజూరు చేసిన నిధులను ఆయా పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్య పరిష్కారం, విద్యుద్దీకరణ, రక్షిత పథకాల మరమ్మతులు, కాలువల నిర్వహణకు వినియోగించగా... అదే తరహాలో గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది అభివృద్ధి ఎక్కడ ? పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఏడాది సమయం కాకముందే వివిధ గ్రాంట్ల కింద కోట్లాది రూపాయలు విడుదల కావడం శుభపరిణా మమే అయినప్పటికీ అవి ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 13వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, వృత్తిపన్నుల ఆదాయం, తలసరి గ్రాంట్ల కింద రూ 16కోట్ల 95లక్షల 88వేల 118 విడుదలయ్యాయి. ఈ నిధులతో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆ పరిస్థితి లేదు. ఇకనైనా అధికారులు స్పందించి నిధులు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.